మోదీ చక్రవర్తి అయితే.. కేసీఆర్ సామంత రాజు.. జైల్ భరోకు రేవంత్ రెడ్డి పిలుపు
దేశ ప్రజల హక్కులను ప్రధాని నరేంద్ర మోదీ కాలరాస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఫెడరల్ స్పూర్పికి విరుద్దంగా వ్యవహారిస్తున్న రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తుందని విమర్శించారు. 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాంధీభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, తెలంగాణ కేసీఆర్ ప్రజలను పట్టి పీడిస్తున్నారని దుయ్యబట్టారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.

రైతులను చంపండి అని మోదీ ప్రొత్సహిస్తున్నారా?
కార్పొరేట్ శక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అంబాని, అదానీలకు వంత పాడుతున్నాయని విమర్శించారు. అన్నదాతలను కారుతో తొక్కి చంపిన మంత్రిని ఇంకా తన మంత్రివర్గంలో కొనసాగిస్తున్నారనంటే అర్థం ఎంటని ప్రశ్నించారు. రైతులను చంపండి అని మోదీ ప్రొత్సహిస్తున్నారా?.. అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఫిబ్రవరిలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని ఆరోపించారు. ప్రధాని కార్యాలయం బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

మోదీ చక్రవర్తి అయితే .. కేసీఆర్ సామంత రాజు
బీజేపీ రాక్షస పాలనలో ప్రధాని మోదీ చక్రవర్తి అయితే .. తెలంగాణ సీఎం కేసీఆర్ సామంత రాజు అంటూ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. మోదీ, కేసీఆర్ లాంటి నేతలు ప్రజలను పట్టి పీడిస్తున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్ ఎక్కడ ఉంటారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగ, ఉపాధి లేక తెలంగాణలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో రాక్షస పాలన
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ కుటుంబమే బాగుపడిందే తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేది లేదన్నారు రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ రాక్షస పాలన ప్రజలు చీదరించుకుంటున్నారన్నారు. నిరుద్యోగులు, ఉద్యమకారులు, మేథావులు మళ్లీ ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు పాలకులను కలిసి వినతి పత్రం ఇద్దామంటే కనీసం సచివాలయం కూడా లేదని విమర్శలు గుప్పించారు. పోలీసులు కేసీఆర్కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పాలన
దేశాన్ని కాంగ్రెస్ పార్టీ శక్తివంతంగా తీర్చిదిద్దిందని రేవంత్ రెడ్డి అన్నారు. కీలక చట్టాలను తెచ్చిందన్నారు. కానీ మోదీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ పాలన సాగిస్తోందని విరుచుకుపడ్డారు. కీలక చట్టాలపై పార్లమెంటులో చర్చలకు కూడా తావు లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి మోదీ, తెలంగాణకు కేసీఆర్ శనిలా దాపురించారని దుయ్యబట్టారు.

జైల్ భరో సిద్ధం కండి..
తెలంగాణలో ప్రజలకు భద్రత లేకుండా పోయిందని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ఖమ్మంలో మిర్చి రైతులు గిట్టుబాటు ధర కోసం ఉద్యమిస్తే కేసులు పెట్టి దొంగల్లా జైల్లో పెట్టారని మండిపడ్డారు. నెరేళ్లలో ఇసుక మాఫియాను ప్రశ్నిస్తే యువకులను అరెస్ట్ చేసి హంసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రచలంలో ఆదివాసీ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి దుర్మార్గంగా వ్యవహరించారని దుయ్యబట్టారు. కేసీఆర్ రాక్షస పాలనకు వ్యతిరేకంగా త్వరలో జైల్ భరో చేయడానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.