parliament Union Budget 2021 trs keshava rao telangana kcr farmers protest పార్లమెంట్ టీఆర్ఎస్ కేశవరావు తెలంగాణ కేసీఆర్ రైతులు నిరసనలు politics
కేసీఆర్ పల్టీ: కేంద్ర బడ్జెట్ అద్భుతం -సాగు చట్టాల రద్దు వద్దన్న కేకే -బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ ఫిక్స్!
'కంప్యూటర్లో కంట్రోల్ ఎఫ్ కొట్టి చూసినా తెలంగాణ పదం కనిపించలేదు'.. డిజిటల్ రూపంలో విడుదలైన కేంద్ర బడ్జెట్ 2021-22లో తెలంగాణను పూర్తిగా విస్మరించాంటూ వ్యక్తమైన విమర్శల్లో బాగా వైరలైన వాక్యమింది. బడ్జెట్లో మంచీ చెడులపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం, సీఎం కేసీఆర్ కాదుకదా, ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా నోరు విప్పకపోవడం, రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు లేవని, కనీసం తెలంగాణ పేరు కూడా ప్రస్తావించకున్నా టీఆర్ఎస్ ఎందుకు మౌనంగా ఉందనే విమర్శలు వచ్చాయి. వాటికి సమాధానంగా గులాబీ దళం.. కేంద్ర బడ్జెట్ పై ఎట్టకేలకు అధికారికంగా స్పందించింది...
మియా ఖలీఫాపై మోదీ సర్కార్ ఫైర్ -గ్రెటా, మీనా, రిహానాపైనా ఆగ్రహం -రైతుల పోరులో సంచలనం

కేటీఆర్ జాతీయ పల్టీ..
గతేడాది నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్2020ని ప్రవేశపెట్టిన రోజే తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్ష నిర్వహించి, కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు. ‘‘మోదీది మోసం.. దగా.. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపింది. రావాల్సిన నిధుల్లో భారీ కోతలు పెట్టింది. ఇది రాష్ట్ర పురోగతిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకూ నిధుల కొరత ఏర్పడుతుంది. జీఎస్టీ పరిహారం పైనా స్పష్టత లేదు. కేంద్రాన్ని నమ్మితే శంకరగిరి మాన్యాలే..'' అని మండిపడ్డారు. కానీ ఇప్పుడు మాత్రం ఆల్మోస్ట్ పల్టీ కొట్టినట్లుగా కేంద్ర బడ్జెట్ 2021కు కితాబిచ్చారు. తాను స్వయంగా ఆందోళనలకు పిలుపునిచ్చిన వ్యవసాయ చట్టాలపై కూడా టీఆర్ఎస్ ‘యూ-టర్న్' తీసుకుంది. వీటిపై తమ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావుతో గులాబీ బాస్ ప్రకటనలు చేయించారు..

కేంద్ర బడ్జెట్ చాలా బాగుంది..
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్ ఉభయ సభల్లోనూ చర్చ జరుగుతోంది. బుధవారం రాజ్యసభ ఈ అంశాన్ని టేకప్ చేయగా, టీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ పార్లమెంటరీ నేత కే.కేశవరావు ప్రసంగించారు. ఎంపీలకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వకపోవడాన్ని ప్రస్తావిస్తూ ప్రసంగం ప్రారంభించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2021-22 బాగుందని అన్నారు. ‘‘ఎంపీలుగా మనందనం బయట ఎంతో మందిని కలుస్తుంటాం. కరోనా వ్యాక్సిన్లు తీసుకోకుండానే పార్లమెంట్ సమావేశాలను ఆరంభించాం. ఏది ఏమైనా కేంద్ర బడ్జెట్ ను మేం(టీఆర్ఎస్) స్వాగతిస్తున్నాం. ప్రజల ఆరోగ్యం, శ్రేయస్సులకు ప్రాధాన్యం ఇస్తూ కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడాన్ని అభినందిస్తున్నాం'' అని కేశవరావు అన్నారు. కాగా,

