uttam kumar reddy mla death ill congress party contest trs party ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మరణం అనారోగ్యం కాంగ్రెస్ పార్టీ పోటీ
దుబ్బాక ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పోటీపై స్పష్టత ఇస్తూనే .. తెలంగాణా సర్కార్ పై ఉత్తమ్ ఫైర్
దుబ్బాక ఎమ్మెల్యే ,టిఆర్ఎస్ పార్టీ నాయకుడు, అసెంబ్లీ అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దుబ్బాకలో ఉప ఎన్నిక జరుగనుంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేడు ఒక ప్రకటన చేసింది. దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేసి తీరుతామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. టిఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ఎవరు బరిలోకి దిగినప్పటికీ కాంగ్రెస్ పోటీలో ఉంటుందని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలపై ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణలో దళితులకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. దళితులకు 3 ఎకరాల భూమి, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లను సీఎం కేసీఆర్ పూర్తిగా మరిచిపోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు అండగా పోరాటం కొనసాగిస్తుందని ఆయన పేర్కొన్నారు . సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతమని,తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పనిచేస్తుందని ఉత్తమ్ అన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తీవ్రంగా పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం మాత్రం దొంగ లెక్కలు చెబుతోందని మండిపడ్డారు. కరోనా కేసుల విషయంలో సర్కార్ ఇస్తున్న లెక్కలు తప్పని నిరూపిస్తామని పేర్కొన్న ఉత్తమ్ కుమార్ కరోనా మరణాలపై మండలాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పీసీసీకి వివరాలు అందించాలని పిలుపునిచ్చారు.
కరోనా మహమ్మారితో మృతి చెందిన పేద కుటుంబాలకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, కరోనా కంట్రోల్ కోసం ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేస్తూ మృతి చెందిన వైద్యులు, వైద్య సిబ్బంది, శానిటేషన్, పోలీసులు, జర్నలిస్టులకు 50 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.