వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎపిది తొండి, మొండి వాదన: విద్యాసాగర రావు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కృష్ణా జలాల వాడకంపై ఆంధ్రప్రదేశ్‌ తొండి, మొండి వాదన చేస్తోందని తెలంగాణ ప్రభుత్వ సాగునీటి సలహాదారు ఆర్‌.విద్యాసాగర్‌రావు మండిపడ్డారు. ఇప్పటికే ఆ రాష్ట్రానికి రావాల్సిన వాటా కంటే ఎక్కువ నీటిని వాడుకుందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు సంక్రమించిన హక్కులను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఒక రాష్ట్రానికి గుండుగుత్తగా కేటాయించిన నీటిని ఆ రాష్ట్రం తన స్థానిక పరిస్థితులు, ప్రాజెక్టుల ఆయకట్టుకు అనుగుణంగా వినియోగించుకోవచ్చంటూ బచావత్‌ ట్రిబ్యునల్‌ స్పష్టం చేసిందని తెలిపారు. కానీ... ఏపీ సర్కారు తన మొండి వాదనలతో తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

ఆదివారం ఆయన సచివాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వితండవాదం చేస్తోందని ఆయన అన్నారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం కృష్ణా నదిలో లభ్యమయ్యే 2,130 టీఎంసీల నికర జలాలను మూడు రాష్ట్రాలకు గుండుగుత్త(ఎంబ్లాక్‌)గా పంపిణీ చేశారని వివరించారు. మహారాష్ట్రకు 525, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల చొప్పున పంపిణీ జరిగిందన్నారు.

రాష్ట్ర విభజన అనంతరం ఈ 811 టీఎంసీలలో ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీల వాటాలు వచ్చాయన్నారు. అయితే ఈ సంవత్సరం జూన్‌ ఒకటో తేది నుంచి ఇప్పటివరకు కృష్ణా నది, తన ఉప నదుల నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌ జలాశయాల్లోకి 552.8 టీఎంసీల నికర జలాలు చేరాయని, దానిని పరిగణనలోకి తీసుకుంటే.. తెలంగాణ 41.61 శాతం వాటా కింద 230 టీంఎసీలు, ఆంధ్రప్రదేశ్‌ 58.39 శాతం వాటా కింద 322.8 టీఎంసీల నీటిని వాడుకోవాలని వివరించారు. ఈ వాటాల జోలికి పోవద్దంటున్న ఏపీ.. రెండు జలాశయాల్లోని నీటిని సాగర్‌, కృష్ణా డెల్టా ఆయకట్టు అవసరాల మేరకు వినియోగించుకోవాలని చెబుతోందన్నారు.

Telangana has evidence to disapprove AP's claim on water

తెలంగాణలోని జూరాల, భీమా, కోటిపల్లి వాగు, ఊకచెట్టు వాగు, డిండి, కోయిల్‌సాగర్‌ వంటి చిన్న నీటి ప్రాజెక్టుల కింద 88.60 టీఎంసీల నీటిని వినియోగించుకునే అనుమతి ఉందన్నారు. వివిధ కారణాల రీ త్యా ఇప్పటివరకు 78 టీఎంసీ నీటిని మాత్రమే తెలంగాణ వాడుకుందన్నారు. మిగతా నీటిని నాగార్జున సాగర్‌లో స్టోర్‌ చేసుకుని ఎడమగట్టు కాలువ ద్వారా ఆయకట్టు రబీ పంటకు వాడుకుంటామని చెబుతున్నామన్నా రు. కానీ ఈ న్యాయమైన హక్కును ఏపీ ప్రభుత్వం ఒప్పుకోవడం లేదన్నారు.

బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ఆధారంగానే.. కృష్ణా డెల్టా ఆధునికీకరణ కారణంగా 29 టీఎంసీలు మిగులుతాయని లెక్కలు కట్టి, వాటిలో 20 టీఎంసీలను భీమాకు, 9 టీఎంసీలను పులిచింతలకు కేటాయించారని వివరించారు. ఆల్మట్టి ఎత్తును పెంచిన సందర్భంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, బచావత్‌ ట్రిబ్యునల్‌ కేటాయించిన నీటిని రాష్ట్రాలు ఇష్టానుసారంగా ప్రాజెక్టులకు పునఃపంపిణీ చేసుకోవచ్చంటూ సుప్రీం కోర్టు తీర్పునిచ్చిందన్నారు.

ఇక కృష్ణా డెల్టాకు సాగర్‌ నీటి విడుదల పైనా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని విద్యాసాగర్‌రావు విమర్శించారు. బచావత్‌ ట్రిబ్యునల్‌ కృష్ణా డెల్టాకు 181.2 టీఎంసీల నీటిని అనుమతించిందన్నారు. కృష్ణా డెల్టా ఆధునికీకరణ నేపథ్యంలో 29 టీఎంసీల నీరు మిగులుతుందన్న కారణంతో ఈ 29 టీఎంసీలలో భీమాకు 20, పులిచింతలకు 9 టీఎంసీలను కేటాయించారన్నారు. ఈ 29 టీఎంసీలు పోగా మిగతా 152.2 టీఎంసీలు కృష్ణా డెల్టాకు వినియోగించాలన్నారు.

కృష్టా డెల్టా ఆధునికీకరణ పూర్తయితే తప్ప.. తెలంగాణలోని భీమాకు 20 టీఎంసీలు ఇవ్వడం కుదరదంటూ కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటూ ఏపీ సర్కారు వాదిస్తోందన్నారు. కృష్ణా డెల్టాకు అనుమతించిన 181.2 టీఎంసీలలో 18.9 టీఎంసీలు మాత్రమే సాగర్‌ దిగువ ప్రకాశం బ్యారేజీ వరకున్న క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి లభిస్తున్నాయంటూ ఏపీ ప్రభుత్వం చెబుతుందన్నారు. బ్రిజే్‌షకుమార్‌ ట్రిబ్యునల్‌ తన తీర్పులో సాగర్‌ దిగువన లభ్యమయ్యే నీరు 101.2 టీఎంసీలని స్పష్టం చేసిందన్నారు.

అంటే కృష్ణా డెల్టాకు సవరించిన అంచనాల ప్రకారం రావాల్సిన 152.2 టీఎంసీలలో 101.2 టీఎంసీలు పోనూ.. సాగర్‌ నుంచి కేవలం 51 టీఎంసీలు.. పులిచింతల 9 టీంఎసీలు కలుపుకొంటే మొత్తం 60 టీఎంసీల నీటిని సాగర్‌ నుంచి వదలాల్సి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం కృష్ణా డెల్టాకు 167 టీఎంసీల నీటిని వాడుకుంటే.. సాగర్‌ నుంచి 132 టీఎంసీలు విడుదల చేశారని, అంటే 36 టీఎంసీలు సాగర్‌ దిగువన లభించాయని అన్నారు. కానీ సాగర్‌ దిగువన 18.9 టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉందని ఆంద్రప్రదేశ్‌ వాదిస్తోందన్నారు.

కృష్ణా నీటి వాడకానికి సంబంధించి కేంద్రంలో అపెక్స్‌ కౌన్సిల్‌ ఉందని, దీనికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి చైర్మన్‌గా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. చైర్మన్‌ ఏది చెబితే అదే తుది తీర్పు అవుతుందని తెలిపారు. ఈ విషయాన్ని అక్కడే తేల్చుకుంటామని.. కేంద్రంలో తెలంగాణ వాదమే గెలుస్తుందని విద్యాసాగర్‌ రావు అన్నారు.

English summary
Telangana government advisor Vidayasagar Rao said that Telangana has evidence to disapprove AP's claim on Krishna river water
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X