
కాంగ్రెస్ గూటికి విజయారెడ్డి.. ఎమ్మెల్యేను చేస్తేనే పీజేఆర్‌కు నివాళి: కోమటిరెడ్డి
దివంగత పీజేఆర్ కూతురు, టీఆర్ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమక్షలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీఆర్ఎస్ పార్టీలో తనకు తగినంత ప్రాధాన్యం లేదని భావిస్తున్నారు. అందుకోసమే పార్టీని వీడారు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమే ఆరా తీశారు.

కాంగ్రెస్ గూటికి
ఇదివరకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో విజయారెడ్డి భేటీ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నానని తెలిపారు. అక్కడికక్కడే రేవంత్ ఓకే చెప్పేశారు. విజయారెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి తదితరుల సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే చేసినప్పుడే..
విజయారెడ్డికి కోమటిరెడ్డి ఘన స్వాగతం పలికారు. పీజేఆర్ కూతురు అయిన విజయారెడ్డి తమకు సోదరి అని తెలిపారు. ఖైరతాబాదే కాకుండా ఎక్కడ బరిలో ఉన్న విజయారెడ్డి ఎమ్మెల్యే అవుతారని చెప్పారు. విజయారెడ్డిని ఎమ్మెల్యేను చేసినప్పుడే పీజేఆర్‌కు అసలైన నివాళి అని పేర్కొన్నారు. ఆమెను గెలిపిస్తామని ఆయన అన్నారు.

మరవను మీ రుణం
ఖైరతాబాద్ నియోజక వర్గ ప్రజలకు ఎప్పుడూ రుణ పడి ఉంటానని విజయారెడ్డి అన్నారు. పార్టీ మారడం ఒక్క రోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఘటనలు తనను బాధించాయన్నారు. షీ టీమ్ పెట్టామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా, మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదని పేర్కొన్నారు. పెన్షన్, రేషన్ కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారని వివరించారు. రాష్ట్ర ప్రజల బాగోగులను కేసీఆర్ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.

పేదల పక్షపాతి
కాంగ్రెస్ పార్టీ మాత్రమే పేదలకు న్యాయం చేస్తుందన్నారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేయడానికి వచ్చానని తెలిపారు. పదవుల కోసం పార్టీ మారలేదని, ఇక మూడు రంగుల జెండా వదలనని పేర్కొన్నారు. తనది ఇక ఒకటే జెండా.. ఒకటే బాటని విజయారెడ్డి స్పష్టం చేశారు.