చూసినవాళ్లు నివ్వెరపోయారు: దానంతట అదే బావిలో పడ్డ ట్రాక్టర్..
కొంతమంది యువకులు దాని వెనకాలే పరిగెత్తినా అప్పటికే ట్రాక్టర్ బావిలో పడిపోయింది.
మెదక్: జిల్లా పరిధిలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ ట్రాక్టర్ ఎవరి ప్రమేయం లేకుండానే.. దానంతట అదే కొద్దిదూరం వెళ్లి బావిలో పడిపోయింది. వెనకాలే పరిగెత్తిన కొంతమంది యువకులు ఏం జరుగుతుందో అర్థం గాక నివ్వెరపోయారు. ఈలోపే ట్రాక్టర్ బావిలో పడిపోవడంతో అంతా షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా శివంపేట మండలం చండి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బావిలో పడిపోయిన ట్రాక్టర్ తొలుత ఓ ప్రమాదానికి కారణమైంది. కరెంటు స్తంభాల లోడుతో వెళ్తున్న సమయంలో నలుగురిని ఢీకొట్టడంతో ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ప్రమాద సమయంలో ట్రాక్టర్ వెనుకభాగం తిరగబడింది.
రోడ్డుకు అడ్డంగా ట్రాక్టర్ నిలవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ప్రొక్లెయిన్ ను రప్పించి రోడ్డుకు అడ్డంగా పడిపోయిన ట్రాక్టర్ వెనుకభాగాన్ని లేపే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ప్రొక్లెయినర్ ట్రాక్టర్ వెనుకభాగాన్ని లేపగానే.. దానంతట అదే ట్రాక్టర్ కొద్దిదూరం ముందుకెళ్లింది.
ఆ ప్రదేశం కాస్త పల్లంగా ఉండటంతోనే ట్రాక్టర్ అలా దానంతట అదే కిందకు పరిగెత్తినట్లు భావిస్తున్నారు. కొంతమంది యువకులు దాని వెనకాలే పరిగెత్తినా అప్పటికే ట్రాక్టర్ బావిలో పడిపోయింది. మొత్తం మీద ట్రాక్టర్ అంత దూరం దానంతట అదే వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.