తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్‌లకు కేంద్రం షాక్: డీపీఆర్‌లు ఇవ్వాల్సిందే
న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల డీపీఆర్‌లు సమర్పించాలని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులను కోరారు. ఈ మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శనివారం కేంద్రమంత్రి షెకావత్ లేఖ రాశారు.

డీపీఆర్‌లు అందివ్వాలని..
గత అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమల్లో భాగంగా డీపీఆర్‌లు అందివ్వాలని లేఖలో లేఖలో స్పష్టం చేశారు. కృష్ణా, గోదావరి నదులపై నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు పరస్పరం కేంద్రానికి ఫిర్యాదులు చేశాయి. ఈ క్రమంలోనే కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ స్పందిస్తూ డీపీఆర్‌లు సమర్పించాలని కోరింది.

తెలంగాణ ప్రభుత్వం 15 ప్రాజెక్టులకు సంబంధించి..
అంతేగాక, తెలంగాణ, ఏపీ చేపట్టిన కొత్త ప్రాజెక్టులకు అనుమతి తప్పనిసరి అని కేంద్రమంత్రి షెకావత్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 19 ప్రాజెక్టులకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం 15 ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్‌లను సమర్పించాలని కోరారు. డీపీఆర్ సహా అన్ని రకాల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. అయితే తెలంగాణ నుంచి ఒక్క డీపీఆర్ కూడా రాలేదని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 19 ప్రాజెక్టులు
రాయలసీమ ఎత్తిపోతలపై నిబంధనల మేరకు డీపీఆర్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. పట్టిసీమ 3వ దశ డీపీఆర్ ఇవ్వాలని గోదావరి బోర్డును కోరారు. పురుషోత్తమపురం మినహా దేనికీ డీపీఆర్ ఇవ్వలేదన్నారు. కృష్ణాపై 15, గోదావరిపై 4 కొత్త ప్రాజెక్టులను ఏపీ సర్కారు చేపట్టిందని, ఈ ప్రాజెక్టుల డీపీఆర్ లు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం మేరకు ఇరు రాష్ట్రాలు నడుచుకోవాలని సూచించారు. డీపీఆర్ సహా ఇతర వివరాలు ఇస్తేనే సమస్య పరిష్కారమవుతుందన్నారు. డీపీఆర్ లు వెంటనే ఇచ్చేలా చూడాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు వేర్వేరు లేఖలు రాశారు.

డీపీఆర్‌లు సమర్పించాల్సిన ప్రాజెక్టులు:
గోదావరి బేసిన్
1. పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
2. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
3. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
4. చింతలపూడి లిఫ్ట్ - పట్టిసీమ లిఫ్ట్ ద్వారా గోదావరి - పెన్నా నదుల అనుసంధానం ఫేజ్-1

కృష్ణా బేసిన్
01. ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
02. గుండ్రేవుల రిజర్వాయర్
03. గాజులదిన్నె ఆయకట్టుకు సహకరించే లిఫ్ట్ ఇరిగేషన్ పథకం
04. గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
05. పులికనుమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
06. సిద్దాపురం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
07. శివభాష్యం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
08. మున్నేరు స్కీం
09. రాజోలిబండ డైవర్షన్ స్కీం సామర్థ్యం పెంపు
10. ఆర్డీఎస్ - సుంకేసుల మధ్య తుంగభద్రపై కొత్త లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
11. ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైంకుంఠపురం బ్యారేజ్ సామర్థ్యం పెంపు
12. హరిశ్చంద్రవరం గ్రామం నుంచి గుంటూరు జిల్లా నెకరికల్లు గ్రామం వరకు గోదావరి - పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్ట్ ఫేజ్-1
13. వేదవతి (హగరి) నదిపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
14. నాగులదిన్నె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం
15. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం 80వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంపు