అస్సాం సీఎంపై క్రిమినల్ కేసులు.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు : పోలీసులకు రేవంత్ రెడ్డి డెడ్‌లైన్
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆపార్టీ నేతలు తీవ్రస్ధాయిలో మండిపడుతున్నారు. తక్షణమే ఆయనను సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అస్సాం సీఎంపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కేసులు నమోదు చేయకపోతే పోలీస్ స్టేషన్ల ఎదుటే ధర్నాకు దిగుతామని హెచ్చరించారు..

అస్సాం సీఎంపై జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు
ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రిపై హిమంత బిశ్వశర్మపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈసందర్భంగా ప్రధాని మోదీ, అస్సాం సీఎంలపై విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ నిస్సిగ్గుగా హిమంత బిశ్వ శర్మను సమర్ధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. అసోం సీఎంపై చర్యలు తీసుకోవడంలో ఆ రాష్ట్ర పోలీస్, ఎన్నికల వ్యవస్థలు విఫలం అయ్యాయన్నారు.

మాతృమూర్తులకు అవమానం
అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ వ్యాఖ్యలతో దేశంలోని మాతృమూర్తులకు అవమానం జరిగిందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అందుకే తాము తెలంగాణలో కేసులు పెడుతున్నామని చెప్పారు . తెలంగాణ పోలీసులు వెంటనే అసోం సీఎంపై క్రిమినల్ కేసులు పెట్టి నోటీస్‌లు పంపాలని డిమాండ్ చేశారు. బిశ్వ శర్మను అరెస్ట్ చేసి తీసుకురావాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఓ స్పెషల్ టీంను ఏర్పాటు చేయాలన్నారు. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు.

పోలీసులకు రేవంత్ డెడ్ లైన్
అటు తెలంగాణ పోలీసులకు రేవంత్ రెడ్డి డెడ్ లైన్ పెట్టారు. వచ్చే 48 గంటల్లోగా అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. లేని పక్షంలో పోలీస్ స్టేషన్ల ముందే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తానే స్వయంగా ఈనెల 16వ తేదిన హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. రాహుల్ గాంధీపై అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగత దాడి కాదని, మహిళలపై చేసిన దాడి అని రేవంత్ అభివర్ణించారు. ఈనెల 18న కాంగ్రెస్ మహిళ నేతలు రేణుక చౌదరి, గీతారెడ్డి నాయకత్వంలో మహిళ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారని రేవంత్ రెడ్డి తెలిపారు. అస్సాం సీఎంపై ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని హెచ్చరించారు.