సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్: శ్రావణి, దేవరాజ్ రెడ్డిల ఆడియో లీక్
బుల్లితెర నటి శ్రావణి ఆత్మ హత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తాజాగా శ్రావణి దేవరాజ్ రెడ్డి కి సంబంధించిన సంభాషణ ఆడియో లీక్ అయింది. దీనిలో దేవరాజ్ శ్రావణిని బెదిరింపులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది . మౌనరాగం , మనసు మమత వంటి సీరియల్స్ లో నటించిన టీవీ సీరియల్ నటి శ్రావణి ప్రియుడు వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించి విచారణ ప్రారంభించిన పోలీసులకు శ్రావణి కేసులో తాజాగా దేవరాజ్ రెడ్డి సంభాషణకు సంబంధించిన ఆడియో లభించటంతో శ్రావణి కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది.

ఫోన్ సంభాషణలో శ్రావణిని బెదిరించిన దేవరాజ్
దేవరాజ్ శ్రావణితో జరిపిన ఈ ఫోన్ సంభాషణలో మర్యాదగా వచ్చి తనతో ఒక గంట టైం గడపాలంటూ బెదిరించినట్లుగా ఉంది. ఒకవేళ రాకుంటే తర్వాత జరిగే పరిణామాలను తనను అడగవద్దని కూడా శ్రావణిని దేవరాజ్ రెడ్డి హెచ్చరించినట్లుగా ఆడియో లో ఉంది. అయితే దేవరాజ్ రెడ్డి బెదిరింపులకు శ్రావణి అతడిని ప్రాధేయ పడుతున్నట్టుగా మాట్లాడింది . ఇంతటితో ఆపేయ్.. నీతో మాట్లాడను దేవా అంటూ శ్రావణి సంభాషణ ఉంది.

సాయి కృష్ణారెడ్డి , దేవరాజ్ రెడ్డి పరస్పర ఆరోపణలు
మరోవైపు ఈ కేసులో సాయి పై దేవరాజ్ రెడ్డి, దేవరాజ్ రెడ్డి పై సాయి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సాయి వల్లనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, శ్రావణి ఆత్మహత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదని దేవరాజ్ చెప్తుంటే, దేవరాజ్ డబ్బుల కోసం నిత్యం శ్రావణిని బెదిరించేవాడని, అతని వల్లే శ్రావణి ఆత్మహత్యకు పాల్పడిందని సాయికృష్ణారెడ్డి చెప్తున్నారు. శ్రావణి తల్లిదండ్రులు దేవరాజ్ రెడ్డి వేదింపులు భరించలేక శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అతనిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

దేవరాజ్ ఆరోపణలపై స్పందించిన సాయి కృష్ణా రెడ్డి
ఈ కేసులో దేవరాజ్ రెడ్డి సాయికృష్ణా రెడ్డి పై చేసిన ఆరోపణలపై సాయి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటూ వీడియో రిలీజ్ చేశారు. శ్రావణి కుటుంబానికి తాను స్నేహితుడినని ,శ్రావణి చనిపోయిన తర్వాత కూడా వారి కుటుంబానికి తాను అండగా ఉన్నానని ,తాను ఎక్కడికి పారిపోలేదు అని సాయి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రావణి కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పిన ఆయన , శ్రావణి ఆత్మహత్యకు తను కారణం కాదు అంటూ స్పష్టం చేశారు.

గతంలోనూ దేవరాజ్ పై శ్రావణి ఫిర్యాదు .. టిక్ టాక్ పరిచయమే కొంప ముంచిందా?
అయితే శ్రావణి గతంలో కూడా దేవరాజ్ రెడ్డి పై పోలీస్ స్టేషన్లో వేధింపులకు గురి చేస్తున్నాడని చేసిన ఫిర్యాదు మేరకు, దేవరాజ్ రెడ్డి వేధింపులు, తల్లిదండ్రుల మందలింపులు శ్రావణి ఆత్మహత్యకు కారణమా అన్న కోణంలో పోలీసులు ,దర్యాప్తు చేస్తున్నారు. టిక్ టాక్ ద్వారా దేవరాజ్ రెడ్డి తో పరిచయమైన శ్రావణి, దేవరాజ్ కు సన్నిహితంగా ఉంది. వీరి పరిచయం కాస్త ప్రేమగా మారింది . శ్రావణి , దేవరాజు రెడ్డి సెటిల్ అవ్వడానికి తాను పనిచేసే టీవీ సీరియల్స్ కు చెందిన ఒక కార్యాలయంలో జాబ్ కూడా పెట్టించింది. ఈ క్రమంలో శ్రావణి ,దేవరాజ్ రెడ్డిల మధ్య సాన్నిహిత్యం మరింత పెరిగిందని తల్లిదండ్రులు చెప్తున్నారు .

పరారీలో దేవరాజ్ రెడ్డి .. పోలీసుల గాలింపు
కొద్దిరోజుల తర్వాత వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు.ఈ నేపథ్యంలో దేవరాజ్ రెడ్డి తరచూ శ్రావణికి ఫోన్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని తనను దూరం పెట్టిన కోపంతో శ్రావణి తో చనువుగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలను, వీడియోలను అడ్డం పెట్టుకుని దేవరాజు బెదిరిస్తున్నాడని, డబ్బుల కోసం కూడా శ్రావణిని వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న దేవరాజ్ రెడ్డి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా లీక్ అయిన ఆడియోతో దేవరాజ్ వల్లే శ్రావణి మరణించిందేమో అన్న అనుమానాలు బలపడుతున్నాయి.