ప్రకాశ్ రాజ్ ఓ బఫూన్ - సమర్ధత ఉంటే"మా" ఎన్నికల్లో ఓడిపోతారా : ఉత్తమ్ ఫైర్..!!
కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ రెండు రోజుల తెలంగాణ పర్యటన ముగిసింది. ఈ పర్యటన సక్సెస్ అయిందని..పార్టీలో మంచి జోష్ ఇచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంతోష పడుతున్నారు. రాహుల్ సైతం వరంగల్ సభ బాగా జరిగిందంటూ అభినందించారు. ఇక, తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత కుమ్ములాటలు.. సీట్ల కేటాయింపు పైనా రాహుల్ క్లారిటీ ఇచ్చారు. రాహుల్ పర్యటన పైన టీఆర్ఎస్ - ఎంఐఎం - బీజేపీ విమర్శలు చేస్తుంటే..కాంగ్రెస్ నేతలు తమ నేత పర్యటన తో కొత్త రాజకీయం మొదలైందని చెబుతున్నారు. రాహుల్ పర్యటన సక్సెస్ అయిందని పార్టీ రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ చెప్పారు.
ఎనిమిది ఏళ్లు టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారని.. కాంగ్రెస్ కు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని అభ్యర్ధించారు. ఇక, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సైతం రాహుల్ సభ విజయవంతం అయిందని సంతోషం వ్యక్తం చేసారు. రాహుల్ చెప్పిన విధంగా పని చేసే వారికే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు దక్కుతాయని స్పష్టం చేసారు. అభ్యర్ధులను ఆరు నెలల ముందే ప్రకటిస్తామని వెల్లడించారు. ఇక, కేసీఆర్ కు మద్దతుగా.. రాహుల్ టూర్ పైన వ్యాఖ్యలు చేసిన సినీ నటుడు ప్రకాశ్ రాజ్ పైన ఉత్తమ్ ఫైర్ అయ్యారు.

ప్రకాశ్ రాజ్ తన ట్వీట్ల ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పురోగతిని వివరిస్తూ..రాహుల్ రాక - వరంగల్ సభ గురించి ప్రశ్నలు సంధించారు. దీనికి స్పందనగా..ప్రకాశ్ రాజ్ ఓ బఫూన్ అంటూ ఉత్తమ్ వ్యాఖ్యానించారు. మొనగాడైతే "మా" ఎన్నికల్లో ఎందుకు ఓడుతారని ప్రశ్నించారు. కేసీఆర్ మెప్పు కోసమే ఆ విధంగా మాట్లాడుతున్నారని... రాజ్యసభ సీటు కోసం నోటికొచ్చినట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఉత్తమ్ మండిపడ్డారు.
Mr @RahulGandhi .. Telangana is governed by a visionary #KCR garu.. tell us what you have to offer with your bunch of fools… #justasking https://t.co/XPJJZLZ0dd
— Prakash Raj (@prakashraaj) May 6, 2022
ఇక, రాహుల్ వరంగల్ సభలో.. గాంధీ భవన్ సమావేశంలో నేతల మధ్య ఐక్యత... ఫిర్యాదుల విషయం పైన సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఇప్పటి కైనా నేతలంతా కలిసి కట్టుగా పని చేస్తారా అనే చర్చ మొదలైంది. అదే విధంగా మెరిట్ ఆధారంగానే టికెట్లు ఇస్తామని పదే పదే చెప్పటం ద్వారా... నేతలంతా ప్రజలతోనే ఉండాలని స్పష్టం చేసారు. ఇక, వచ్చే ఎన్నికలకు ఇదే టర్నింగ్ అని చెబుతున్న నేతలు..ఆచరణలో దీనిని ఏ విధంగా అమలు చేస్తారో చూడాలి.