అస్త్ర సన్యాసం చేసేది లేదు .. సమ్మె కొనసాగింపే ...ఆర్టీసీ కార్మిక జేఏసీ నిర్ణయం
ఆర్టీసీ కార్మికుల సమ్మె పై హై కోర్టు ఇచ్చిన తీర్పుతో డోలాయమాన పరిస్థితిలో పడింది కార్మిక లోకం. అయితే అనేక తర్జనభర్జనల అనంతరం సమ్మెను కొనసాగించాలని కార్మిక జేఏసీ నిర్ణయం తీసుకుంది. నిన్న సడక్ బంద్ ను వాయిదా వేసుకుని మరి భేటీ అయిన ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు లేబర్ కోర్టు తీర్పు వచ్చేవరకు పోరాటం చేయాల్సిందేనని ఫైనల్ గా నిర్ణయం తీసుకున్నారు.

హైకోర్టు తీర్పుతో టెన్షన్లో ఆర్టీసీ కార్మిక జేఏసీ
ఆర్టీసీ సమ్మెపై సుదీర్ఘ విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం తమకు కొంత పరిధి ఉంటుందని, ప్రభుత్వాన్ని తాము ఆదేశించలేమని ,ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టబద్దమా కాదా అనేది లేబర్ కోర్టు తేలుస్తుందని,రెండు వారాల్లో లేబర్ కమిషనర్ ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించాలని పేర్కొంటూ ఆర్టీసీ కార్మికుల సమ్మె కు సంబంధించి బంతిని లేబర్ కోర్టు లోకి నెట్టింది. కోర్టు తమ సమస్యలు పరిష్కరించలేమని చేతులెత్తేయడంతో ఆర్టీసీ కార్మిక జెఎసి సమ్మె కొనసాగించాలా, లేక సమ్మె విరమించుకుని ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేందుకు ప్రయత్నం చేయాలా?అన్న సందిగ్ధంలో పడింది.

ఆర్టీసీ కార్మిక సంఘాల కీలక భేటీ
ఇక ఈ నేపధ్యంలోనే ఆర్టీసీ కార్మిక జేఏసీ మరోమారు కీలక భేటీ నిర్వహించింది. సమ్మె కొనసాగింపా లేకా విరమణా..? కార్మికులు తిరిగి ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలా ? ఒకవేళ కార్మికులు సమ్మె విరమించి తిరిగి ఉద్యోగాల్లో చేరాలనుకున్నా ప్రభుత్వం సానుకూలత వ్యక్తం చేస్తుందా ? వంటి అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఒక సమయంలో నిన్న సాయంత్రం సమ్మె విరమించే ఆలోచన కూడా చేశారు . అయితే 46 రోజుల పాటు పోరాటం చేసి, ఎంతో మంది ఆర్టీసీ కార్మికులను పోగొట్టుకొని ఇప్పుడు కనీసం ఒక డిమాండ్ కూడా పరిష్కరించుకోకుండా సమ్మెను విరమించడం మంచిది కాదనే అభిప్రాయం ఆర్టీసీ కార్మిక సంఘాల్లో వ్యక్తమైంది.

న్యాయ నిపుణులతో సంప్రదిస్తామన్న జేఏసీ ... లేబర్ కోర్టు తీర్పు తర్వాతే సమ్మెపై నిర్ణయం
హైకోర్టులో కార్మికులు తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని భావిస్తే హైకోర్టు, లేబర్ కోర్టు ఈ సమస్యను పరిష్కరిస్తుందని చెప్పటంతో లేబర్ కోర్ట్ లో తమ సమస్య పరిష్కారం అవుతుందా లేదా అన్న సందిగ్ధత ఆర్టీసీ కార్మికులలో నెలకొంది. ఇక ఈ నేపథ్యంలోనే భేటీ అయిన ఆర్టీసీ కార్మిక జెఎసి కార్మిక కోర్టు తీర్పు పరిశీలించాకే సమ్మెపై తుది నిర్ణయం తీసుకుంటామని ప్రకటన చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు తుది కాపీ అందాక న్యాయనిపుణులతో సమావేశమవుతామని, లీగల్ గా ఏ విధంగా ముందుకు వెళ్లవచ్చు అనేది చూస్తామని ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి పేర్కొన్నారు.

వేర్వేరుగా సమావేశం అయిన ఆర్టీసీ కార్మిక సంఘాలు
సుదీర్ఘ చర్చల అనంతరం సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు వేరువేరుగా నిర్వహించిన సమావేశాల్లో కార్మికుల అభిప్రాయాలను సైతం తీసుకొని చర్చించారు. ఎల్బీనగర్ లో తెలంగాణ మజ్దూర్ యూనియన్, సాగర్ రింగ్ రోడ్ లో ఎంప్లాయిస్ యూనియన్ ఇలా ఆర్టీసీ కార్మిక సంఘాలన్నీ వేరు వేరు ప్రాంతాలలో ఎవరికి వారు సమావేశాలు నిర్వహించారు. ఇక అన్ని సమావేశాలలో సేకరించిన అభిప్రాయాలను ఏకాభిప్రాయంగా భావించి ఆర్టీసీ కార్మిక జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి సమ్మెను కొనసాగిస్తామని ప్రకటించారు.

90% కార్మికులు సమ్మెను కొనసాగించాలనే అభిప్రాయం
90% కార్మికులు సమ్మెను కొనసాగించాలని అభిప్రాయం వ్యక్తం చేశారని, ఆర్టీసీ కార్మిక కుటుంబాల కోసం ప్రాణాలు వదిలిన అమరులైన ఆర్టీసీ కార్మికుల కోసమైనా సమ్మెను కొనసాగించాలని కార్మికులు చెప్పారన్నారు. అస్త్ర సన్యాసం చేసేది లేదని ప్రకటించారు.కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా పోరాటం సాగించాలని నిర్ణయించామని అశ్వద్ధామ రెడ్డి. 16 రాష్ట్రాల్లోని కార్మికులు తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సమ్మె యధాతధం ... ఐక్యంగా ముందుకు వెళ్ళాలని జేఏసీ నిర్ణయం
సమ్మెను మరింత ఉధృతం చేసి, ముందుకు వెళ్లాలి అన్నది ఆర్టీసీ కార్మికుల ఉద్దేశం కావడంతో కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ప్రస్తుతానికి సమ్మె యధాతధంగా కొనసాగుతుంది అని ప్రకటించారు. ఇక సమ్మె భవిష్యత్ లో ఎలా ఉంటుంది అనేది మాత్రం లేబర్ కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఆలోచిద్దామని భావిస్తోంది ఆర్టీసీ కార్మిక జేఏసీ .
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!