తెలంగాణ ఇంటర్ ఫలితాలు 28న విడుదల: 15 రోజుల్లోనే సప్లిమెంటరీ పరీక్ష
హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ ఫలితాల విడుదల తేదీ ఖరారైంది. జూన్ 28న ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు వెల్లడిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.
సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ గతంలోనే ప్రకటించడం గమనార్హం.

ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లో 'రైతు బంధు'
తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి 10వేల చొప్పున ఇప్పటి వరకు రూ.50447.33కోట్లు రైతుల ఖాతాలో జమచేసినట్లు మంత్రి వివరించారు.
రైతు బీమా పథకం ద్వారా ఇప్పటి వరకు 83118 మంది రైతు కుటుంబాలకు 4150.90కోట్లు పరిహారం అందజేసినట్లు తెలిపారు. ఎకరాకు 5వేల చొప్పున తక్కువ భూవిస్తీర్ణం కలిగిన వారితో ప్రారంభించి ఆరోహణా క్రమంలో సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేస్తారు. ఇవాళ ఒక ఎకరం లోపుతో ప్రారంభించి రోజుకు ఒక ఎకరా చొప్పున పెంచుకుంటూ పోతారు. మంచిరోజు అన్న ఉద్దేశంతో శుక్రవారం రోజే పది మంది రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. వచ్చే నెల మొదటి వారంలో రైతుబంధు చెల్లింపుల ప్రక్రియ పూర్తి కానుంది.