టీడీపీకి షాక్: టీఆర్ఎస్ఎల్పీలో టీడీఎల్పీ విలీనం, కేసీఆర్ పార్టీలోకి టీడీపీ ఏకకైక ఎమ్మెల్యే మెచ్చా
హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికిని కాపాడుకుంటూ వస్తున్న ఏకైక ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గులాబీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

తాజాగా, ఆశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో అసెంబ్లీలో టీడీపీకి ప్రాతినిథ్యం లేకుండా పోయింది. ఈ క్రమంలో బుధవారం టీడీపీ శాసనసభాపక్షాన్ని టీఆర్ఎస్ శాసనసభపంక్షలో విలీనం చేశారు. దీనికి సంబంధించిన లేఖను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు.

దీంతో టీడీఎల్పీ విలీనంపై శాసనసభ కార్యదర్శి నర్సింహాచారి అధికారిక బులిటెన్ జారీ చేశారు. ఈ పరిణామంతో అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది.
టీడీపీకి రాజీనామా చేసిన మెచ్చా నాగేశ్వరరావు.. సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితోనూ భేటీ అయ్యారు.