వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెరాసను వెంటాడుతున్న ఓటమి భయం: సింగరేణి ఎన్నికల్లో పాకులాట

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారం సాధారణ ఎన్నికల్ని తలపిస్తున్నది. టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఇక్కడ ఓడిపోతే ఆ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందనే భయం అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ను వెంటాడుతున్నది.

సింగరేణిలో పట్టు నిలుపుకునేందుకు టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు, నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సర్వశక్తులా ఒడ్డుతున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా, బొగ్గుగనులన్నింటినీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు కేటాయించి ప్రచార లక్ష్యాలు నిర్దేశించారు. సార్వత్రిక ఎన్నికల్లో మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీలనే తిరిగి వల్లె వేస్తున్నారు. వాటిలో ప్రధానమైంది వారసత్వ ఉద్యోగాల అంశం. ప్రభుత్వం లోపభూయిష్టంగా ఇచ్చిన మార్గదర్శకాలను హైకోర్టు కొట్టివేయడం, దీనిపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళ్లి అక్కడ కూడా సర్కార్ మొట్టికాయలు వేయించుకోవడం తెలిసిందే.

ప్రస్తుత ఎన్నికల్లోనూ టీబీజీకేఎస్‌ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సహా నేతలంతా ఎలాగైనా వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి తీరతామంటూ మరోసారి కార్మికులకు వాగ్దానం చేస్తున్నారు. కోర్టు అభ్యంతరాలను ఎలా అధిగమించి, వారసత్వ ఉద్యోగాలు ఎలా సాధిస్తారనే ప్రణాళికను మాత్రం కార్మికుల ముందు ఉంచట్లేదు. కేవలం నోటిమాటలు ఇస్తున్న హామీలను సింగరేణి కార్మికులు ఏమేరకు విశ్వసిస్తారో వేచిచూడాలి.

మూడేళ్లుగా పట్టని టీఆర్ఎస్ ఎంపీలు

మూడేళ్లుగా పట్టని టీఆర్ఎస్ ఎంపీలు

సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇప్పిస్తామనీ ప్రచారం చేస్తున్నారు. ఈ డిమాండ్‌ దశాబ్దకాలంగా ఉన్నదే. లోక్‌సభలో నామమాత్రంగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు కల్వకుంట్ల కవిత, బాల్కసుమన్‌ లేవనెత్తి, ఆ తర్వాత దాని సంగతే పట్టించుకోలేదు. తాజాగా ఇదే అంశాన్ని మళ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుతున్నారు. ఎలా మినహాయింపు తెస్తారనే దానిపై కూడా కార్మికులకు స్పష్టంగా చెప్పట్లేదు. హామీలు ఇవ్వడం, వాటి అమలు పేరుతో తప్పుల తడకగా జీవోలు ఇవ్వడం, కోర్టులు వాటిని కొట్టివేయడం, ప్రభుత్వం హామీల అమల్లో చిత్తశుద్ధిగా ఉన్నా, ప్రతిపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుపడుతున్నాయని పేలవ ఆరోపణలు చేయడం అధికార టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు అలవాటుగా మారిన సంగతి తెలిసిందే.

మరోసారి తెరపైకి 200 గజాల ఇళ్ల స్థలం హామీ

మరోసారి తెరపైకి 200 గజాల ఇళ్ల స్థలం హామీ

అసలు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేటప్పుడే కార్మిక సంఘాలతో చర్చలు జరిపి, పక్కాగా జీవోలు ఇస్తే కోర్టులు ఎందుకు జోక్యం చేసుకుంటాయనే సామాన్య కార్మికుడి ప్రశ్నకు మాత్రం టీబీజీకేఎస్‌ నాయకులు సమాధానం చెప్పట్లేదు. సింగరేణి కార్మికులకు 200 గజాల ఇంటిస్థలం ఇవ్వడంతో పాటు రూ.10 లక్షలు వడ్డీలేని రుణాలు ఇస్తామనే పాత వాగ్దానాన్నే మళ్లీ తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మరి ఈ మూడేళ్లలో ఎందుకు అమలు చేయలేదన్న కార్మికుల ప్రశ్నలకు ఆ సంఘ నేతల వద్ద సమాధానం లేదు.

