తెలంగాణ పదో తరగతి ఫలితాలు విడుదల: 90 శాతం ఉత్తీర్ణత, బాలికలదే పైచేయి
హైదరాబాద్: తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ)లో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం ఉదయం ఫలితాలను విడుదల చేశారు.
పదో తరగతి ఫలితాల్లో 90 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పదో తరగతి ఫలితాల్లో బాలురు 87.61 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 92.45 శాతం ఉత్తీర్ణత నమోదు చేశారు.

3,007 పాఠశాలల్లో విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించారు. 15 పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదని మంత్రి మంత్రి సబిత తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా మెుదటి స్థానంలో నిలవగా, రెండో స్థానంలో నిర్మల్, మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లాలు నిలిచాయని సబిత తెలిపారు.

ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. కాగా, మే 23 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 11,401 పాఠశాలలకు చెందిన 5,09,275 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు.