టీపీసీసీ చీఫ్ పదవి కోసం మాజీమంత్రుల ఆసక్తి,, కాంగ్రెస్ గేమ్ ప్లాన్ ఇదే!
హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. ఒక్క ఛాన్స్ ఇస్తే తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంత ఖర్చైనా పెట్టేందుకు తాము సిద్దమేనని కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ నాయకత్వానికి బంపర్ ఆఫర్ ఇస్తున్నారు.
2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది.ఈ ఎన్నికల సమయానికి ముందుగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.అయితే ఎన్నికల తర్వాతే అధికారికంగా రాష్ట్రం ఏర్పాటైంది.అయితే తెలంగాణ రాష్ట్రం ఇచ్చినందున ఈ ఎన్నికల్లో తమకు అనుకూలమైన ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ భావించింది.
కానీ, కాంగ్రెస్ పార్టీ కేవలం 20 స్థానాలకే పరిమితమైంది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నుండి విజయం సాధించిన కొందరు ఎమ్మెల్యే కూడ టిఆర్ఎస్ గూటికి చేరారు.అయితే వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీకి సమర్థవంతమైన నాయకత్వం అవసరమని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.
గత ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్ గా పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు.అయితే పార్టీ నాయకత్వం సమర్థవంతంగా ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించలేకపోయింది.గత ఎన్నికల సమయంలో చేసిన తప్పిదాలను ఈ ఎన్నికల సమయంలో చేయకూడదని కాంగ్రెస్ పార్టీ బావిస్తోంది. తమకు నాయకత్వబాధ్యతలను అప్పగిస్తే పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని కొందరు పార్టీ నాయకులు చెబుతున్నారు.

పీసీపీ పీఠం కోసం పోటాపోటీ
తెలంగాణ పీసీపీ పీఠం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. తమకు పార్టీ పగ్గాలను అప్పగిస్తే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకుగాను ఎంతైనా ఖర్చును భరిస్తామని కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నాయకులు పార్టీ నాయకత్వం వద్ద చెబుతున్నారు.ఒక్కఛాన్స్ తమకు పీసీసీ అధ్యక్షపదవిని ఇవ్వాలని పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నారు.
మాజీమంత్రులు దానం నాగేందర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డికె అరుణ లు పీసీసీ అధ్యక్షపదవిని ఆశిస్తున్నారు. పార్టీ నాయకత్వ బాధ్యతలను తమకు అప్పగిస్తే పార్టీని అధికారంలోకి తీసుకువస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు.అయితే ఇందుకోసం ఎంతైనా ఖర్చు చేసేందుకు సిద్దమేనని ప్రకటిస్తున్నారు.

రిజర్వ్ డ్ అసెంబ్లీ స్థానాలపై కేంద్రీకరణ
తెలంగాణ రాష్ట్రంలో 2019 లో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ రిజర్వ్ డ్ అసెంబ్లీ స్థానాలపై కేంద్రీకరించి పనిచేస్తోంది. ఈ మేరకు ఇటీవల జరిగిన పంజాబ్ రాష్ట్రంలో కూడ ఇదే తరహా చేసిన ప్రయోగం ఆ పార్టికి మంచి ఫలితాలను ఇచ్చింది.అయితే అదే ప్రయోగాన్ని తెలంగాణ రాష్ట్రంలో కూడ అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ అమలుచేయనుంది.ఈ రిజర్వ్ డ్ అసెంబ్లీ స్థానాల్లో పార్టీని పటిష్టం చేసేందుకుగాను ఎంపిక చేసిన కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు.

పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు
2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేయలేదు. పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యను కాకుండా మరోకరిని ఆ సమయంలో పీసీసీ చీఫ్ నియమిస్తే పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. ప్రధానంగా రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకులకు ఈ పదవిని కట్టబెడితే పరిస్థితి మరోలా ఉండేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అభిప్రాయంతో ఉన్నారు. కర్ణుడి చావుకు కారణాలు అనేకం ఉన్నట్టుగా 2014 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఓటమికి అనేక కారణాలున్నాయని ఆ పార్టీ నాయకులు అభిప్రాయంతో ఉన్నారు.అయితే గత ఎన్నికల్లో చేసిన తప్పులను ఈ దఫా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నారు.

పార్టీ కోసం పనిచేసే నాయకులతో రాహుల్ సమావేశాలు
రానున్న ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపిక చేసిన నాయకులతో ఇటీవల సమావేశమయ్యారు. పార్టీ కోసం పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించే నాయకుల కోసం రాహుల్ గాంధీ అన్వేషిస్తున్నారు. ఇటీవల తెలంగాణకు చెందిన డికె అరుణ, సంపత్ కుమార్ తదితరులు రాహుల్ గాందీతో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేసే విషయమై చర్చించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ సంస్థాగత పరిస్థితులు, ఇతర రాజకీయపార్టీలతో పొత్తుల విషయమై ఆయన చర్చించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకుగాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చర్యలను చేపట్టింది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!