‘ఆచార్య’కు కేసీఆర్ సర్కారు గుడ్‌న్యూస్, ఐదు ఆటలు, టికెట్ల ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్: తెలుగు సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రాంచరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమాకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏప్రిల్ 29న విడుదల కానున్న ఈ సినిమా ప్రదర్శనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి శుభవార్త అందించింది.

తెలంగాణలో ఆచార్య ఐదో షోకు అనుమతి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆచార్య ఐదో ఆటకు అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు అదనపు షో ప్రదర్శించుకునేలా థియేటర్ల యాజమాన్యాలకు అవకాశం కల్పించింది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ రవీ గుప్తా నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, లైసెన్స్ అథారిటీలు, పోలీసు కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.

తెలంగాణలో ఆచార్య సినిమా టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి
అంతేగాక, ఐదో ఆటతోపాటు టికెట్ ధరలు పెంచుకునేలా కేసీఆర్ సర్కారు వెసులుబాటు కల్పించింది. ఒక్కో టికెట్‌పై మల్టీప్లెక్స్‌ల్లో రూ. 50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ. 30 పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐదో ఆటకు అనుమతివ్వడంతో మెగాస్టర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం తెలిసిందే.

ఆచార్య కోసం ఎదురుచూస్తున్న అభిమానులు
చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ కలిసి నటించిన సినిమా కావడంతో ఆచార్యపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు కొరటాల శివ రూపొందించారు. ధర్మస్థలి అనే ఓ గ్రామం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. సోనూ సూద్ సహా ప్రముఖ నటులు నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఆచార్య సినిమా తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో విడుదలవుతోంది. అయితే, ఏపీలోనూ టికెట్ రేట్ల పెంపుపై అక్కడి ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.