వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జల వివాదం... జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణ గైర్హాజరు...

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌లోని జలసౌధలో జరుగుతున్న గోదావరి నదీ యాజమాన్య బోర్డు(GRMB) సమన్వయ కమిటీ సమావేశానికి తెలంగాణకు చెందిన అధికారులు గైర్హాజరయ్యారు. ఏపీ తరుపున ఈఎన్‌సీ,ట్రాన్స్ కో,జెన్ కో అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఇటీవల కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్,దానికి సంబంధించిన కార్యచరణ ప్రణాళికపై ఈ భేటీలో చర్చించనున్నారు.

సమన్వయ కమిటీ సమావేశానికి కేంద్ర జలశక్తి అధికారులు,ఇరు రాష్ట్రాల ఈఎన్‌సీలు,ట్రాన్స్ కో,జెన్ కో ఎండీలు,మరో ఇద్దరు బోర్డు సభ్యులు పాల్గొనాల్సి ఉంది. అయితే తెలంగాణ అధికారులు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశంలో గెజిట్ నోటిఫికేషన్‌పై చర్చించకుండా... నేరుగా సమన్వయ కమిటీ సమావేశంలో దానిపై చర్చించడంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. పూర్తి స్థాయి బోర్డు సమావేశం జరిపి ఇరు రాష్ట్రాల అభిప్రాయాలు తెలుసుకున్నాకే సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాల్సిందని అభిప్రాయపడుతోంది.

 telangana officials absent to grmb Coordination Committee meeting

ఇదే విషయంపై గతంలో జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు తెలంగాణ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజనీర్(ఈఎన్‌సీ) మురళీధర్ లేఖ రాశారు. దీనిపై స్పందించిన బోర్డు... మొదట సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కావాలని కోరింది. గెజిట్ నోటిఫికేషన్ పట్ల అనుసరించే కార్యాచరణ,ప్రణాళిక,నిర్దిష్ట గడువులపై సమన్వయ కమిటీలో చర్చించాక... అనంతరం బోర్డు పూర్తి స్థాయి భేటీ ఉంటుందని తెలిపింది. అయితే ఈ ప్రతిపాదనపై వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ జీఆర్ఎంబీ సమన్వయ కమిటీ సమావేశానికి గైర్హాజరైంది.

ఇరు రాష్ట్రాల్లో కృష్ణా,గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి తీసుకొస్తూ గత నెలలో గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌తో ప్రాజెక్టులపై అజమాయిషీ కేంద్రం చేతిలోకి వెళ్లనుంది. అదే సమయంలో బోర్డుల నిర్వహణకు మాత్రం రాష్ట్రాలే ఖర్చులు భరించాల్సి ఉంటుంది. బోర్డు నిర్వహణకు చెరో రూ.250కోట్లు చొప్పున ఇవ్వాలని కేంద్రం రెండు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే కేంద్రం చేతికి ప్రాజెక్టులు వెళ్లడంపై తెలంగాణ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.

కృష్ణా,గోదావరి ప్రాజెక్టులపై ఇరు రాష్ట్రాలు చాలాకాలంగా పరస్పర విమర్శలు,ఆరోపణలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. గోదావరిపై తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం,సీతారామ ప్రాజెక్టులపై గతంలో ఏపీ కేంద్రానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలి కాలంలో కృష్ణా నదిపై తెలంగాణ ప్రాజెక్టులు అక్రమమని ఏపీ ఫిర్యాదులు చేసింది. మరోవైపు ఏపీ నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు,రాయలసీమ విస్తరణ ప్రాజెక్టులు అక్రమమని తెలంగాణ ఆరోపిస్తోంది. ఈ వివాదం అంతకంతకూ ముదురుతోన్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదులపై ఉన్న అన్ని ప్రాజెక్టులు, జల వనరులు తమ అధీనంలోకి తీసుకుంటూ కేంద్రం గెజిట్ విడుదల చేసింది.తాజా సమన్వయ కమిటీ సమావేశంలో ఈ గెజిట్‌పై చర్చించనున్నారు.

English summary
Telangana officials were absent for the Godavari River management Board (GRMB) coordination committee meeting held at Jalasaudha in Hyderabad. ENC, Transco and Genco officials on behalf of AP attended the meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X