వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2016లో తెలంగాణపై యునిసెఫ్: కరవుతో ఛిద్రమైన బతుకు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: సకాలంలో వర్షాలు కురవక.. వేసిన పంటలు ఎండిపోయి.. పెట్టిన పెట్టుబడి రాక విలవిలలాడిన అన్నదాత చివరకు పంటల సాగులో కీలకమైన పశువులకు సరిపడా పశుగ్రాసం కూడా తీసుకురాలేక సతమతం అయ్యారు. తెలంగాణలో 2015-16లో వర్షాభావంతో పలు గ్రామాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు భూగర్భ జలాలు పడిపోవడంతో కనీసం దాహార్తి తీర్చుకునేందుకు అవసరమైన నీటిబొట్టు కోసం ప్రజలు అల్లాడిపోయారు.

తాగేందుకు నీళ్లు లేక, తినడానికి కనీసం రెండు పూటలా తిండి దొరక్క ఖాళీ కడుపుతో నెట్టుకొచ్చారు. పొట్టచేతబట్టుకుని కుటుంబాలను వదిలిపెట్టి, ఇతర నగరాలకు, రాష్ట్రాలకూ వలస వెళ్లారు. గమ్మత్తేమిటంటే ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్ కూడా తాగునీటి సమస్యతో సతమతమైన పరిస్థితి నెలకొంది. 11.1 మిలియన్ల టన్నుల ఆహార ధాన్యాలకు 6.5 మిలియన్ల టన్నులు మాత్రమే దిగుబడి సాధిస్తే, వరి ధాన్యం కేవలం 3.5 మిలియన్ల టన్నులు మాత్రమే దిగుబడి లభించింది. ఇక పప్పు ధాన్యాలు, నూనె గింజల దిగుబడుల పరిస్థితి సరేసరి.

ఈ విపత్కర పరిస్థితులతోనే తెలంగాణలో బాలికలు, మహిళల అక్రమ రవాణా కేసులు నమోదయ్యాయి. ప్రాంతీయ భౌగోళిక పరిస్థితుల నేపథ్యంలో బాల్య వివాహాలు అధికమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. 2015 - 16లో తెలంగాణలోని మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాల్లోని పలు గ్రామాల్లో సామాజిక, ఆర్థిక పరిస్థితులపై యునిసెఫ్ జరిపిన అధ్యయన నివేదిక సారాంశం ఇది. ఇందులో కరవు పరిస్థితులతో ప్రజల జీవన విధానం ఛిద్రమైన తీరు, జూన్‌ 2016 వరకు జనం ఎదుర్కొన్న ఇబ్బందులు మాటల్లో చెప్పనలవి కాదంటే అతిశేయోక్తి కాదు.

Telangana had faces severe drought in 2016

పాలమూరు, మెదక్ జిల్లాల్లో అత్యల్ప వర్షపాతం

రాష్ట్రంలో అత్యంత కరవు జిల్లాలుగా పూర్వ మహబూబ్‌నగర్‌, మెదక్‌ జిల్లాలు ఉన్నాయి. తక్కువ వర్షపాతం నమోదు కావడానికి తోడు భూగర్భ జలాలూ 60 మీటర్ల లోతునకు పడిపోయాయి. తాగునీటి వనరులు లేకపోవడం, చెరువులు ఎండిపోవడంతో ప్రజలు పంట పొలాల్లోని నీళ్లు, కాలువలు, బోర్లు, ట్యాంకర్లపై ఆధారపడ్డారు. నారాయణఖేడ్‌, అందోలు‌, బొమ్మరాసిపేట, హన్వాడ, కల్వకుర్తి మండలాల పరిధిలో 20 లీటర్ల తాగునీటి డబ్బా కావాలంటే రూ. 60 - 80 చెల్లించాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రభుత్వం చిన్నారులు, బాలింతలు, గర్భిణుల పౌష్టికాహారం కోసం కార్యక్రమాలు చేపడుతున్నా కరవు పరిస్థితులతో ఎక్కువ మంది ఒక్కపూట దొరికిన ఆహారంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కడుపునిండా తిండిలేక బాలింతలు, గర్భిణులతో పాటు సాధారణ మహిళలు బలహీనంగా మారినట్లు యునిసెఫ్ నిర్వహించిన అధ్యయనం వివరించింది. రాష్ట్రంలోని రైతు సంఘాలు తెలిపిన వివరాల ప్రకారం మహబూబ్ నగర్, రంగారెడ్డి, రంగారెడ్డి, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి 14 లక్షల మంది పుణె, ముంబై, భీవండి, అహ్మదాబాద్, సూరత్ తదితర పట్టణాలకు వలస వెళ్లారు.

