వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వంటింటికి ధరల షాక్: కూరగాయలు ఇక చేదు గుళికలు

రోజూ మనం ఇంటింటా నిత్యం వినియోగించే కూరగాయల ధరలు ఆకాశాన్నంటే స్థాయిలో దూసుకెళుతున్నాయి. వానలు పడుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో పంట దిగుబడులు లేక చిల్లర మార్కెట్లలో కూరగాయల కొరత ఏర్పడుతోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: రోజూ మనం ఇంటింటా నిత్యం వినియోగించే కూరగాయల ధరలు ఆకాశాన్నంటే స్థాయిలో దూసుకెళుతున్నాయి. వానలు పడుతున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో పంట దిగుబడులు లేక చిల్లర మార్కెట్లలో కూరగాయల కొరత ఏర్పడుతోంది. ఫలితంగా రెండు నెలల్లో ధరలు భారీగా పెరిగాయి.

బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్‌ తదితర కాయగూరలు కందిపప్పు ధరను మించిపోయాయి. కొన్ని కూరగాయలైతే రెండు నెలల కిందటితో పోల్చితే రెండు, మూడు రెట్లు పెరిగాయి. భగ్గుమంటున్న ధరలను చూసి కూరగాయలు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటేనే సామాన్య, దిగువ మధ్య తరగతి ప్రజలు భయపడుతున్నారు. కిలో బీన్స్, చిక్కుళ్లు, క్యారెట్ తదితర కూరగాయల ధరలు ప్రాంతం, నాణ్యతను బట్టి రూ.80 నుంచి రూ.90 వరకూ పలుకుతున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.80 - 85 పలుకుతోంది.

కాకర, గోరుచిక్కుడు, బీట్‌రూట్, కీరదోస, వంగ తదితర కూరగాయల ధరలు కూడా భారీగా పెరిగాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ వంటి దూర ప్రాంతాల నుంచి కూరగాయలు రవాణా చేస్తుండటంతో రవాణా వ్యయం తడిసి మోపెడై ధరలు పెరిగిపోతున్నాయి. మరోవైపు రెండు రాష్ట్రాల్లో పంట దిగుబడులు చివరిదశకు చేరుకున్నాయి. ఇక వచ్చే నెల, రెండు నెలల వరకూ ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతయ్యే కూరగాయలే దిక్కు అని వ్యాపారవేత్తలు, అధికారులు, రైతులు చెప్తున్నారు.

సామాన్యులకు చుక్కలు చూపుతున్న ధరలు

సామాన్యులకు చుక్కలు చూపుతున్న ధరలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరంలో ప్రధాన హోల్ సేల్ మార్కెట్‌ బోయిన్‌పల్లికి లక్నో, దిల్లీ, ఆగ్రాల నుంచి తీసుకొస్తున్న పచ్చిమిర్చి రవాణా వ్యయం తడిసి మోపెడవుతుండటంతో ఇక్కడ టోకుగానే కిలో రూ.40కి అమ్ముతున్నారు. చిల్లర మార్కెట్‌లో అయితే రూ.50-60 వరకు పలుకుతోంది. ఇక మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నుంచి క్యారెట్లు, తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై నుంచి మునగ కాయలు వస్తున్నాయి. టమాటాలైతే పూర్తిగా ఇతర రాష్ట్రాల నుంచే వస్తున్నాయని మార్కెటింగ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. రెండు నెలల క్రితం మార్కెట్‌లో రూ.11లకు కిలో టమాటా ధర పలికితే ప్రస్తుతం రూ.35 పలుకుతున్నదని, క్యాప్సికం కిలో ధర రూ.27 నుంచి రూ.38లకు చేరుకున్నది. పచ్చిమిర్చి, గుండు బీన్స్ ధర కిలో రూ.58 పలుకుతుండటంతో సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

ఉల్లి ధర కూడా ఘాటే

ఉల్లి ధర కూడా ఘాటే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రధాన నగరమైన విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో కంద గడ్డ రూ.70పైగా పలుకుతున్నది. బెజవాడ నగరంలోని రైతు బజారులో కూడా కిలో కంద రూ.60కి పైగా విక్రయించడం గమనార్హం. సాధారణ రోజుల్లో కిలో రూ.15, 20 ఉండే కీరదోస ప్రస్తుతం బెజవాడలోని రైతు బజారులో ఏకంగా రూ.45కి పెరిగింది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.12 ఉండగా విజయవాడలో రూ.20 నుంచి 22 వరకూ అమ్ముతుండటం గమనార్హం. విజయవాడ బహిరంగ మార్కెట్‌లో కిలో టమోటా రూ.30పైగా ఉంది. విశాఖపట్నం, తిరుపతితోపాటు చిన్న పట్టణాల్లో కూడా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్కో పొట్ల కాయను దాదాపు అన్ని ప్రాంతాల్లో రూ.20కి అమ్ముతున్నారు. భాగ్యనగరంలో విక్రయిస్తున్న కూరగాయల్లో 80 శాతానికి పైగా ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చినవే. సుదూర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నందునే ఇక్కడ ధరలు భారీగా పెరుగుతున్నాయని ఓ టోకు వ్యాపారి అన్నారు. డిమాండ్‌కు అనుగుణంగా సాగు పెంచకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల వారికి కాసులు ధారపోయాల్సి వస్తోందన్నారు.

