రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించి.. పీకే వ్యవహారం, టీఆర్ఎస్ పొత్తులపై వీహెచ్ సంచలనం
మే ఆరవ తేదీన కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ గాంధీ సభ సక్సెస్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కిగౌడ్ వంటి నేతలు బహిరంగ సభ నిర్వహించే స్థలాన్ని పరిశీలించగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ హనుమంతరావు రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఆ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


రాహుల్ గాంధీ సభ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ: వీహెచ్
అనేక ఉద్యమాలు ఓరుగల్లు నుండే పురుడుపోసుకున్నాయి అని వ్యాఖ్యానించిన విహెచ్ మే 06వ తేదీన జరిగే రైతు సంఘర్షణ సభను సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. మే 6వ తేదీన జరిగే సభ రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకునే సభ అంటూ వ్యాఖ్యానించిన వీ హనుమంతరావు రాష్ట్రంలో ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీపై తీవ్ర అసహనంతో వున్నారని పేర్కొన్నారు. వరంగల్ లో జరిగే రైతు సంఘర్షణ సభతో రాజకీయ మార్పు సంభవిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఓట్ బ్యాంకును కాంగ్రెస్ వైపు తిప్పుకోవడం కోసం కార్యాచరణ మొదలైందని హనుమంతరావు పేర్కొన్నారు.

తమలో ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు
రైతు సంఘర్షణ సభ నిర్వహించడానికి ఆర్ట్స్ కళాశాల శుభసూచకమని పేర్కొన్న ఆయన, ఆరు లక్షల మందితో రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇక ఇదే సమయంలో తమలో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని వీహెచ్ పేర్కొన్నారు. అందరం కలిసికట్టుగా మీటింగ్ ఏర్పాటు చేస్తున్నామని వీహెచ్ తెలిపారు .ఎవరైనా పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలని వీ హనుమంతరావు వెల్లడించారు. టిఆర్ఎస్, బిజెపి నేతలు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటున్నారని వీహెచ్ ఆరోపించారు.

తెలంగాణాలో పొత్తు అవసరం లేదు
పీకే వ్యవహారం పై స్పందించిన వీహెచ్ పీకే వ్యవహారాన్ని అధిష్టానం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. పీకే ఏ వ్యూహంతో కేసీఆర్ ను కలిశారో తనకు తెలియదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తాము బలంగా ఉన్నామని, పొత్తు అవసరం లేదని వీహెచ్ స్పష్టం చేశారు. పీకే సూచనలతో కేసీఆర్ అనేక ప్రక్షాళనలు మొదలుపెట్టారని పేర్కొన్న వీహెచ్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

బీజేపీ- కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారు
ఒక పార్టీ నుండి గెలిచి మరోపార్టీలోకి మారితే పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయంపై పార్లమెంట్ లో చట్టం తేవాలని వి హనుమంత రావు పేర్కొన్నారు. బీజేపీ- కేసీఆర్ మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ కేవలం మాటల ప్రభుత్వం అని పేర్కొన్న వీహెచ్ ధరలు పెంచి రోడ్లపై ధర్నాలు చేస్తున్నారు. ఇదెక్కడి న్యాయం? అంటూ ప్రశ్నించారు. ధరల విషయంలో ఇంటర్నెషనల్ మార్కెట్ తో మాకేం సంబంధం.. ప్రజలపై భారం పడకుండా చూడాలి అని హనుమంతరావు పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా ఉన్న పోలీస్ అధికారులపై మా ప్రభుత్వం వచ్చిన తరువాత చర్యలు తప్పవు అంటూ వీహెచ్ మండిపడ్డారు.