Tollywood Drug Case:ఛార్జ్‌షీట్‌లో కనిపించని బడా సెలబ్రిటీల పేర్లు.. ఆర్టీఐ ద్వారా సమాచారం..!
హైదరాబాద్ : డ్రగ్స్ వ్యవహారం బాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా డ్రగ్స్ పై పెద్ద చర్చ నడుస్తున్న క్రమంలో అప్పుడెప్పుడో టాలీవుడ్‌ను షేక్ చేసి ఆ తర్వాత మరుగున పడ్డ డ్రగ్స్ వ్యవహారం మళ్లీ తెరపైకొచ్చింది.ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ డ్రగ్స్ వ్యవహారంపై ఆర్టీఐకి పిటిషన్ పెట్టుకోగా ఎక్సైజ్ శాఖ సమాధానం ఇచ్చింది. దీనిపై స్థానిక మీడియా ఛానెల్ కథనాన్ని ప్రచురించింది.

మొత్తం 12 కేసులు.. 8 కేసులకు మాత్రమే చార్జ్‌షీట్
స్థానిక మీడియా ప్రచురించిన కథనం ప్రకారం... టాలీవుడ్‌ను కుదిపేసిన డ్రగ్స్ వ్యవహారంలో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎక్సైజ్ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో మొత్తం 12 కేసులు నమోదు కాగా కేవలం ఎనిమిది కేసులపైనే చార్జ్‌షీట్ దాఖలైంది. మిగతా నాలుగు ఛార్జ్షీట్లపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మీడియా తన కథనంలో పేర్కొంది. ఇక అసలు విషయానికొస్తే కొన్నేళ్ల క్రితం డ్రగ్ పెడ్లర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో మాదక ద్రవ్యాలతో సంబంధం ఉన్న పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ ప్రముఖులందరినీ పిలిచి విచారణ చేసింది.

చార్జ్‌షీట్‌లో పెడ్లర్స్ మరియు స్టూడెంట్స్ పేర్లు
ఇక తాజాగా తెలిసిన సమాచారం మేరకు చార్జ్‌షీట్‌లో డ్రగ్ పెడ్లర్ల పేర్లు, విద్యార్థుల పేర్లు మాత్రమే ఉన్నాయి. సినీ ప్రముఖలు పేర్లు ఎక్కడా కనిపించలేదని ఆ మీడియా తన కథనంలో పేర్కొంది. చార్జ్షీట్లలో సినీ ప్రముఖలు పేర్లు కనిపించకపోవడంపై ఆర్టీఐలో పిటిషన్ దాఖలు చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖుల పేర్లు లేకుండా 8 చార్జ్షీట్లు దాఖలు కావడాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ప్రశ్నిస్తోంది. చార్జ్‌షీట్‌లో మొత్తం 72 మంది పేర్లు ఉండగా అందులో కేవలం 12 మంది సినీ ప్రముఖలు పేర్లను మాత్రమే ప్రస్తావించింది. టాలీవుడ్‌కు సంబంధించి మరో నాలుగు కేసులపై ఎక్సైజ్ శాఖ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

కొరియర్ల ద్వారా డ్రగ్స్ సప్లయ్
జర్మనీ , ఇంగ్లాండ్ నుంచి కొరియర్ల ద్వారా డ్రగ్స్ సరఫరా జరిగేదని ఎక్సైజ్ శాఖ విచారణలో తేలింది. కొకైన్, ఎల్ఎస్డీలు సప్లయ్ అయినట్లు సమాచారం. దీన్ని ఓ వెబ్సైట్ నుంచి ఆన్లైన్లో కొందరు విద్యార్థులు బుక్ చేసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ పేర్కొంది. గతంలో టాలీవుడ్‌ను షేక్ చేసిన డ్రగ్స్ కేసులో పలువురు ప్రముఖులను విచారణ చేయడం జరిగింది. ఇందులో పూరీజగన్నాథ్, ఛార్మీ, రవితేజ, ముమైత్ ఖాన్, సుబ్బరాజు, నందు, నవదీప్, తరుణ్‌లు విచారణకు హాజరయ్యారు. తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో హైదరాబాదుకు కూడా ఈ లింకులు ఉన్నాయేమో అనే అనుమానం చాలామందిలో ఉంది. ఇక తాజాగా దియా మీర్జా పేరు కూడా డ్రగ్స్ వ్యవహారంలో బయటపడింది. ఆమెతో పాటు ఆమె మేనేజర్‌కు కూడా సమన్లు ఇవ్వనున్నట్లు సమాచారం.