ఆ వ్యాఖ్యలు నిజమని తేలితే జైలుకే..: టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టు వార్నింగ్
హైదరాబాద్: వరి విత్తనాల విక్రయాలపై కోర్టులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు తేలితే జైలుకు పంపిస్తామంటూ మాజీ కలెక్టర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని హైకోర్టు హెచ్చరించింది. కోర్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా పేర్కొంటూ అఫిడవిట్ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డికి కోర్టు స్పష్టం చేసింది.
గత అక్టోబర్ నెలలో సిద్దిపేటలో వ్యవసాయ అధికారులు, విత్తన డీలర్లతో నిర్వహించిన సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆరోపణలున్న విషయం తెలిసిందే. యాసంగి పంట కోసం వరి విత్తనాలు అమ్మితే కేసులు పెడతామన్నారు. అంతేగాక, హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నా వదిలిపెట్టబోమని వెంకట్రామిరెడ్డి అన్నారన్న ఆరోపణలకు సంబంధించి సుమోటో వ్యాజ్యంపై హైకోర్టు సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం విచారణ చేపట్టింది.

గత ఆదేశాల మేరకు వెంకట్రామిరెడ్డి హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అయితే, ఆ అఫిడవిట్లో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి ప్రస్తావనే లేకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు సంబంధించి వ్యాఖ్యలు చేశారా? లేదా? సూటిగా పేర్కొంటూ తాజాగా మరో అఫిడవిట్ దాఖలు చేయాలని వెంకట్రామిరెడ్డిని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
కోర్టు ధిక్కరణ వ్యాఖ్యలు చేసినట్లు తేలితే చర్యలు తప్పవని, జైలుకు పంపిస్తామని హైకోర్టు హెచ్చరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది. కాగా, గతంలో వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై పలు రాజకీయ పార్టీలు కూడా తీవ్రంగా స్పందించిన విషయం తెలిసిందే. సిద్దిపేట కలెక్టర్గా ఉన్న సమయంలో వెంకట్రామిరెడ్డి వరి విత్తనాల విక్రయం, రైతులు వరి పంట వేయొద్దంటూ వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ, కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు మండిపడ్డాయి.