హుజూరాబాద్‌పై కేసీఆర్ వరాలేమయ్యాయి?: గద్దెదించాలంటూ విజయశాంతి పిలుపు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏరు దాటినదాకా ఓడ మల్లన్న... ఒడ్డు చేరినాక బోడి మల్లన్న... అన్నట్టుంది కేసీఆర్ సర్కార్ తీరు అని ధ్వజమెత్తారు. హుజూరాబాద్ ఎన్నికల్లో గెలిచేందుకు అనేక ప్రలోభాలకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపఎన్నిక ముందు వంద కోట్లన్నారు..: విజయశాంతి
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని భావించిన ఫామ్‌హౌస్ ముఖ్యమంత్రి కేసిఆర్... రెండు, మూడు నెలలు ముందే ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను హుజూరాబాద్ పంపించి అవి చేస్తాం, ఇవి చేస్తామని మాయమాటలు చెప్పి ప్రజలను ప్రలోభాలకు గురిచేసిన్రు. ఈ క్రమంలో రూ.500 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి సీసీ రోడ్లు, డ్రైనేజీలు, డివైడర్లు, ఐలాండ్స్, మార్కెట్ యార్డులు, కమ్యూనిటీ హాళ్ల కోసం మొదటి విడత రూ.200 కోట్లు ముందుగా శాంక్షన్ చేశారు.

హరీశ్ రావు సహా మంత్రులంతా వచ్చారు.. కానీ..: విజయశాంతి
ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే పనులు కావాలనే లక్ష్యంతో కొన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీల పనులు హడావుడిగా 20 శాతం పూర్తిచేశారు. బాగున్న రోడ్ల మీద సైతం మళ్లీ రోడ్లు వేసిన్రు. నాడు టీఆర్ఎస్ ఎన్నికల ఇన్‌చార్జీగా ఉన్న మంత్రి హరీశ్‌రావు హుజూరాబాద్ వెళ్లి అక్కడ మండలాలవారీగా కులసంఘాలతో మీటింగులు పెట్టి కులసంఘాల భవనాలకు, కులదేవతల ఆలయాలకు కావాల్సిన భూమి, ఫండ్స్ వేదికలపైనే మంజూరు చేశారు. ఇక వందలాది కమ్యూనిటీ హాళ్లు, ఆలయాలు, చర్చిలకు స్థలాలు, ఫండ్స్ శాంక్షన్ చేయడమేగాక... స్వయంగా కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి మంత్రులు, ఎమ్మెల్యేలు భూమి పూజలు చేసిన్రు. ఫండ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి, అప్పటికి రాబోయే మూడు నెలల్లో మరో రూ.300 కోట్లతో అన్ని పనులు పూర్తి చేస్తామని హామీలు ఇచ్చారని, అయితే, ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదన్నారు విజయశాంతి.

అందుకే కేసీఆర్‌ను గద్దెదించాలంటూ విజయశాంతి పిలుపు
ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతల కపట నాటకాలను గుర్తించిన ప్రజలు తమ ఓటుతో బీజేపీకి పట్టం కట్టి.. గులాబీ పార్టీని ఫామ్ హౌస్‌కు పరిమితం చేశారు. దీంతో ఓటమి నైరాశ్యంలో పడిన సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని అటకెక్కించడమే కాకుండా.... చేస్తానన్న పనులను ఒక్కటంటే ఒక్కటి కూడా చేసిన పాపానపోలేదు. దీన్ని బట్టి సీఎం కేసిఆర్‌కు కావాల్సింది ఓట్లు- సీట్లు మాత్రమే తప్ప, ప్రజల బాగు కాదని రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలి. రానున్న ఎన్నికల్లో ఈ దగాకోరు ముఖ్యమంత్రిని గద్దె దించేందుకు కంకణబద్దులై ఓట్ల రూపంలో తగిన బుద్ది చెప్పాలి అని విజయశాంతి పిలుపునిచ్చారు.