 కాంట్రాక్ట్, డిపెండెంట్ ఉద్యోగాలపై నోరు మెదపని నేతలు

కాంట్రాక్ట్, డిపెండెంట్ ఉద్యోగాలపై నోరు మెదపని నేతలు

సింగరేణి యాజమాన్యం కూడా అధికారపార్టీ అనుబంధ కార్మిక సంఘం విజయం కోసం నానా అవస్థలు పడుతోంది. సీఎం కేసీఆర్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ శ్రీధర్‌ అవకాశం ఉన్నచోటల్లా సాధ్యమైనంత ప్రచారం చేస్తున్నారని వార్తలు వచ్చాయి. వారసత్వ ఉద్యోగాలు, కాంట్రాక్ట్‌ కార్మికుల క్రమబద్ధీకరణతోపాటు పలు డిమాండ్లతో సింగరేణి కార్మికులు గతంలో సమ్మె చేసినప్పుడు అధికారపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులెవ్వరూ కనీసం వారికి మద్దతు తెలిపే సాహసం కూడా చేయలేదు.

అసలు బొగ్గుగనుల్లో కాలు కూడా పెట్టలేదు. ఇప్పుడు మాత్రం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల ప్రచారాన్ని అడ్డుపెట్టుకొని ఆయా ప్రాంతాల్లో తిరుగుతున్న నేతలకు కార్మికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతోంది. దీంతో ఫక్తు రాజకీయపార్టీ తరహాలోనే కార్మిక సంఘాల ఎన్నికల్ని మార్చేశారని ఇక్కడి ప్రతిపక్ష సంఘాలు మండిపడుతున్నాయి. పలు సంఘాల నుంచి నయానో..భయానో కార్మికుల్ని టీబీజేకేఎస్‌లోకి చేర్చుకోవడం, దాన్ని ఆపార్టీ అనుబంధ మీడియాలో విస్త్రుతంగా ప్రచారం చేసుకోవడం పైనే ప్రధానంగా ఆధారపడినట్టు తెలుస్తోంది.

వివిధ కార్మిక సంఘాల నుంచి నేతల సమీకరణపైనే ఫోకస్

వివిధ కార్మిక సంఘాల నుంచి నేతల సమీకరణపైనే ఫోకస్

హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ భవన్‌లో ఆదివారం టీబీజీకేఎస్‌లో భారీ వలసల కార్యక్రమాన్ని ఆ సంఘం గౌరవాధ్యక్షురాలు కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అధ్యక్షుడిగా ఉన్న హెచ్‌ఎమ్‌ఎస్‌ నుంచి తమ సంఘంలోకి భారీగా నేతలు చేరారని ఆమె చెప్పారు. దీన్ని ఆ పార్టీ సొంత మీడియాలో విస్త్రుత ప్రచారం చేశారు. హోంమంత్రికి చెందిన కార్మిక సంఘం నుంచి టీఆర్‌ఎస్‌ అనుబంధ కార్మిక సంఘంలోకి వలసలు ఏంటని పలువురు సింగరేణి కార్మికులు సెటైర్లు వేసుకుంటున్నారు. సింగరేణి ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌ కూడా పోటీ చేస్తుండటం గమనార్హం. ఇక ఇతర సంఘాల నుంచి కూడా నేతలు చేరారంటూ ప్రచారాన్ని చేసుకున్నారు. అయితే వారెవరూ తమ సంఘం వారు కాదని సదరు సంఘాల నేతలు ప్రకటనలు చేశారు.

తెలంగాణలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఇలా

తెలంగాణలో భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఇలా

సింగరేణి ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఏఐటీయుసీకి కాంగ్రెస్‌కు చెందిన ఐఎన్‌టీయుసీ, తెలుగుదేశంపార్టీ అనుబంధ కార్మికసంఘం టీఎన్‌టీయుసీ మద్దతు ప్రకటించడం తెలంగాణలో నెలకొన్న విచిత్ర పరిస్థితులను తెలియజేస్తున్నాయి. ఈ మూడు పార్టీల అనుబంధ కార్మిక సంఘాలు ఇక్కడ ఉమ్మడిగా పోటీచేస్తున్నాయి. ఎలాగైనా టీఆర్‌ఎస్‌ ఆధిపత్యానికి గండికొట్టాలనే కసితో ఈ పార్టీల కేడర్‌ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ఈ సంఘాలతో పాటు మొత్తంగా 15 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అక్టోబర్‌ 5న జరిగే ఎన్నికల్లో సింగరేణిలోని 53,200 మంది ఓటర్లు ఆయా సంఘాల భవిష్యత్‌ను నిర్ణయించనున్నారు.

English summary
The Ruling Telangana Rastra Samithi (TRS) is thriving to win Singareni union elecions in any cost
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X