k chandrasekhar rao chandrababu naidu telugu desam telangana trs కె చంద్రశేఖర రావు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలంగాణ తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్
కాంగ్రెస్ టార్గెట్: తెలంగాణలో చంద్రబాబు వ్యూహం ఇదే

హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకు మరింత చేరువ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)తో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కాంగ్రెసుతో మహా కూటమి కట్టాలనే అప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టడం ద్వారా ఆ మార్గాన్ని చంద్రబాబు సుగమం చేసుకున్నట్లు కనిపిస్తున్నారు.

టిడిపి పరిస్థితి ఏమిటి...
తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. నాయకులు ఒక్కరొక్కరే తెరాసలోకి, కాంగ్రెసు పార్టీలోకి జంప్ చేశారు. కొద్ది మంది నాయకులే టిడిపిలో మిగిలారు. తెలంగాణలో టిడిపికి భవిష్యత్తు లేదనే పరిస్థితి ఏర్పడింది. ఈ స్థితిలో తెలంగాణలో పార్టీకి తిరిగి జీవం పోయాలనే ఎత్తుగడతో చంద్రబాబు ఉన్నట్లు కనిపిస్తున్నారు.

కాంగ్రెసు ఇలా ఉంది...
వచ్చే ఎన్నికల్లో అధికార టిఆర్ఎస్కు కాంగ్రెసు పార్టీయే ప్రధాన పోటీగా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నిర్వీర్యం కావడంతో కాంగ్రెసు పార్టీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. తెరాసలోకి రాలేని నాయకులు కాంగ్రెసు పార్టీలో చేరుతున్నారు. రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి వంటి బలమైన నాయకులు కూడా అందులో చేరుతున్నారు. కెసిఆర్‌ను ఎదుర్కోవాలనే తమ ప్రయత్నంలో భాగంగా వారు కాంగ్రెసు పార్టీని ఎంపిక చేసుకుంటున్నారు.

కాంగ్రెసు ఇంకా ఎదిగితే...
కాంగ్రెసు పార్టీ ఇంకా ఎదిగితే తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో తెలంగాణలో పార్టీని కాపాడుకునే దిశగా చంద్రబాబు వ్యూహరచన చేసినట్లు కనిపిస్తున్నారు. తమ పార్టీకి చెందిన నాయకుల ఫిరాయింపులను నిరోధించడానికి, పార్టీ కార్యకర్తలను నిలువరించుకోవడానికి తగిన వ్యూహాన్ని ఎంచుకుని అమలు చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారు.

ఇలా అయితే భవిష్యత్తు
అధికార తెరాసతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీ క్యాడర్, నాయకులు మిగులుతారని చంద్రబాబు భావిస్తున్నారు. పొత్తులో భాగంగా బలమైన నాయకులకు సీట్లు ఇప్పించుకోవాలనేది ఆయన ఆలోచన. దానివల్ల భవిష్యత్తులో పార్టీ నిలబడుతుందని, కాంగ్రెసును నిలువరించడానికి వీలవుతుందని ఆయన భావిస్తున్నారు.

మోత్కుపల్లి పరిస్థితి ఏమిటి....
తెరాసలో పార్టీని విలీనం చేయాలని అసంతృప్తితో వ్యాఖ్యలు చేసిన మోత్కుపల్లి నర్సింహులుపై చంద్రబాబు బుధవారంనాటి సమావేశంలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. తెరాసతో పొత్తు పెట్టుకుంటే ఆయన పార్టీలో ఉంటారా అనేది ప్రశ్న. అయితే, ఆయనకు తగిన ఆఫర్ ఇస్తే ఉండిపోవడానికే మొగ్గు చూపవచ్చునని అంటున్నారు.