రేవంత్ రెడ్డికి సోకిన కరోనా: వైరస్ బారిన పడ్డ స్టార్ హీరో..ఆయన భార్య: కట్టుతప్పినట్టే
హైదరాబాద్: దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుదల బాట పట్టింది. రెండు రోజుల వ్యవధిలో 15 వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. కొత్తగా 33,750కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. అదే సమయంలో- ఒమిక్రాన్ వేరియంట్ విస్తృతమౌతోంది.

రేవంత్ రెడ్డికి కోవిడ్..
దేశంలో ఇప్పటిదాకా నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 1,700కు చేరుకున్నాయి. రోజురోజుకూ ఇవి పెరుగుతున్నాయి. తెలంగాణలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుదల బాట పట్టాయి. ఇప్పటిదాకా 67 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వారిలో 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. తాజాగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధినేత రేవంత్ రెడ్డి కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా తెలియజేశారు.
సోషల్ మీడియాలో పోస్ట్..
ఈ మేరకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ఈ సమాచారాన్ని పోస్ట్ చేశారు. తనకు కరోనా వైరస్ సోకిందని పేర్కొన్నారు. ఈ మధ్యకాలంలో తనను కలిసిన వారందరూ కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన పడొద్దని రేవంత్ రెడ్డి కోరారు.

జ్వర లక్షణాలు..
రెండు రోజులుగా రేవంత్ రెడ్డి జ్వరం, దగ్గ, శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఆయనకు కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేశారు డాక్టర్లు. ఆ రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయి. దీనితో ఆయన ఐసొలేషన్‌లోకి వెళ్లారు. డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. త్వరలోనే తాను సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు. తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టింగులను చేయించుకోవాలని కోరారు.

జాన్ అబ్రహం.. ఆయన భార్యకూ
అటు బాలీవుడ్‌లోనూ కోవిడ్ మహమ్మారి కలకలం రేపింది. స్టార్ హీరో జాన్ అబ్రహం కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన భార్య ప్రియా రుంచాల్కు కూడా కోవిడ్ సోకింది. వారిద్దరూ కరోనా పాజిటివ్‌గా తేలింది. వారిద్దరూ ఇదివరకే కరోనా వైరస్ రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్నారు. అయినప్పటికీ.. వైరస్ లక్షణాలు తమలో కనిపించాయని జాన్ అబ్రహం తెలిపారు. కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలో 33 వేలకు పైగా
ఇదిలావుండగా.. దేశంలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. దేశంలో ఒక్క రోజు వ్యవధిలో 33,750 కేసులు నమోదయ్యాయి. 10,846 మంది డిశ్చార్జ్ అయ్యారు. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. 123 మంది ఈ మహమ్మారికి బలి అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,45,582 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటిదాకా 3,42,95,407 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 4,81,893 మంది మరణించారు.