వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువకుల ఆత్మహత్యాయత్నం: దళితుల భూరిజిస్ట్రేషన్‌కు రూ.20 వేలు..

గత నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అర్హులైన దళితులకు భూ పంపిణీ కోసం ఏర్పాట్లు జరిగాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అట్టహాసంగా 2014 స్వాతంత్ర్య దినోత్సవం నాడు నిరుపేద దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల పట్టాభూమి పంపిణీ చేస్తామని సగర్వంగా ప్రకటించారు. మూడేళ్లు దాటిన తర్వాత గత నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అర్హులైన దళితులకు భూ పంపిణీ కోసం ఏర్పాట్లు జరిగాయి.

గ్రామసభలో నిర్ణయించిన మీదటే అర్హుల జాబితా ఖరారు చేయాల్సి ఉంటుంది. అత్యంత పారదర్శకంగా సాగాలి. అర్హులైన నిరుపేదలనే ఎంపిక చేయాలని నిబంధనలు స్పష్టంగానే ఉన్నాయి. కానీ రాష్ట్ర సాంస్క్రుతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూర్ నియోజకవర్గం బెజ్జంకి మండలంలో మాత్రం రిజిస్ట్రేషన్‌కు రూ.20 వేలు ఖర్చవుతాయని డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెప్తున్నారు.

ప్రభుత్వం పంపిణీ చేస్తున్న భూములకు రిజిస్ట్రేషన్ల అవసరమేమిటో అస్సలే బోధ పడటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. అవకతవకలను నిరసిస్తూ సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామ వాసి మహంకాళి శ్రీనివాస్ (28), యాలాల పరశురాములు (30) అనే ఇద్దరు యువకులు నిరసనగా ఆత్మాహుతి కావడానికి సిద్ధమయ్యారు. తీవ్ర గాయాల పాలవ్వడంతో వారిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరానికి తరలించారు.

రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు

రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకు వసూళ్లు

బాధిత యువకులు పేరుకు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం గ్రామంలో ఉన్నా.. వారి అసెంబ్లీ నియోజకవర్గం మాన కొండూర్ పరిధిలోకి వస్తుంది. వీరికి భూ పంపిణీ కోసం ప్రభుత్వం 60. 18 ఎకరాల భూమి కొనుగోలు చేసి, అర్హుల జాబితా సిద్ధం చేసింది. కానీ గత నెల 15వ తేదీన పంపిణీ జరుగలేదు. దీంతో స్థానిక నాయకుల వద్దకు వెళ్లి దళితులు అడిగినా దాటేస్తూ వచ్చారని ఆరోపణలు వచ్చాయి. గ్రామ సభ తీర్మానం చేయకుండా.. స్థానిక మండల తహసీల్దార్‌కు తెలియకుండా భూమి ఉన్న వారి వద్దే డబ్బు తీసుకుని నాయకులే జాబితా తయారు చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై దళితులు తమ పేర్లు ఎందుకు లేవని స్థానిక వీఆర్వోను నిలదీశారు. రూ.20 వేలు తీసుకుని స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలువాలని ఆయన సూచించారు. ఈ విషయం దళితులు ఎమ్మెల్యే - రాష్ట్ర సాంస్క్రుతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్ ద్రుష్టికి తెచ్చారు. తాను ఆదివారం వస్తానని, నియోజకవర్గ కార్యాలయానికి రావాలని రసమయి బాలకిషన్ ఇచ్చిన హామీతో గూడెం గ్రామ దళితులంతా అల్గునూర్‌లోని ఎమ్మెల్యే ఆఫీసుకు వచ్చి కూర్చుకున్నారు. Etela

