Vakeel Saab Talk : పవన్ ఫ్యాన్స్ రియాక్షన్... సినిమాలో హైలైట్స్ అవే... పూనకాలేనట...
మూడేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన చిత్రం 'వకీల్ సాబ్' నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో మిడ్ నైట్ షో ప్రదర్శించినట్లు తెలుస్తోంది. సినిమా చూసిన అభిమానులు యూట్యూబ్‌లో తమ స్పందన తెలియజేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు వకీల్ సాబ్ 'ఫుల్ మీల్స్' అని చెబుతున్నారు. బాలీవుడ్ సినిమా 'పింక్'కి ఇది రీమేక్ అయినప్పటికీ... పూర్తిగా ఫ్రెష్ ఫీల్ కలిగించేలా సినిమా ఉందని చెబుతున్నారు.
పవన్ అభిమాని ఒకరు మాట్లాడుతూ... 'సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఎన్నేళ్లయినా ఎన్నాళ్లయినా నాలో ఆవేశం తగ్గదు,ఆశయం మారదు... నేనొక్కసారి నల్లకోటు వేశానంటే.. వేయడానికి పిటిషన్లు,తీసుకోవడానికి బెయిల్స్ ఉండవు.ఈ డైలాగ్ విన్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయి. సినిమా చూస్తుంటే పిచ్చెక్కిపోయింది. ఇంటర్వల్ ముందు వచ్చే సీన్ చాలా బాగుంది. ముఖ్యంగా థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. పవన్ ఎంట్రీ సీన్ అభిమానులకు పిచ్చెక్కిస్తుంది. క్లైమాక్స్ ఎమోషనల్‌గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చాడు.

మరో పవన్ అభిమాని మాట్లాడుతూ... 'మూడు సంవత్సరాల తర్వాత దేవుడు స్పెషల్ దర్శనమిచ్చాడు. వకీల్ సాబ్ సినిమాలో పవన్ క్యారెక్టర్ చాలా బాగుంది. కష్టాల్లో ఉన్న లేడీస్‌కు సాయం చేసేందుకు వదిలేసిన ప్రొఫెషన్లోకి మళ్లీ వస్తాడు. సినిమా చాలా చాలా బాగుంది..' అని అభిప్రాయపడ్డాడు.
ఇక మరో అభిమాని మాట్లాడుతూ... పవన్ కల్యాణ్‌ను మూడేళ్ల తర్వాత స్క్రీన్‌పై చూసి భావోద్వేగానికి లోనైనట్లు చెప్పారు. సినిమాలో క్లైమాక్స్ మనసున్న ప్రతీ ఒక్కరినీ కదిలిస్తుందన్నారు. మాస్,క్లాస్ కలగలిసిన చిత్రమని... మంచి సందేశాన్ని ఇచ్చారని చెప్పారు. వకీల్ సాబ్ సినిమాలో సినిమాటోగ్రఫీ, థమన్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచాయన్నారు.
కాగా,పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శృతి హాసన్,అంజలి,అనన్య నాగళ్ల,ప్రకాష్ రాజ్ ఇందులో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్,తాప్సీ ప్రధాన పాత్రల్లో వచ్చిన క్లాసిక్ హిట్ 'పింక్'కి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. పవన్ కల్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లాక... ఇక సినిమాలు చేయరేమోనని అభిమానులు బెంగ పెట్టుకున్న తరుణంలో ఆయన నుంచి ఈ సినిమా రావడం వారిని చాలా సంతోషానికి గురిచేస్తోంది.
.