ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్: టీకాంగ్రెస్ లో టెన్షన్.. మణిక్కం ఠాకూర్ ఆసక్తికరట్వీట్స్; మతలబు అదేనా!!
ప్రముఖ రాజకీయవేత్త ప్రశాంత్ కిషోర్ ఎపిసోడ్ కాంగ్రెస్ పార్టీలో టెన్షన్ పుట్టిస్తోంది. ప్రశాంత్ కిషోర్ టిఆర్ఎస్ పార్టీ కోసం రాజకీయ వ్యూహకర్తగా పని చేయడం దాదాపు ఖరారైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో అలజడి మొదలైంది. దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడం కోసం, బిజెపిని ఓడించడం లక్ష్యంగా ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నాలు సాగిస్తున్న విషయం అలా ఉంచితే, తెలంగాణాలో టీఆర్ఎస్ కోసం పీకే పని చెయ్యటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైంది.

దేశంలో కాంగ్రెస్ కోసం.. రాష్ట్రంలో టీఆర్ఎస్ కోసం .. పీకే వ్యూహాలు
జాతీయపార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో పట్టు కోసం ప్రయత్నాలు సాగిస్తుంది. ఈ క్రమంలో పీకే సలహాలు, సూచనలపై అధ్యయనం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పీకే ను పార్టీలో చేర్చుకునే అవకాశాలపై అధ్యయనం చేస్తుంది. ఇక ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కోసం పని చేయడానికి వ్యవస్థాపక దినోత్సవం నుంచి కార్యాచరణ ప్రారంభించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే రెండు రోజులపాటు సీఎం కేసీఆర్ కేటీఆర్ లతో పీకే చర్చలు జరిపారు టీఆర్ఎస్ కు సేవలు అందించడం కోసం ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఐ ప్యాక్ సంతకాలు కూడా చేసింది. రెండేళ్లపాటు ఈ ఒప్పందం ఇరు వర్గాల మధ్య అమల్లో ఉండనున్నాయి.
అటు కాంగ్రెస్ , ఇటు టీఆర్ఎస్ .. పీకే ఎపిసోడ్ పై కాంగ్రెస్ నేతల్లో అసంతృప్తి
ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ కు స్నేహ హస్తం అందిస్తూనే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ తో కలిసి పనిచేయడం కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం రుచించడం లేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చెబితే అలా నడుచుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ, వారిలో పీకే చేరిక విషయంలో తీవ్ర అసంతృప్తి ఉంది అన్న విషయం అందరికీ అర్థమవుతుంది. టీఆర్ఎస్ కోసం పీకే పని చేస్తున్నారన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు పీకేపై తీవ్ర విమర్శలు చేశారు.
మణిక్కం ఠాకూర్ ఆసక్తికర ట్వీట్స్
తాజాగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మణిక్కం ఠాగూర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ఎస్ తో పీకే కలయికను ఉద్దేశించి ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్స్ చేస్తున్నారు. నీ శత్రువు తో ఎవరైతే స్నేహం చేస్తారో వారిని ఎప్పుడూ నమ్మలేము అంటూ ఒక ట్వీట్ లో పేర్కొన్న మణిక్కం ఠాగూర్ ఇది నిజమేనా అంటూ ప్రశ్నించారు. ఆశ వదులుకోవద్దు అంటూ మరో ట్వీట్ కూడా చేశారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ ట్వీట్లు చేసినా, తాజా పీకే ఎపిసోడ్ తోనే ఈ ట్వీట్లు చేశారని ఆసక్తికర చర్చ జరుగుతోంది

నేడు సోనియాతో పీకే భేటీపై కాంగ్రెస్ వర్గాలలో టెన్షన్
ఇదిలా ఉంటే మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోనూ ప్రశాంత్ కిషోర్ మరోమారు భేటీ కానున్నారు. సోమవారం సోనియా గాంధీ నివాసంలో జరిగిన ఈ భేటీకి ప్రశాంత్ కిషోర్ హాజరుకానున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్న చర్చ కాంగ్రెస్ పార్టీ నాయకులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో పీకే చేరిక, ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలపై కూడా సోనియా గాంధీ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ఈ భేటీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు. ఏది ఏమైనా తెలంగాణ కాంగ్రెస్ నేతలలో మాత్రం పీకే ఎపిసోడ్ తీవ్ర అసంతృప్తిని రేకెత్తిస్తుంది.