ఆర్టీసీ ఉద్యోగులకు అండగా న్యాయస్థానం.. అంతిమ విజయం మాదే అంటున్న కార్మికలోకం!
హైదరాబాద్ : తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మె 41వ రోజుకు చేరుకుంది. కార్మికుల హక్కుల సాధన కోసం వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూనే ఉన్నారు. రాజకీయ పార్టీ నేతలు కూడా వారికి మద్దత్తు తెలుపుతున్నప్పటికి ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొన్నట్టు ఎక్కడా అంతగా కనిపించడం లేదు. అంతే కాకుండా కార్మికుల పక్షాన ప్రభుత్వాన్ని పెద్దగా ప్రశ్నిస్తున్న దాఖలాలు కూడా కనిపించడం లేదు. కార్మికుల తరుపున ప్రతిపక్షాల పాత్రను తెలంగాణ న్యాయస్దానం పోషిస్తున్నట్టు తెలుస్తోంది. కార్మికులకు అండగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రతిపక్షాలు చేసే ప్రయత్నాలను కూడా న్యాయస్దానమే చేస్తున్నట్టు చర్చ జరుగుతోంది.

తెలంగాణలో కొత్త ప్రతిపక్షం.. సమ్మె అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్న న్యాయస్ధానం..
తెలంగాణలో ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు అన్ని రాజకీయ పార్గీలు భేషరతుగా మద్దత్తు ప్రకటించాయి. అధికార గులాబీ పార్టీ, ఎంఐఎం పార్టీలు మినహా అన్ని పార్టీలు ఉద్యోగులకు సంఘీభావాన్ని ప్రకటించారు. అంతటితో వారి పాత్ర పూర్తయినట్టు పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారు. కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని ప్రశ్నిచండంగాని, ఉద్యమాన్ని మరింత తారాస్దాయికి తీసుకు వెళ్లడానికి ప్రణాళికలు గాని రచించడం లేదు. ముఖ్యంగా గృహ నిర్బంధాలు, ధర్నా కార్యక్రమాలకు వచ్చీ రాగానే అరెస్టు అవ్వడంతో ప్రతిపక్షాల నిరసన కార్యక్రమాలు అంతగా వెలుగులోకి రావడం లేదనే చర్చ కూడా జరుగుతోంది.

ప్రతిపక్షాలు ప్రశ్నించడం లేదు.. అన్నీ హైకోర్టు పరిదిలోనే...
అంతే కాకుండా సమ్మె అంశం న్యాయస్ధానం పరిధిలో ఉంది కదా అని ఏ ఒక్క నేత కూడా సమ్మె పట్ల గానీ, ప్రభుత్వ విధానం పట్ల గాని నోరు మెదపకపోడం సమ్మెలో వారి పాత్రను ప్రతిబింబిస్తోంది. దీంతో ఆర్టీసి కార్మికుల తరుపున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ప్రతిపక్షపార్టీల నాయకులు నామమాత్రంగా వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే ప్రభుత్వాన్ని ప్రతిపక్ష పార్టీలకన్నా ఎక్కువగా తెలంగాణ న్యాయస్దానం ప్రశ్నిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. దీంతో ఆర్టీసి కార్మికులు, జేఏసీ నాయకులు కూడా న్యాయస్దానం పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. కోర్టుల ద్వారానే తమకు న్యాయం జరుగుతుందనే భరోసాను వ్యక్తం చేస్తున్నారు.

కార్మికులతో చర్చలు జరపాలి.. వాస్తవాల కోసం త్రిసభ్య కమిటీ వేస్తామన్న న్యాయస్దానం..
తెలంగాణలో టీఆర్ఎస్ది అధికార పక్షం. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షం. అధికార పార్టీ విధానాలను ముందుగా విమర్శించాల్సింది కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రమే. ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం ప్రతిపక్ష పార్టీల పాత్రను హైకోర్టు నిర్వహిస్తున్నట్టుగా ఉందని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు జోక్యం చేసుకున్న నాటినుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని సూచించింది. కానీ, ప్రభుత్వం దానిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తమకిచ్చిన నివేదికలు కూడా తప్పుగా ఇస్తారా అని అక్షింతలు వేసింది.

తెలంగాణలో ప్రతిపక్షాల పాత్ర న్యాయస్దానం చేస్తోంది.. సర్వత్రా ఇదే చర్చ..
చివరకు ఆర్టీసీ కార్మికులపై ఎస్మా ఉందని ప్రభుత్వం చెప్పడాన్ని కోర్టు తోసిపుచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె ఎస్మా కిందకు రాదని, ప్రభుత్వం ఇష్టానుసారం ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తామంటే కుదరదని తేల్చి చెప్పింది. చివరకు సమస్యను ప్రభుత్వం పరిష్కరించకుంటే తామే పరిష్కరిస్తాం అని సర్కారుకు ఆల్టిమేటం కూడా ఇచ్చింది. అంతే కాకుండా సమ్మె పరిష్కారం కోసం రిటైర్డ్ జడ్జీలతో కమిటీ వేస్తామతని కూడా తెలిపింది. కాని ప్రభుత్వం అందుకు ఒప్పుకోలేదు. ఐతే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీల పాత్రను తెలంగాణ న్యాయస్థానం పోషిస్తుందన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!