నాయిని నర్సింహారెడ్డికి ఎమ్మెల్సీ రెన్యూవల్..?, రెండో సీటుపై ఉత్కంఠ, సారయ్య వైపు కేసీఆర్ మొగ్గు..?
గవర్నర్ కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నాయి. ఈ నెల 17వ తేదీన నాయిని నర్సింహారెడ్డి పదవీకాలం ముగిసింది. రాములు నాయక్‌పై అనర్హత వేటు వేయడంతో సీటు ఖాళీగా ఉంది. నాయిని సీటును తిరిగి ఆయనకే అప్పగించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. రెండో సీటు కోసం మాత్రం ఆరుగురు పోటీపడుతున్నారు. రెండో సీటుపై కూడా కేసీఆర్ క్లారిటీతో ఉన్నారని.. త్వరలో మంత్రివర్గ సమావేశం నిర్వహించి ప్రకటించే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
మోదీకి కేసీఆర్, జగన్ కీలక సూచనలు.. చైనాపై స్ట్రాటజీలో తెలుగు సీఎంల భిన్నస్వరం..

నాయినికే పదవీ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి నాయిని నర్సింహారెడ్డి తన అల్లుడి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ టికెట్ ఇవ్వకపోవడంతో.. పార్టీకి దూరంగానే ఉంటూ వస్తోన్నారు. రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత కూడా నాయిని నర్సింహారెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోలేదు. దీనితో నాయిని నర్సింహారెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. పదవీ ఇవ్వక.. ఎమ్మెల్సీ రెన్యూవల్ చేయకుంటే ఇంకా అసంతృప్తి బయటపడుతోందని పార్టీ భావిస్తోంది. ఎమ్మెల్సీ ఖరారు చేస్తే సమస్యలు రావని, అందుకోసమే టీఆర్ఎస్ పార్టీ ఓకే చేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని టీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

రెండో సీటు కోసం పోటీ
రెండో ఎమ్మెల్సీ సీటు కోసం పోటీ ఎక్కువగానే ఉంది. రాములు నాయక్‌పై అనర్హత వేటు పడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వారిలో ఒకరికీ పదవీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అందులో ప్రముఖంగా మాజీమంత్రి బసవరాజు సారయ్య పేరు వినిపిస్తోంది. ఈయనకే ఎమ్మెల్సీ కట్టబెట్టాలని కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. కానీ ఆయనతోపాటు మరి కొందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

సారయ్య కాకుంటే
ఒకవేళ బసవరాజు సారయ్య కాకుంటే మాజీ ఎంపీ సీతారాం నాయక్, సీనియర్ నేత తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి పేర్లు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. వీరితోపాటు దేశపతి శ్రీనివాస్, దేవీ ప్రసాద్ కూడా ఎమ్మెల్సీ పదవీ కోసం తమవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే రెండో సీటుపై కేసీఆర్ మదిలో ఎవరు ఉన్నారనే అంశంపై స్పష్టత మరికొద్దిరోజుల్లో రానుంది.