టీపీసీసీ అధ్యక్షుడి పేరు వెల్లడించే వేళ..రైతు దీక్షలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు చేపట్టిన నిరసన దీక్షలు గురువారం నాటికి 28వ రోజుకు చేరుకున్నాయి. పార్లమెంట్ ఆమోదించిన ఈ మూడు వ్యవసాయ బిల్లులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ దేశవ్యాప్తంగా రైతులు ఉద్యమిస్తున్నారు. ప్రత్యేకించి- ఉత్తరాది రాష్ట్రాల రైతులు దేశ రాజధానిని ముట్టడించారు. ప్రతికూల వాతావరణం, చలిగాలులనూ లెక్క చేయట్లేదు. తమ దీక్షలను కొనసాగిస్తూనే ఉన్నారు.

కాంగ్రెస్ సహా..
ఎముకలు కొరికే చలిలోనూ వారి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. రైతులు చేపట్టిన ఈ దీక్షలకు కాంగ్రెస్ ఇదివరకే మద్దతు ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23 ప్రతిపక్ష పార్టీలు రైతులకు అండగా నిలుస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నేతలు రైతు దీక్షల్లో పాల్గొంటున్నారు. తమ సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. తామున్నామనే భరోసాను ఇస్తున్నారు. తాజాగా- తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ లోక్సభ సభ్యులు రైతు దీక్షలో పాల్గొన్నారు. వారితో కలిసి నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శించారు.

టీ కాంగ్రెస్ ఎంపీల సంఘీభావం..
కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో కలిసి వారు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ఉదయం 11 గంటల సమయంలో కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి (నల్లగొండ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (భువనగిరి), ఎనుముల రేవంత్ రెడ్డి (మల్కాజ్గిరి) న్యూఢిల్లీ శివార్లలో రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ నేతలతో కలిసి వారు రైతు ఆందోళన శిబిరాలకు వెళ్లారు. వారిని పరామర్శించారు. అనంతరం వారితో కలిసి ప్లకార్డులను ప్రదర్శించారు.

కార్పొరేటీకరణ కోసమే
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ చేతుల్లో పెట్టడానికే ఈ మూడు వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చిందని మండిపడ్డారు. మూడు వ్యవసాయ బిల్లుల ఫలితంగా వ్యవసాయ రంగం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు కనీస మద్దతు ధర దక్కదని, ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ కంపెనీల యజమానులు నిర్దేశించిన రేటుకు రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడం మినహా మరోమార్గం ఉండదని విమర్శించారు.

టీపీసీసీ అధ్యక్షుడి పేరును వెల్లడించే వేళ..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరును ఖరారు చేయడానికి హస్తినలో ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. పార్టీలో వివిధ నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. నేడో రేపో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి పేరును ఖరారు చేయబోతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి నైతిక బాధ్యతగా ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ స్థానం కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఇందులో రేవంత్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ పరిణమాల ఆ ముగ్గురూ కలిసి రైతు దీక్షలో పాల్గొనడం చర్చనీయాంశమైంది.