జలదిగ్బంధంలో కామారెడ్డిలో ఓ గ్రామం; మందులు చేరవేసి బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్ సాయం
దేశంలోనే మొదటిసారిగా డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్లు, మందులు సరఫరా చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ ల పంపిణీ కోసం బియాండ్ విజువల్ లైన్ ఆఫ్ సైట్ డ్రోన్లను వినియోగిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. అంతేకాదు డ్రోన్ల ద్వారా మందుల పంపిణీ చేస్తున్న తెలంగాణా రాష్ట్రంలో వరద ముంపుకు గురైన గ్రామానికి మందులు పంపి ఒక బాలుడి ప్రాణాలు కాపాడి మరో రికార్డ్ సృష్టించింది.
డ్రోన్ల
ద్వారా
కరోనా
మెడిసిన్
పంపిణీ
;
దేశంలోనే
తొలిసారి
తెలంగాణాలో..
వికారాబాద్
లో
ట్రయల్
రన్

వరదలతో జలదిగ్బంధంలో గ్రామం .. ఓ బాలుడి ప్రాణాలు కాపాడిన డ్రోన్ సాయం
ఈనెల 11వ తేదీన డ్రోన్ల సహాయంతో కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ చేసే కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్రం శ్రీకారం చుట్టింది. కరోనా మందులు , వ్యాక్సిన్లు మారుమూల ప్రాంతాలకు చేరవేయటం కోసం డ్రోన్లను ఉపయోగిస్తున్న తెలంగాణా, వరద కారణంగా గ్రామం నుండి బయటకు రాలేక జల దిగ్బంధంలో చిక్కుకున్న, విపరీతమైన జ్వరం, కడుపునొప్పితో బాధ పడుతున్న ఓ బాలుడి ప్రాణాలను కాపాడింది. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కుర్తి గ్రామానికి చెందిన, మిరియాల గంగారాం కుమారుడు కన్నయ్య అనే 16 నెలల బాలుడు విపరీతమైన జ్వరంతో కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు.

కుర్తి గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు
గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో కుర్తి గ్రామాన్ని వరద ముంచెత్తింది. దీంతో గ్రామంలోకి రాకపోకలు స్తంభించిపోయాయి. గ్రామం నుండి వెలుపలకు రావడానికి కూడా వీలు లేని పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామానికి వెళ్లే దారిలో వంతెనపై నుండి వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. విపరీతంగా కురుస్తున్న వర్షాలతో నిజాంసాగర్ గేట్లు తెరవడంతో వరద పోటెత్తుతోంది. కుర్తి గ్రామం చుట్టూ మంజీర నది ప్రవహిస్తూ ఉండటంతో నిజం సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తిన ప్రతిసారి కుర్తి గ్రామం వరద ముంపుకు గురి అవుతోంది. ఇక ఆ సమయంలో గ్రామానికి రాకపోకలు నిలిచిపోవడమే కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు వైద్యం అందడం లేదు.

కన్నయ్య ప్రాణాలు కాపాడటం కోసం అధికారుల వినూత్న ప్రయోగం
ఈ క్రమంలోనే నిజాం సాగర్ గేట్లు తెరవటంతో జలదిగ్బంధంలో చిక్కుకున్న కుర్తి గ్రామంలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి వైద్యం చేయించడానికి బయటకు వెళ్లలేని పరిస్థితిలో ఆ గ్రామస్తులు వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అధికారులు కన్నయ్య ప్రాణాలు కాపాడడానికి వినూత్న ప్రయోగం చేశారు. ముందు ఫోన్ ద్వారా బాలుడి అనారోగ్య పరిస్థితులను తెలుసుకున్న అధికారుల సూచన మేరకు అవసరమైన మందులను బాలుడికి పంపించారు. పిట్లం మండలం కుర్తి గ్రామానికి డ్రోన్ ద్వారా మందులు పంపిణీ చేసిన అధికారులు మండలంలోని రాంపూర్ లో అందుబాటులో ఉన్న డ్రోన్ సహాయం తీసుకొని గ్రామ సమీపం నుండి మందులను డ్రోన్ కు అందించి బ్రిడ్జి దాటించి గ్రామస్తులకు చేరవేశారు.

డ్రోన్ ద్వారా, మందుల చేరవేత .. డ్రోన్ ద్వారా మందులు పంపి ప్రాణాలు కాపాడిన అధికారులు
గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న మండల వైద్యాధికారి గ్రామానికి మందులు చేరవేసేందుకు తక్షణమే స్పందించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోకి చేరవేసిన మందులను ఆశ వర్కర్ బాలుడి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు అందించింది. దీంతో తల్లిదండ్రులు అధికారులు తక్షణం స్పందించారని, ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. డ్రోన్ ను ఉపయోగించి బాలుడికి అత్యవసరమైన మందులను గ్రామస్థులకు అందించడంతో ఆ బాలుడి ప్రాణాలు నిలబడ్డాయి. ఏది ఏమైనా కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి డ్రోన్స్ ద్వారా మందులు పంపిణీ ప్రారంభించిన తెలంగాణ సర్కార్ ఇప్పుడు వర్షాలు, వరదల తాకిడికి జలదిగ్బంధంలో చిక్కుకున్న ఓ గ్రామంలో బాలుడి ప్రాణాలను కాపాడడానికి డ్రోన్ ను ఉపయోగించడం హర్షణీయం.