కేసీఆర్ పతనానికి వరంగల్ లో మూడో అడుగు.. టీఆర్ఎస్ ను తరిమి కొట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఒక రోజు కూడా సెలవు మోడీ పాలన చేస్తుంటే, రాష్ట్రంలో ఒక్క రోజు కూడా సెక్రటేరియట్ కి రాకుండా కేసీఆర్ పాలిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కెసిఆర్ పతనానికి రాష్ట్రంలో మొదటి అడుగు దుబ్బాకలో, రెండవ అడుగు హైదరాబాదులో పడిందని, మూడవ అడుగు వరంగల్ నగరంలో పడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ పర్యటనతో పార్టీలో జోష్ .. గ్రేటర్ వరంగల్ ఎన్నికలే లక్ష్యంగా

బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ పై కిషన్ రెడ్డి ధ్వజం
టీవిఆర్ గార్డెన్ లోజరిగిన బీజేపీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి వరంగల్లో కాషాయం జెండా ఎగరాలని , టిఆర్ఎస్ పార్టీ పై బిజెపి కార్యకర్తలు ఏ రకమైన ఉద్యమానికైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు . 2023 లో బిజెపి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని పేర్కొన్న కిషన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజలు, ఉద్యోగులు, యువత ,మహిళలు అందరూ బిజెపి రావాలని కోరుకుంటున్నారు అంటూ పేర్కొన్నారు.
దేశంలో అవినీతికి తావులేకుండా మోడీ పరిపాలన సాగిస్తుంటే, రాష్ట్రంలో వేల కోట్ల అవినీతి తో సీఎం కేసీఆర్ పరిపాలన సాగిస్తున్నారని ఫైర్ అయ్యారు .

సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వరంగల్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని ఫైర్
వరంగల్ నగర సర్వతోముఖాభివృద్ధి కోసం మోడీ పథకాలు అందిస్తున్నారని, సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వరంగల్ నగరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాదులో ఆదరాబాదరాగా ఎన్నికలు పెట్టినా, టిఆర్ఎస్ పార్టీ కుయుక్తులకు పాల్పడినా గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని, హైదరాబాదులో మజ్లిస్ లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి పుట్టగతులు లేవని విమర్శించారు . టిఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు అన్నారు కిషన్ రెడ్డి .

కెసిఆర్ ,కేటీఆర్ బట్టలు విప్పుకొని తిరిగినా సరే 2023 లో బీజేపీడే అధికారం
తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని మండిపడ్డారు. తండ్రి , కొడుకుల కుటుంబ పాలన పోవాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని, అది బీజేపీతోనే సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు . కెసిఆర్ ,కేటీఆర్ ఏం చేసినా, బట్టలు విప్పుకొని తిరిగినా సరే 2023 లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు
. రానున్న గ్రేటర్ వరంగల్ ఎన్నికలను చైతన్యవంతమైన ఓరుగల్లు ప్రాంతంలో, రజాకార్లను తరిమికొట్టిన గడ్డమీద, తెలంగాణ ఉద్యమంలో పోరాట స్ఫూర్తిని చాటుతూ టిఆర్ఎస్ పార్టీని తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చారు.

మమతా బెనర్జీలా కేసీఆర్ ది కూడా రాక్షస పాలనే .. బీజేపీశ్రేణులు పోరాటం చెయ్యాల్సిందే
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ రాక్షస పాలన పై బీజేపీ పోరాడుతుందని, ఇక్కడ కూడా అలాంటి రాక్షస పాలనే ఉందని బీజేపీ శ్రేణులు గట్టిగా పని చేయాలని కోరుతున్నా అని కిషన్ రెడ్డి చెప్పారు. కార్యకర్తలే బిజెపికి ఆయువుపట్టు అని పేర్కొన్న కిషన్ రెడ్డి తన వ్యాఖ్యలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని మరింత పెంచారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల దూకుడును ఇప్పటి నుంచే కొనసాగించాలని చెప్పిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు కాషాయ దండు సై అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రావుపద్మ, మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, మాజీ మంత్రి విజయరామారావు , మాజీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.