విప్లవ కవి వరవర రావు ఆరోగ్యం మరింత విషమం: భార్యతో ఫోనులో: కేసీఆర్పైనే భారం: లేఖ
హైదరాబాద్: ప్రముఖ విప్లవ కవి, విరసం మాజీ అధ్యక్షుడు వరవర రావు ఆరోగ్యం మరింత క్షీణించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలపై అరెస్టయిన ఆయన ప్రస్తుతం ముంబైలోని తలోజా జైలులో ఉంటున్నారు. మూడువారాల కిందట ఆయన అనారోగ్యానికి గురయ్యారు. మధ్యలో కొద్దిరోజుల పాటు ఆయన కోలుకున్నప్పటికీ.. మళ్లీ ఆరోగ్య పరిస్థితి విషమించినట్లు చెబుతున్నారు. తలోజా జైలు అధికారులు వరవర రావుకు ఈ మేరకు సమాచారం ఇచ్చారు.
మావోయిస్టులతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్నారంటూ ఆయనను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్లో ఎన్ఐఏ అధికారులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఈ పరిస్థితుల్లో ఆయనను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వరవరరావు కుటుంబ సభ్యుల తరఫున ప్రొఫెసర్ హరగోపాల్.. కేసీఆర్కు లేఖ రాశారు.

86 సంవత్సరాల వయోధిక వృద్ధుడైన వరవర రావుకు వెంటనే మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఆయన ప్రాణాలు కాపాడాలని కోరారు. వరవరరావుతో ఆయన భార్య హేమలత ఫోనులో మాట్లాడారని పేర్కొన్నారు. వరవర రావు మాట తడబడుతోందని, మనుషులను గుర్తు పట్టలేనివిధంగా మాట్లాడినట్లు సమాచారం ఇచ్చారని హరగోపాల్ పేర్కొన్నారు. ఒకదానితో ఒకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని హేమలత ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు.
మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి వరవర రావుకు నాణ్యమైన వైద్య చికిత్స అందించడానికి చర్యలు తీసుకోవాలని హరగోపాల్ కోరారు. వరవర రావుకు బెయిల్ ఇప్పించడానికి తాము చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదని అన్నారు. ఈ విషయంలో కేసీఆర్ జోక్యం చేసుకోవాలని అన్నారు. వరవరరావు కుమార్తెలు కూడా ఇటీవలే మహారాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్కు లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వరవరరావుకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని వివిధ పార్టీలకు చెందిన 14 మంది ఎంపీలు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాకరేకు లేఖ రాశారని పేర్కొన్నారు.