హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మేనిఫెస్టో విడుదల: ఇది హైదరాబాదీలదేనన్న కెటిఆర్, ప్రాథమ్యాల వివరణ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి కార్పొరేటరే గ్రేటర్ పీఠంపై కూర్చుంటారని పంచాయతీరాజ్, ఐటి శాఖ మంత్రి కెటి రామారావు స్పష్టం చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో మంత్రి కెటిఆర్, ఎంపి కేశవ రావు, టిఆర్ఎస్ సలహాదారు డి శ్రీనివాస్ టిఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ.. తమ పార్టీ టికెట్ల విషయంలో సామాజిక న్యాయం పాటించిందని అన్నారు. వారం పదిరోజులపాటు ప్రచారాన్ని ఉధృతం చేస్తామని చెప్పారు. మజ్లిస్, కాంగ్రెస్, టిడిపి, బిజెపి పాలన చూశారు.. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి ఒక్క అవకాశమిచ్చి నగర అభివృద్ధికి సహకరించాలని ప్రజలను కోరారు.

మేనిఫెస్టోలో నగరంలోని మౌలిక అవసరాల మీద దృష్టి పెట్టినట్లు తెలిపారు. జవాబుదారితనంతో చేయగలిగిన హామీలను ఇచ్చామని మంత్రి కెటిఆర్ అన్నారు. అవినీతి లేకుండా ప్రజలకు సేవలు అందిస్తామని చెప్పారు. సర్టిఫికేట్ల జారీలో జాప్యాన్ని నివారించామని తెలిపారు. తాగునీరు ప్రతి ఇంటికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గోదావరి ఫేజ్ 1, కృష్ణా ఫేజ్ 2లను వేగంగా పూర్తి చేస్తున్నామని తెలిపారు.

రూ. 20వేల కోట్లతో రోడ్లు, స్కైవేలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఔటర్ రింగు రోడ్డును ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పారు. మూసీ వెంబడి 42 కి.మీల రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నిరంతరం విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. ఎల్ఈడి లైట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. స్వచ్ఛ భారత్ నినాదానికే పరిమితమైందన్న కెటిఆర్.. స్వచ్ఛ హైదరాబాద్‌ను నగరంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు.

 TRS Manifesto released

మెట్రో రైలును పూర్తి చేయడం, ఎంఎంటిఎస్ రైలు రెండో దశ పూర్తి చేస్తామని తెలిపారు. మహిళల భద్రత, సిటీ ఆఫ్ లేక్స్ చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుస్సేన్ సాగర్ ప్రక్షాళన కోసం రూ. 100కోట్లతో చేపట్టామని తెలిపారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ సుందరీకరణ, సైక్లింగ్ ట్రాక్స్, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. బయో టాయ్ లెట్స్ ఏర్పాటు చేశామని చెప్పారు.

ఉచిత వైఫై ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తామని, మోడల్ మార్కెట్లు అందుబాటులో ఉంచామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారతదేశానికి ఒలింపిక్స్ అవకాశం వస్తే హైదరాబాద్‌లో నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. 36స్మశాన వాటికలను నూతనంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. హరితహారం కింద 10కోట్ల చెట్లను పెంచుతామని తెలిపారు.

కొత్తగూడలో బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేస్తామని, కాలుష్య నియంత్రణకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. నీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సేఫ్ సిటీ, గ్రీన్ సిటీ, స్మార్ట్ సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రపంచ స్థాయి పోలీస్ కమాండర్ టవర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పోలీసులకు ఆధునిక వాహనాలు ఇవ్వడంతోపాటు లక్ష సిసి కెమెరాలను నగరంలో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం తీసుకొచ్చామని తెలిపారు. షీ టీమ్స్, షీ క్యాబ్స్ తో మహిళల భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీసు నియామకాల్లో 33శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించామని చెప్పారు. సంక్షేమ రంగంలో తెలంగాణ భారతదేశానికే ఆదర్శంగా ఉందన్నారు. తమ మేనిఫెస్టో సామాన్యులదేనని అన్నారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ జనవరి 30న భారీ బహిరంగ సభ నిర్వహిస్తారని తెలిపారు. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అక్కడ అనుమతి రాకుంటే మరో చోట నిర్వహిస్తారని చెప్పారు. సీఎం రోడ్ షో నిర్వహిస్తే ప్రజలకు ఇబ్బందులు కలుగుతుందనే ఒకే చోట బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రచారంలో ముందున్నాం.. వచ్చే ఫలితాల్లో కూడా అగ్రభాగాన ఉంటామని చెప్పారు.

ఈ సందర్భంగా ఎంపి కెకె మాట్లాడుతూ.. ఇది ప్రజల మేనిఫెస్టో అని తెలిపారు. 15పేజీల మేనిఫెస్టోను విడుదల చేసినట్లు తెలిపారు. 68మంది బీసీలకు టికెట్లు ఇచ్చామని, 15శాతం మైనార్టీలకు టికెట్లు ఇచ్చామని తెలిపారు. తమ మేనిఫెస్టో నూతన శకానికి నాంది అని తెలిపారు.

డీఎస్ మాట్లాడుతూ.. కెసిఆర్ కెసిఆర్ సూచనలతో నగరం గురించి తెలిసిన వారే మేనిఫెస్టోను తయారు చేశారని చెప్పారు. 20కిపైగా వర్గాలకు టికెట్లు ఇచ్చామని తెలిపారు. వచ్చి పోయే పార్టీ కాదని.. టిఆర్ఎస్ తెలంగాణ కోసం నిలబడే పార్టీ అని చెప్పారు. 18ఏళ్లపాటు పోరాటం చేసిన కెసిఆర్‌కు తెలంగాణపై పూర్తి అవగాహన ఉందని, నగర అభివృద్ధిని మేనిఫెస్టో ద్వారా తెలిపారని చెప్పారు. మేయర్ పదవిని టిఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టి అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.

English summary
TRS Manifesto released by Telangana Minister KT Rama Rao and MP K Keshava Rao and D Srinivas on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X