టీఆర్ఎస్ మరో వ్యూహం; ఎంపీ ధర్మపురి అరవింద్ కు రైతులనిరసన సెగతో బీజేపీకి వార్నింగ్!!
కేంద్రంపై ధాన్యం కొనుగోలు విషయంలో ఒత్తిడి తీసుకురావడానికి టిఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఆందోళన చేసిన టిఆర్ఎస్ పార్టీ, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆందోళనల పరంపరను కొనసాగించింది. నిన్నటికి నిన్న తెలంగాణ సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఢిల్లీ వేదికగా ఆందోళన చేసి కేంద్ర సర్కార్ పై స్వరం పెంచారు. కేంద్రానికి ధాన్యం కొనుగోలుకు డెడ్లైన్ విధించారు. కేంద్రప్రభుత్వ 24 గంటల వ్యవధిలో ధాన్యం కొనుగోలు పై నిర్ణయాన్ని ప్రకటించాలని మంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. ఇక ఇదే సమయంలో ఈ రోజు తెలంగాణ కేబినెట్ అత్యవసర భేటీ నిర్వహించి ధాన్యం కొనుగోలు విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు.

ఎంపీ అరవింద్ ఇంటివద్ద రైతుల ఆందోళన
ఇదిలా ఉంటే గ్రామ స్థాయి నుండి, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల వరకు ఆందోళనలు కొనసాగించిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు రాష్ట్రంలోని బిజెపి నేతలపై ఒత్తిడి తెచ్చేలా కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. అందులో భాగంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను టార్గెట్ చేసిన టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు రైతులు ఆయన ఇంటిని ముట్టడించారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్ పెర్కిట్ లో ని ఇంటి వద్ద భారీగా మోహరించిన రైతులు తమ ఆందోళనలు తెలియజేశారు.

అరవింద్ ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన
ఆర్మూర్ మండలం పెర్కిట్ లోని ఎంపీ అరవింద్ ఇంటివద్ద భారీగా మోహరించిన రైతులు వడ్లను కొనుగోలు చేసే బాధ్యత కేంద్రమే తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎంపీ అరవింద్ ఇంటి ముందు ట్రాక్టర్లతో వడ్లు పారబోశారు. ఎంపీ ధర్మపురి అరవింద్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రమే వడ్లు కొనుగోలు చేయాలని రైతులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ లో ఎంపీగా గెలిచిన అప్పటినుండి ధర్మపురి అరవింద్ స్థానికంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

ఎంపీ అరవింద్ కేంద్రం వడ్లు కొనేలా ఒత్తిడి తేవాలని డిమాండ్
గెలిచిన రోజు నుండి రైతన్నల దృష్టిలో రైతు వ్యతిరేకిగా ఉన్న అరవింద్ ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇటీవల ఆర్మూరు రైతులు ఏకంగా గ్రామాల సందర్శనకు వెళ్ళిన ఎంపీని ఘెరావ్ చేశారు. గ్రామాలలో నిరసన వ్యక్తం అవుతున్న క్రమంలో గ్రామ పర్యటనలు మానుకుని ఢిల్లీ కేంద్రంగా రాజకీయం చేస్తున్న అరవింద్ కు తాజాగా మరో ఝలక్ ఇచ్చారు.
ఏకంగా తమ వడ్లను కేంద్రం కొనలేదని, ఎంపీ ఇంటి ముందు పారబోసి నిరసన తెలుపుతున్నారు. ఎంపీ అరవింద్ కేంద్రం వడ్లను కొనుగోలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.

టీఆర్ఎస్ ప్రోద్బలంతో రైతుల ఆందోళన .. బీజేపీ నేతలకు గులాబీ నేతల వార్నింగ్
అయితే ఎంపీ అరవింద్ ఇంటి ముందు రైతులు వడ్లు పారబోయడం వెనుక టిఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారని తెలుస్తుంది. టిఆర్ఎస్ పార్టీ నేతల ప్రోద్బలంతోనే ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. దీనిపై బీజేపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తుండగా, టిఆర్ఎస్ పార్టీ మాత్రం ఇప్పటికైనా పియూష్ గోయల్ తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి అర్థం చేసుకోవాలని, లేదంటే ఎంపీల ఇళ్ల ముట్టడి కొనసాగుతుందని, బీజేపీ నేతలను గ్రామాలలో తిరగనివ్వకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేంద్రం ఇప్పటికైనా తెలంగాణ రైతాంగం విషయంలో సానుకూలమైన నిర్ణయం తీసుకొని రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.