సరైన ఆహారం లభించక చిన్నారుల్లో తగ్గిన వృద్ధి

దాదాపు 7.5 శాతం కుటుంబాలు తీవ్ర తిండి కోసం అలమటించి పోయాయి. సరైన ఆహారం లభించక 12.3 శాతం మంది చిన్నారుల్లో శారీరక వృద్ధి తగ్గి, బలహీనంగా తయారైనట్లు తేలింది. తెలంగాణలో ఇంటికి నీళ్లు మోసుకువచ్చే వారిలో 47శాతం మంది మహిళలే. ట్యాంకర్లు సకాలంలో రాకపోవడం, దూర ప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితులతో వారిపై మరింత భారం పెరిగింది.

నిత్యావసరాలకు నీళ్లు దొరక్కపోవడంతో బాలికలు, మహిళల్లో 21 శాతం మంది వ్యక్తిగత పరిశుభ్రత, భోజనానికి ముందు చేతులు కడగడమూ మానేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అవగతమవుతూనే ఉన్నది. నీటి కరవు కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని కుటుంబాలకు వ్యక్తిగత మరుగుదొడ్లు ఉన్నా, వీరిలో దాదాపు 22 శాతం మంది వినియోగించలేదు. సర్వేలో 95 శాతం మంది ఎక్కువగా బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జనకు వెళ్తున్నట్లు తెలిసింది.

చిన్నారులపై కుటుంబ బాధ్యతలు

కరవుతో ఉపాధి కోసం తల్లిదండ్రులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లటం పెరిగింది. కుటుంబాల్లో నెలకొన్న పరిస్థితులతో మానవ అక్రమ రవాణా, బాల్యవివాహాలు పెరిగిపోయాయి. కొన్ని సందర్భాల్లో పిల్లలు సైతం చిన్నచిన్న పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలబడాల్సి వచ్చింది. పాఠశాలల్లో విద్యార్థుల హాజరులో తేడాలు నెలకొన్నాయి. స్థానికంగా ఉన్న చెరువులు, కుంటలు కూడా ఎండిపోవడంతో చేపల వేట ప్రధాన జీవనాధారంగా కాలం వెళ్లదీస్తున్న కుటుంబాల్లోని మహిళలు పనుల కోసం ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లారు. వేసవిలో కుటుంబానికి ఆధారంగా నిలిచే పశువులకు గడ్డి కూడా దొరక్క వాటిని 30 శాతం తక్కువ ధరకే తెగనమ్మేసుకున్నారు.

రక్షిత మంచినీరు లేక జనం అనారోగ్యం పాలు

అంతెందుకు..రక్షిత మంచినీరు దొరక్క జనం అనారోగ్యం పాలయ్యారు. మలేరియా, టైఫాయిడ్‌ లాంటి కేసులు అధికంగా నమోదయ్యాయి. ఫ్లోరైడ్‌తో ఎముకల బలహీనత, దంతాలపై గారలు ఏర్పడ్డాయి. భవిష్యత్‌లో కరవు పరిస్థితులు ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం, ప్రత్యామ్నాయ ఉపాధిఏర్పాట్లు అవసరమని యునిసెఫ్‌ ప్రభుత్వానికి సూచించింది. పీహెచ్‌సీల్లో వైద్యులు, సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేయాలంది. వేసవిలోనూ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం అందించడాన్ని అభినందించింది.

English summary
UNICEF Says Telangana had faces severe drought conditions in 2015 - 16 and so many families had migrated to cities for work particularly in Mahaboob Nagar and Medak Districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X