వేసవి వేడివల్లే తగ్గిన దిగుబడులు

వేసవి వేడివల్లే తగ్గిన దిగుబడులు

కరువు వల్ల నీరు లేక కూరగాయల తోటల సాగు తగ్గడం, ఎండలకు తోటలు ఎండిపోవడంతో దిగుబడి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. మూడు నాలుగు నెలలు కష్టపడి కూరగాయలు పండిచిన వారికి వచ్చే మొత్తం కంటే ఒకటి రెండు రోజులు మార్కెట్‌లో పెట్టి అమ్మేవారు, దళారులే ఎక్కువ డబ్బు పొందుతున్నారని రైతులు వాపోతున్నారు. ‘మార్కెట్‌లో కిలో పచ్చి మిర్చి రూ.80కి అమ్ముతున్నారు. మాకు మాత్రం రూ.40 కూడా ఇవ్వడం లేదు. మరీ ఇంత అన్యాయం చేస్తున్నారు...' అని చిత్తూరు జిల్లా పెరుమాళ్లపల్లి నివాసి లోకనాథం నాయుడు అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. 'కిలో చిక్కుడు కాయలు మావద్ద రూ.40కి తీసుకుంటున్నారు. వ్యాపారులు మార్కెట్‌లో రూ.75, 80 అమ్ముతున్నారు. ఇదేమని అడిగితే దుకాణం అద్దె, మనిషికి కూలీ, ఇతర ఖర్చులు అంటారు. మేం అమ్ముకోలేం కాబట్టి వారు చెప్పిన రేటుకు ఇచ్చి వెళ్లక తప్పడంలేదు' అని కడప జిల్లా సుండుపల్లికి చెందిన రైతు కులశేఖర్‌ అన్నారు. ధరలు ఇలా మండిపోతుంటే ఏమి తిని బతకాలని పేదలు బోరుమంటున్నారు.

ఆకాశాన్నంటే రీతిలో బియ్యం

ఆకాశాన్నంటే రీతిలో బియ్యం

మార్కెట్‌లో బియ్యం ధరలకు రెక్కలొచ్చాయి. రెండు నెలల క్రితం వరకు సోనా మసూరి ప్రథమ శ్రేణి కొత్త బియ్యం కిలో రూ.33 ఉండేది. ఇప్పుడు ఇవే బియ్యం ధర రూ.37, 38కి పెరిగాయి. పాత బియ్యమైతే కిలో రూ.44 నుంచి ఏకంగా రూ.50కి పెరిగాయి. మంచి నాణ్యత ఉంటే కిలో రూ.52 - 55 వరకు అమ్ముతున్నారు. క్వింటాల్ సోనా మసూరి పాత బియ్యం రూ.5000 పలుకుతోంది. నిజామాబాద్‌ సన్నాలు పేరు చెప్పి రూ.5300 నుంచి రూ.5500 కూడా అమ్ముతున్నారు. రాష్ట్రంలో గత ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో వరి సాగు తగ్గడం వల్ల బియ్యం ధరలు పెరిగాయి. కర్నూలు సోనా మసూరి పేరు చెప్పి చాలా ప్రాంతాల్లో కల్తీ బియ్యం అంటగడుతున్నారు. ఎంపీయూ 1060 రకం ధాన్యం సోనా మాసూరి లాగా ఉంటుంది. దీనిని సోనామసూర బియ్యంలో 20 నుంచి 30 శాతం కలిపి అమ్ముతున్నారు. మరికొందరు తగ్గుబియ్యంలో రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ పట్టించి కలిపేస్తున్నారు.

ఆకుకూరలతోనే కాలం

ఆకుకూరలతోనే కాలం

నెల రోజులుగా ఎండలే అనుకుంటే కూరగాయల ధరలూ మండిపోతున్నాయి. అర కిలో కూరగాయలతో తాళింపు చేసుకునేటోళ్లం పావు కిలోకే పరిమితమయ్యామని అంటున్నారు. అందరికీ అందుబాటులో ఉండే వంకాయల ధర కూడా పెరిగిపోయింది. పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. తోటకూర, చిర్రాకు, బచ్చలాకుతో పుల్లగూర చేసుకుని కానిచ్చేస్తున్నామని వాపోతున్నారు.

కూరగాయల పంటల విస్మరణ

కూరగాయల పంటల విస్మరణ

వరి, మొక్కజొన్న వంటి సాధారణ పంటల విత్తనాలపై రాయితీ ఇస్తున్న ప్రభుత్వం కూరగాయల పంటలను పూర్తిగా విస్మరించింది. ఖరీఫ్‌ సీజన్‌ మొదలైనా విత్తనాల జాడే లేదు. గతేడాది రైతులకు రాయితీపై విక్రయించిన విత్తనాల సొమ్మే రాలేదని, ఈసారి అమ్మకాలు నిలిపివేశామని విత్తన కంపెనీలు గుర్తు చేస్తున్నాయి. అవసరమైన రైతులు హైదరాబాద్‌లోని జీడిమెట్లలో నారు కొనుక్కోవాలని అధికారులు సూచిస్తున్నారు. కానీ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల రైతులంతా ఇక్కడికొచ్చి ఎలా తీసుకోగలరని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. రెణ్నెల్ల క్రితం తెలంగాణ రైతులు పండించిన టమాటాకు కిలో రూ.5కు మించి ధర పలుకలేదు. కానీ, ఇప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన టమాటాలకు రూ.30 దాకా ఇస్తున్నారని, ఇక ఇక్కడి రైతులు పంట సాగు విస్తీర్ణం ఎలా పెంచుతారని ఓ ఉద్యాన అధికారి వాపోతున్నారు.

English summary
Vegetables rates were highest in Telangana and Andhra Pradesh states because severe falldown in production for drought and heat conditions in summer while these states were depends on other states production of vegetables. This position to lead hike vegetable's rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X