k chandrasekhar rao venkaiah naidu telangana high court osmania general hospital congress v hanumanth rao danam nagender sridhar babu కె చంద్రశేఖర రావు వెంకయ్య నాయుడు తెలంగాణ హైకోర్టు
టీ కాంగ్రెస్: ఉస్మాయనిపై కెసిఆర్ టార్గెట్, విభజనపై వెంకయ్య లక్ష్యం
హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనం కూల్చివేతపై కాంగ్రెసు తెలంగాణ నాయకులు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావును టార్గెట్ చేశారు. అదే విధంగా, హైకోర్టు విభజనపై అటు కేసిఆర్‌నే కాకుండా ఇటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడిని లక్ష్యం చేసుకున్నారు. తెలంగాణపై వెంకయ్య నాయుడిది సవతి తల్లి ప్రేమ అని దానం నాగేందర్ విరుచుకుపడ్డారు. హైకోర్టును వెంటనే విభజించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిని కూల్చే ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని లేదంటే ఉద్యమిస్తామని కాంగ్రెస్ నేతలు మల్లుభట్టి విక్రమార్క, దానం, వి హనుమంతరావు హెచ్చరించారు. శనివారం ఉస్మానియా ఆస్పత్రికి పరిశీలించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
రాష్ర్టానికే తలమానికమైన ఉస్మానియా ఆస్పత్రిని కూల్చేస్తామనడం బాధాకరమని అన్నారు. టెక్నికల్ కమిటీ సూచనలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఉస్మానియా పక్కనే ఉన్న 10 ఎకరాల ఖాళీ స్థలంలో సకల సౌకర్యాలతో ఆస్పత్రిని నిర్మించవచ్చని వారు సూచించారు.

పాత భవనాన్ని కూల్చవద్దని, పాతభవనానికే మరమ్మత్తు చేయాలని మల్లుభట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రాన్ని తెచ్చానంటున్న కెసిఆర్, హైకోర్టు విభజనకు ఎందుకు ప్రయత్నించడం లేదని కాంగ్రెసు నాయకులు అడిగారు. కాగా, హైకోర్టు విభజన కోసం తెలంగాణ న్యాయవాదులు చేపట్టిన ధర్నాలో కాంగ్రెసు నేత శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
పార్లమెంటులో టిఆర్ఎస్ ఎంపీలు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. విభజనకు కేంద్రంపై టిఆర్ఎస్ పోరాడాలని ఆయన సూచించారు. బిజెపికి తెలంగాణ ప్రజలపై ప్రేమ ఉంటే వెంటనే హైకోర్టును విభజించాలని ఆయన డిమాండ్ చేశారు. కూతురికి మంత్రి పదవి ఇప్పించుకోవడంపై ఉన్న శ్రద్ధ కెసిఆర్‌కు హైకోర్టు విభజనపై లేదని శాసనసభ్యుడు సంపత్ కుమార్ విమర్శించారు.