ఆగ్రహంతో ఇలా ఆత్మహత్యాయత్నం

ఆగ్రహంతో ఇలా ఆత్మహత్యాయత్నం

ఎంతకూ ఎమ్మెల్యే రాకపోవడంతో పరశురాములు, మహంకాళి శ్రీనివాస్ వంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయాలు కావడంతో తొలుత కరీంనగర్ జిల్లా ఆసుపత్రికి.. తర్వాత హైదరాబాద్‌కు తరలించారు. మహంకాళి శ్రీనివాస్‌కు భార్య శ్రావణి, కుమారులు శశాంక్ (4), మణిదీప్ (3) ఉన్నారు. శ్రీనివాస్ - శ్రావణిలది ప్రేమ వివాహం. మహంకాళి శ్రీనివాస్‌ (27)కు వ్యవసాయ భూమి లేదు. కూలీ పనిచేసుకుంటూ చేసుకుంటూ జీవించే శ్రీనివాస్‌ ఇక్కడ ఉపాధి లేకపోవడంతో అప్పు చేసి గల్ఫ్‌కు వలస వెళ్లినా ఏజెంటు చేతిలో మోసపోవడంతో వెళ్లి తిరిగి వచ్చాడు. ఇక్కడ ఉపాధి కష్టం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం దళితులకు భూమి ఇస్తే వ్యవసాయం చేసి జీవించవచ్చని నిర్ణయించుకుని దరఖాస్తు చేసుకున్నాడు. యలాల పరశురాములు(29) ఎంఏ పూర్తి చేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు. తెరాస అధికారంలోకి రావడం, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందని నమ్మి పార్టీలో తిరుగుతున్నాడు. దళితులకు భూ పంపిణీ పథకం ఉండటంతో పరశురాములు దరఖాస్తు చేసుకున్నాడు. కారణాలు ఏవైనా ఇద్దరికీ భూ పంపిణీ జరగలేదు. ఇద్దరు ఆత్మాహత్యాయత్నం చేసుకోవడంతో శ్రీనివాస్‌ భార్య, పిల్లలు, పరశురాములు తల్లిదండ్రులు రోదించడం పలువురిని కంటతడిపెట్టించింది.

మంత్రి ఈటెల, ఎంపీ వినోద్ తదితరుల పరామర్శ

మంత్రి ఈటెల, ఎంపీ వినోద్ తదితరుల పరామర్శ

గూడెం గ్రామంలో 60.18 ఎకరాలు కొనుగోలు చేసి 34 మంది దళితులను ఎంపిక చేశారు. అయితే అర్హులను కాదని స్థానిక ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఇతర ప్రజాప్రతినిధులు కుమ్మక్కై తమ అనుచరులకు భూమి పంపిణీ చేసేందుకు పేర్లు రాసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. భూములు ఉన్న ఏడెనిమిది మందికి కూడా కేటాయించారని గూడెం వాసుల అభియోగం. భూములు ఉన్న వారికి మూడెకరాలు.. నిజమైన అర్హులకు రెండెకరాలు, ఎకరం కేటాయించినా.. మరి కొందరికీ ఏదీ లేదని దళితులు ఆందోళన వ్యక్తం చేశారు. మహంకాళి శ్రీనివాస్ కు భూమి కేటాయించినా పరశురాములు పేరు జాబితా నుంచి తొలగించడంతో సమస్య మొదలైంది. కొందరి వద్ద రూ.20 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేశారని గ్రామస్థులు ఆరోపించారు. భూ కేటాయింపుల్లో అన్యాయం వల్లే శ్రీనివాస్, పరశురాములు ఆత్మహత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు. దళిత యువకులు ఆత్మహత్యాయత్నం చేసిన వార్త తెలియగానే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్, కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రభుత్వ దవాఖానలో బాధితులను పరామర్శించారు.

వీఆర్వో సస్పెన్షన్ కోసం కలెక్టర్‌కు ఇలా ఆదేశాలు

వీఆర్వో సస్పెన్షన్ కోసం కలెక్టర్‌కు ఇలా ఆదేశాలు

గాయాలతో దవాఖాన పాలైన యువకులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఈటెల రాజేందర్‌ను బాధితులు శాపనార్థాలు పెట్టారు. దీంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దళితులకు భూ పంపిణీలో అక్రమాలపై సమగ్ర విచారణ చేపడతామని మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఆత్మహత్యాయత్నం చేసిన యువకులకు మెరుగైన చికిత్స అందజేస్తామన్నారు. బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ వ్యవహారంపై విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట కలెక్టర్‌కు ఫోన్ చేసి వీఆర్‌ఓ రవిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం మంచి ఉద్దేశంతో దళితులకు భూమి కొనుగోలు చేసి ఇస్తున్నదనీ, గూడెంలో మాత్రం రెండు వర్గాల మధ్య ఈ విషయంలో గొడవలు తలెత్తి ఇద్దరు దళిత యువకులు ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం బాధాకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్త శ్రీనివాస రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు పరామర్శించారు.

