బీజేపీ చుట్టే రేవంత్ ఆత్మ.. రాష్ట్రానికి శనిలా ఆ నలుగురు.. బండి సంజయ్‌పై జీవన్ రెడ్డి ఫైర్
తెలంగాణలో రాజకీయం మరింత కాక పుట్టిస్తోంది. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం తారాస్థాయికి చేరింది. బీజేపీ, కాంగ్రెస్ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు తోడు దొంగలుగా తయారయ్యారన్నారు. ప్రజలే వీళ్లను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని మండిపడ్డారు.

బీజేపీ చుట్టే రేవంత్ రెడ్డి ఆత్మ
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆత్మ బీజేపీ చుట్టే తిరుగుతుందని టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కార్యాలయాలు నాంపల్లిలోనే ఉన్నాయన్నారు. వీరిద్దరు నాంపల్లి బ్రదర్స్ గా మారారని దుయ్యబట్టారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న విధంగా కాంగ్రెస్, బీజేపీ నేతలు తయారని మండిపడ్డారు. జీహెచ్ఎంసీ, హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

రచ్చబండ కాంగ్రెస్‌కు గుదిబండ..
రేవంత్ రెడ్డిని ఆయన సొంత పార్టీ నేతలే వ్యతిరేకిస్తున్నారని జీవన్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌లో 150 ఎకరాల్లో వరి సాగుచేస్తున్నారనేది అవాస్తవమన్నారు. ఎర్రవల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ వెళ్దామని రేవంత్‌రెడ్డి అంటే.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రానంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలని హితవు పలికారు. రేవంత్ రచ్చబండ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారిందన్నారు.
ఆ నలుగురు తెలంగాణకు శని..
తెలంగాణకు శనిలా రేవంత్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్నలు తయారయ్యారని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి కోతి, బండి సంజయ్ కొండముచ్చులాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. బీజేపీ అంటేనే అపనమ్మకం.. కేసీఆర్ అంటే నమ్మకం అన్నారు. కేసీఆర్ దీక్షను విమర్శిస్తే తెలంగాణ ప్రజల్ని అవమానపరిచినట్లేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రజల సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టకున్నారని దుయ్యబట్టారు. ప్రజలే వీళ్లను రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని దయ్యబట్టారు.

కేసీఆర్‌తో పెట్టుకుంటే నాశనమే..
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబీమా , రైతుబంధు వంటి పథకాలు ఉన్నాయో లేదో బండి సంజయ్ చెప్పాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. రైతులు, కార్మికులతో పెట్టుకున్నవారు ఎవ్వరూ మిగలేదన్నారు. కేసీఆర్‌తో పెట్టుకున్న బీజేపీ నాశనం అవుతుందని శపించారు. వైద్య రంగంలో తెలంగాణ మూడో స్థానంలో ఉందని పేర్కొన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉన్నాయో వాళ్లకే తెలియదని విమర్శించారు. తెలంగాణ పనితనమేమిటో నీతి ఆయోగ్ ప్రపంచానికి చాటినా ప్రతిపక్షాలకు కనబడటం లేదని మండిపడ్డారు.