సాగు చట్టాల రద్దు అవసరంలేదు..
పార్లమెంట్ సాక్షిగా కేంద్ర బడ్జెట్ ను ప్రశంసించిన టీఆర్ఎస్ పక్షనేత కేకే.. వివాదాస్పద వ్యవసాయ చట్టాలపైనా అనూహ్య కామెంట్లు చేశారు. మొన్నటి వరకు సాగు చట్టాలను తీవ్రస్థాయిలో వ్యతిరేకించిన టీఆర్ఎస్.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చేయడం, చట్టాల రద్దు కోరుతూ రాష్ట్రపతికి రిప్రెజెంటేషన్ ఇచ్చిన ప్రతిపక్షా కూటమిలో ఒకటిగా ఉండటం తెలిసిందే. కానీ ఆ పార్టీ తాజాలో ప్రకటనలో మాత్రం భిన్నాభిప్రాయాన్ని వ్యక్తపర్చింది. సాగు చట్టాలను గతంలో వ్యతిరేకించామని ఒప్పుకుంటూనే.. వాటిని రద్దు చేయాలని మాత్రం తాము(టీఆర్ఎస్) డిమాండ్ చేయడంలేదని, రైతుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోవాలని కేంద్రాన్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు కేకే చెప్పారు.

ఆ చట్టాలపై సభలో మళ్లీ చర్చిద్దాం..
‘‘సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేయాలనే డిమాండ్ తో మేం(టీఆర్ఎస్) ఏకీభవించట్లేదు. అయితే, కొత్త చట్టాలు, వాటిపై రైతుల అభ్యంతరాల విషయంలో మోదీ సర్కారు ఇంకాస్త ప్రజాస్వామ్యయుతంగా, పాజిటివ్ గా ఆలోచించి ఉండేదుంటే ఈ పరిస్థితి(నిరసనలు) తలెత్తేదే కాదు. రైతులతో కేంద్రం చర్చలు జరుపుతుండటం అభినందనీయం. అయితే, సమస్య పరిష్కారం కావాలంటే.. చట్టాలను రద్దు చేయకుండానే ప్రత్యాన్మయ మార్గాలపై కేంద్రం దృష్టిపెట్టాలి. ఆ మూడు బిల్లుల్ని పార్లమెంటులో మళ్లీ చర్చకు పెట్టాలి. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత లాంటి సవరణలను ఆమోదించాలి. నిజం చెప్పాలంటే, వ్యవసాయం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అంశం. అసలిందులో కేంద్రం జోక్యం అనవసరం. సాగు చట్టాలపై సుప్రీంకోర్టు మనల్ని(శాసన వ్యవస్థను) డిక్టేట్ చేస్తున్న తరుణంలో మనమే(ప్రజాప్రతినిధులమే) పరిష్కారాలు కనుగొనాలి'' అని ఎంపీ కేశవరావు వ్యాఖ్యానించారు. కాగా..

బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ ఫిక్స్..
జీహెచ్ఎంసీ ఎన్నికల ముందు హైదరాబాద్ నుంచే కేంద్రంలోని బీజేపీతో యుద్ధం మొదలుపెడతామని ప్రకటించిన సీఎం కేసీఆర్.. ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ సీట్లు బాగా తగ్గి, బీజేపీ సీట్లు పెరిగాక ఢిల్లీకి వెళ్లి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాను కలవడం.. ఆ వెంటనే చకచకా కేంద్ర పథకాలకు గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ, వ్యవసాయ చట్టాలు, రైతుల ఉద్యమం తదితర అంశాల్లో యూటర్న్ తీసుకోవడం తెలిసిందే. తాజాగా రైతుల ఆందోళనకు మద్దతుగా పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగాన్ని 18 విపక్ష పార్టీలు బహిష్కరించగా.. ఆ జాబితాలో టీఆర్ఎస్ లేదు. ఇప్పుడు కేంద్ర బడ్జెట్‌పై దేశ వ్యాప్తంగా విపక్షాలన్నీ గగ్గోలు పెడుతోంటే, టీఆర్ఎస్ మాత్రం బడ్జెట్ ను అభినందించింది. ఈ సందర్భంలో.. తెలంగాణ ప్రయోజనాల కోసం కేసీఆర్ ఎవరితోనైనా స్నేహానికి సిద్ధమని, బీజేపీతో ఢిల్లీలో దోస్తీ - గల్లీలో కుస్తీ తమ విధానం కాదని టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు మూడు రోజుల కిందటచేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ ఫిక్స్ అయిందని వ్యతిరేక పార్టీలు ఆరోపిస్తున్నాయి.
నియంతల పేర్లతో రాహుల్ గాంధీ షాకింగ్ ట్వీట్ -మోదీని టార్గెట్ చేయబోయి నవ్వులపాలు