ఇవీ ఆరోపణలు

ఇవీ ఆరోపణలు

భూమి కావాలంటే బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్‌ను కలువాలని స్థానిక వీఆర్వో చెప్పారని గూడెం గ్రామస్తురాలు మహంకాళి అంతవ్వ చెప్పారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌కు పైసలివ్వాలని చెప్పాడన్నారు. తమ దగ్గర అన్ని పైసలుంటే వీళ్ల చుట్టూ ఎందుకు తిరుగుతామని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ దళితుడైనా తమ ఇజ్జత్ తీసినట్లు మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యాయత్నం చేసి తీవ్రంగా గాయపడిన వారికి ఏమైనా అయితే వారి కుటుంబ సభ్యులకు దిక్కెవరని ప్రశ్నించారు. ప్రశాంత్ అనే మరో వ్యక్తి మాట్లాడుతూ అనర్హులకు భూమి కేటాయించారని అన్నాడు. తమను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నారని, రిజిస్ట్రేషన్ కోసం రూ.20 వేలు ఖర్చవుతాయని బెజ్జంకి మార్కెట్ కమిటీ చైర్మన్ చెబుతున్నాడన్నారు.

గ్రామంలో లబ్ధిదారులకు మూడు ఎకరాల పంపిణీ జరగాల్సి ఉండగా ఏ ఒక్కరికీ మూడు ఎకరాల పంపిణీ జరగలేదని, భూ పంపిణీ కోసం రిజిస్ట్రేషన్‌ ఇతర ఖర్చుల కోసం డబ్బులు తీసుకున్నారని, డబ్బులిచ్చినప్పటికీ కొందరికి ఎకరం, మరి కొందరికి ఎకరం పైచిలుకు రిజిస్ట్రేషన్‌ చేయించారని, కొందరు అర్హులైనప్పటికీ డబ్బులు ఇవ్వకపోవడంతో భూ పంపిణీ జరగలేదని, కొందరికి వ్యవసాయానికి ఉపయోగపడని భూ పంపిణీ జరిగిందని, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా చేశారని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గ్రామ సర్పంచ్ లక్ష్మారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ... బెజ్జంకి జడ్పీటీసీ శరత్‌రావు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దేవ శ్రీనివాస్‌ అనర్హులకు భూ పంపిణీ చేశారన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, సర్పంచ్‌, వార్డు సభ్యుల సంతకాలు లేకుండా భూ పంపిణీ జరిగిందని ఆరోపించారు. ఆత్మహత్యా యత్నం చేసిన ఇద్దరు బతకాలని, అర్హులైనవారికి భూ పంపిణీ జరగాలని కోరారు.

భూపంపిణీలో అక్రమాలపై వీఆర్వో సస్పెన్షన్

భూపంపిణీలో అక్రమాలపై వీఆర్వో సస్పెన్షన్

తన కార్యాలయం వద్ద ఇద్దరు దళిత యువకులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలుసుకున్న ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. హైదరాబాద్ నుంచి కరీంనగర్‌కు బయలుదేరారు. సిద్దిపేట జిల్లా ఇబ్రహీంనగర్ వద్ద అంబులెన్సులు నిలిపి బాధితులను పరామర్శించారు. ఈ ఘటన దురదృష్టకరమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ వ్యాఖ్యానించారు. వారి ఆత్మహత్యాయత్నంతో తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. గ్రామంలో ఇరువర్గాల మధ్య గొడవలే ఇం దుకు కారణమని స్పష్టం చేశారు. 38 దళిత కుటుంబాలకు భూమి కొనుగోలుకు రూ. 3.40 కోట్లతో ప్రతిపాదలు మాత్రమే పంపించామని చెప్పారు. ఇంకా ఎలాంటి డబ్బులు రాలేదని తెలిపారు. కాగా, సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గూడెం వీఆర్వో రవి సస్పెన్షన్‌కు గురయ్యారు. దళితులకు భూపంపిణీలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై జాయింట్ కలెక్టర్ పద్మాకర్ నేతృత్వంలో ప్రత్యేక విచారణ చేపట్టారు. అక్రమాలకు పాల్పడినట్లు తేలితే కఠినచర్యలు తీసుకుంటామని సిద్దిపేట జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు.

English summary
Two dalit youth attempted suicide in front of the camp office of Manakondur legislator and State Cultural Council Chairman Rasamayi Balakishan on Sunday evening. Sources said that Mahankali Srinivas (27) and Yalala Parushramulu (26) of Gudem village of Bejjanki mandal from Siddipet district visited the camp office of the legislator, doused themselves with kerosene, and attempted self-immolation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X