TRS, BJP ఢీ అంటే ఢీ!! హైదరాబాద్లో హోరాహోరీ పోరు..!!
జులై 2, 3 తేదీల్లో భారతీయ జనతాపార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. తెలంగాణలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి, బీజేపీకి ఇప్పటికే మాటల యుద్ధం జరుగుతోంది. తాజాగా ఈ సమావేశాల నిర్వహణతో తెలంగాణ రాజకీయం మొత్తం ఒక్కసారిగా వేడెక్కింది. ఇరు పార్టీలు ఢీ అంటే ఢీ అంటున్నాయి.

ఢిల్లీ వెళ్లి సవాల్ చేసిన మంత్రి కేటీఆర్?
తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి మరీ విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించి వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటైన ప్రభుత్వాలను కూలదోయడానికి కేంద్ర ప్రభుత్వం వేటకుక్కలను ఉసిగొల్పుతోందంటూ మండిపడ్డారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలంతా హైదరాబాద్కు రానున్న తరుణంలో కేటీఆరే స్వయంగా ఢిల్లీ వెళ్లి అక్కడి నేతలను సవాల్ చేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఫ్లెక్సీలు, బ్యానర్లతో మునిగిపోయిన హైదరాబాద్
జాతీయ కార్యవర్గ సమావేశాలను పురస్కరించుకొని హైదరాబాద్ నగరం మొత్తం బీజేపీ ఫ్లెక్సీలు, జెండాలతో నింపే కార్యక్రమంలో బిజీగా ఉంది. టీఆర్ఎస్ అందుకు అవకాశం ఇవ్వకూడదని, ప్రజల దృష్టి బీజేపీవైపు మళ్లగూడదన్న ఉద్దేశంతో అవకాశం ఉన్నంతవరకు ప్రభుత్వ అభివృద్ధి పనులకు సంబంధించిన ఫ్లెక్సీలతో నగరాన్ని నింపేస్తున్నారు. తాజాగా నగరం నడిబొడ్డున రాయదుర్గం నాలెడ్జి హబ్లో రూ.400 కోట్లతో అత్యాధునిక హంగులతో నిర్మించిన టీహబ్-2ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. దీనివల్ల ఉపయోగాలు, ఇవ్వనున్న ఉద్యోగాల సంఖ్య, ఆవిష్కరణలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది తదితర వివరాలతో హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలు, బ్యానర్లతో నింపేశారు.

కేసీఆర్ పై ఆశలు పెట్టుకున్న పార్టీ శ్రేణులు
రాజకీయ వ్యూహాలను అల్లడంలో దిట్ట అయిన కేసీఆర్ పై ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు హాజరైనా దాని ప్రభావం తెలంగాణపై ఉండకూడదంటే కేసీఆర్ ఒక్కరే దానికి సమర్థులని భావిస్తున్నారు. సమావేశాలు జరగడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండటంతో టీఆర్ఎస్ కూడా ఏదో ఒక కార్యక్రమానికి తెర తీస్తుందని సీనియర్ రాజకీయవేత్తలు సైతం భావిస్తున్నారు.