మోడీపై విహెచ్ పోరు దీక్ష: కెసిఆర్‌పై పొన్నం ఫైర్
హైదరాబాద్/కరీంనగర్: పేదల భూములు కోటీశ్వరులకు కట్టబెట్టేందుకే ప్రధాని నరేంద్ర మోడీ పాటుపడుతున్నారనికాంగ్రెస్ తెలంగాణ నేత వి హనుమంతరావు ఆరోపించారు. కేంద్రం చేసిన భూసేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ శనివారం ఇందిరాపార్క్ దగ్గర వీహెచ్ ఒకరోజు దీక్ష చేపట్టారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్లమెంట్లో ఆందోళనలు చేపడుతామన్నారు. రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతామని చెప్పారు.
విహెచ్ చేపట్టిన దీక్షకు టిపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కాంగ్రెసు సీనియర్ నేత డీఎస్, జానారెడ్డి, సంఘీభావం తెలిపారు.భూసేకరణ చట్టానికి తూట్లు పొడిచేలా మోడీ పాలన ఉందని పొన్నాల లక్ష్మయ్య ఈ సందర్భంగా అన్నారు. రైతుల ప్రయోజనాల కోసం ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాన్ని చేపడతామన్నారు.
రైతు ప్రయోజనాల కోసమే ఇందిరాగాంధీ భూసేకరణ చట్టాన్ని తీసుకొచ్చారని, ఎన్డీయే తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై ప్రజల్లో ఆందోళన నెలకొందని జానారెడ్డి అన్నారు. మోదీ పాలనలో ప్రజలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారని, మోదీ పాలనకు ఢిల్లీ ఎన్నికలే నిదర్శనమని డీఎస్ వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ ఆర్ధినెన్స్ను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు.

సెటిలర్లపై వివక్ష ఉండదన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గంటల వ్యవధిలోనే రంగులు మార్చారని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. ప్రెస్ అకాడమీలో సమావేశానికి తెలంగాణ మీడియాను మాత్రమే ఆహ్వానించారని, అబద్దాలు చెప్పడం కేసీఆర్ నైజం అని ఆయన మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రిటైర్డ్ ఐఏఎస్‌లను సలహాదార్లుగా నియమించారని, పార్లమెంటరీ సెక్రటరీల పేరుతో ప్రభుత్వం నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని షబ్బీర్ అలీ టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. బడ్జెట్ సమావేశాల్లోనే అన్ని అంశాలపై నిలదీస్తామని ఆయన చెప్పారు.
పీజు రియింబర్స్‌మెంట్‌లో ప్రభుత్వానికి ముడుపులు అందాయని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇంజినీరింగ్ కాలేజీలకు రూ. 500 కోట్లు విడుదల చేయడంతోనేప్రభుత్వానికి ముడుపులు ముట్టాయని తెలుస్తోందని ఆయన శనివారం కరీంగనగర్‌లో మీడియాతో అన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీల నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి 5 శాతం కమిషన్ తీసుకున్నారని, ఇందులో టీఆర్ఎస్ నేత పల్ల రాజేశ్వర్ రెడ్డి కూడా భాగస్వామ్యం ఉందని ఆయన ఆరోపణలు గుప్పించారు. నందగిరి హిల్స్‌లోని ఓ గెస్ట్‌హౌస్‌లో దీనిపై చర్చలు జరిగాయన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద స్పష్టమైన ఆధారాలున్నాయని పొన్నం తెలిపారు.
దీనిపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన జగదీశ్ రెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డిలను పదవుల నుంచి తప్పించాలని పొన్నం డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ భోగస్ అన్న కేసీఆర్.. ఈ నిధులను ఎందుకు విడుదల చేశారని ఆయన ప్రశ్నించారు.