మీడియా పెద్దలను నమ్ముకుంటే నట్టేట: రేవంత్ రెడ్డి సొంత ఛానల్: ఆ జర్నలిస్ట్ రాజీనామా అందుకేనా?
హైదరాబాద్: రాజకీయాల్లో నిలబడాలి..రాణించాలి.. సత్తా చాటాలీ అంటే- ప్రజల మద్దతు బలంగా ఉండాలనేది ఒకప్పటి మాట. జనం అండగా ఉంటే తిరుగు ఉండదు ఏ నాయకుడికైనా. ప్రజలే ఆయన తరఫున ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారు. ఇప్పుడు పరిస్థితి మారింది. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే ప్రజల కంటే ఎక్కువగా మీడియా అవసరం ఉంది.. ఉండాలి. మీడియా పెద్దల ఆశీర్వాదాన్ని, అందులో పనిచేసే జర్నలిస్టుల మెప్పును పొందగలిగిన పార్టీ గానీ, రాజకీయ నాయకుడు గానీ సుదీర్ఘకాలం పాటు రాజకీయాల్లో నిలవగలుగుతాడు.

మీడియా పెద్దలను కలిసినా..
ఈ విషయం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డికి తెలియనిది కాదు. అందుకే- పీసీసీ చీఫ్‌గా పగ్గాలను సైతం అందుకోకముందే మీడియా మొఘల్స్‌ను మర్యాదపూరకంగా కలిశారు. వారి మద్దతును కూడబెట్టే ప్రయత్నం చేశారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తారనే ముద్ర ఉందా మీడియా పెద్దలకు. వారి నుంచి ఆశించినంత అండ లభించలేదనే రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు.

నమ్ముకుంటే లాభం లేదనుకున్న రేవంత్..
ఆ మీడియా పెద్దలు ఏపీ రాజకీయాల మీదే పూర్తిస్థాయిలో దృష్టి సారించారని, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి రంధ్రాన్వేషణ చేయడంపైనే ఎక్కువగా దృష్టి పెట్టారనే అభిప్రాయాలు ఉన్నాయి. వారిని నమ్ముకుంటే లాభం లేదనుకున్నారని, అందుకే సొంతంగా ఓ శాటిలైట్ న్యూస్ ఛానల్‌ను ఏర్పాటు చేసుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారని తెలుస్తోంది.

ప్రత్యామ్నాయంగా..
లేదా- ప్రస్తుతం మనుగడలో ఉన్న ఏదైనా ఛానల్‌కు పార్టీ తరఫున ఫండింగ్ చేయడం ద్వారా అనుకూలంగా వార్తలను ప్రసారం చేయించుకోవాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఉన్నారని అంటున్నారు. దీనికంటే ముందు- ఓ యూట్యూబ్ ఛానల్‌ను నెలకొల్పాలని, దాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన తరువాత.. అదే పేరుతో ఛానల్‌ను నెలకొల్పుకోవచ్చని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికోసం ఆయన గ్రౌండ్ లెవెల్లో వర్కవుట్ చేశారని, అంటున్నారు.

ఆ జర్నలిస్ట్ రాజీనామా అందుకేనా..
ఇందులో భాగంగా తనకు సన్నిహితంగా ఉండే కొందరు మీడియా ప్రతినిధులు, మీడియా సంస్థల అధినేతలను కూడా సంప్రదించారనే ప్రచారం ఊపందుకుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంక్‌లో ఉండే ఓ న్యూస్ ఛానల్లో సుదీర్ఘకాలం పాటు పని చేసిన ఓ సీనియర్ జర్నలిస్ట్.. రాజీనామా చేయడానికి ఇదే కారణమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఆ సీనియర్ జర్నలిస్ట్ తెలంగాణకు చెందిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

శాటిలైట్ వల్ల ఇబ్బందులు..
ఒకేసారి కొత్తగా శాటిలైట్ న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తే వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయోననే ఆలోచనతో తొలుత యూట్యూబ్ ఛానల్‌ను నెలకొల్పాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని జనంలోకి తీసుకెళ్లి, విజయవంతం చేసిన తరువాత సొంతంగా పార్టీ తరఫున ఛానల్ ఏర్పాటు చేయాలనే నిర్ణయంలో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికోసం ఆయన కొందరు సీనియర్ ఎలక్ట్రానిక్ మీడియా సన్నిహితులు, ప్రతినిధులతో చర్చించారని, అన్నీ సవ్యంగా సాగితే నెలరోజుల్లో ఈ ఛానల్ అందుబాటులోకి వస్తుందనే అంటున్నారు.

యూట్యూబ్ ఛానల్..
ముందుగా యూట్యూబ్ చానల్‌ను స్టార్ట్ చేసి, అనంతరం దాన్నే 24 గంటలూ కార్యక్రమాలు ప్రసారమయ్యే చానల్‌గా మార్చాలనే ఆలోచనతో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుంటున్నారని తెలిసింది. ఇందులో భాగంగా ఆయన మీడియాలో పెద్ద తలకాయలుగా పేరొందిన వాళ్లతో చర్చిస్తున్నారని సమాచారం. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన మీడియా ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోందని, దీన్ని తట్టుకుని పార్టీని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లాలంటే సొంతంగా ఓ ఛానల్ తప్పనిసరిగా అవసరమని రేవంత్ రెడ్డి ఓ నిశ్చితాభిప్రాయానికి వచ్చారని సమాచారం.

వచ్చే సంవత్సరమే ఎన్నికలు..
వచ్చే సంవత్సరమే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఒకరకంగా ఇది ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు. 2023 చివరిలో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది. ఈ పరిస్థితుల మధ్య వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కావడంతో మీడియా పాత్ర కీలకమని రేవంత్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారని చెబుతున్నారు కొందరు పార్టీ నాయకులు. ఒకరి మీద ఆధారపడకుండా తానే ఒక చానల్‌ను పెడితే- తన ఆలోచనలకు అనుగుణంగా దాన్ని తీర్చిదిద్దవచ్చని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది.