ఇక శెలవు: అభిమానులకు కృతజ్ఞతలంటూ విజయశాంతి కీలక ప్రకటన
హైదరాబాద్: ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న విజయశాంతి.. చాలా కాలం తర్వాత ఇటీవల ఓ తెలుగు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఈ లేడీ సూపర్‌స్టార్ కీలక పాత్రను పోషించి మరోసారి సినీ అభిమానులకు చేరువయ్యారు.

అటు రాజకీయాలు.. ఇటు సినిమాలు..
సంక్రాంతి పండగ సందర్భంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయశాంతి అటు రాజకీయాలతోపాటు సినిమాలు కూడా చేస్తూ సినీ, రాజకీయ అభిమానులకు చేరువగా ఉంటారని అంతా అనుకున్నారు. అయితే, తాజాగా విజయశాంతి తన ట్విట్టర్ ఖాతాలో చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

గొప్ప విజయాన్ని అందించారంటూ..
‘సరిలేరు_మీకెవ్వరు ఇంత గొప్ప విజయాన్ని నాకు అందించిన, నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తూ వస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు..
నా నట ప్రస్ధానానికి 1979 కళ్ళుకుల్ ఇరమ్,కిలాడి కృష్ణుడు నుండి నేటి 2020 సరిలేరునీకెవ్వరు వరకు ఆగౌరవాన్ని అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు.
' అని విజయశాంతి పేర్కొన్నారు.

ఇప్పటికి ఇక శెలవు..
‘ప్రజా జీవన పోరాటంలో నా ప్రయాణం... మళ్లీ మరో సినిమా చేసే సమయం, సందర్భం నాకు కల్పిస్తోందో, లేదో నాకు కూడా తెలియదు.. ఇప్పటికి ఇక శెలవు.
మనసు నిండిన మీ ఆదరణకు, నా ప్రాణప్రదమైన అభిమాన సైన్యానికి
ఎప్పటికీ నమస్సులు.. మీ విజయశాంతి' అంటూ మరో ట్వీట్ చేశారు.

సినిమాలు చేయాలంటూ అభిమానులు
కాగా, ఈ రెండు ట్వీట్లకు ఆమె అభిమానుల నుంచి భారీ స్పందన వస్తోంది. మీరు మరిన్ని సినిమాలు చేయాలంటూ అభిమానులు ట్విట్టర్ వేదికగా విజయశాంతిని కోరుతున్నారు. విజయశాంతి సినిమాలు మానేయడం లేదు.. మంచి పాత్ర వస్తే చేస్తారు అని మరో అభిమాని వ్యాఖ్యానించాడు. హీరో బాలయ్యతో సినిమా చేసిన తర్వాతే మీరు సినిమాలు ఆపేయాలంటూ మరో అభిమాని పేర్కొన్నాడు. విజయశాంతి గారూ.. మీరు మరిన్ని సినిమాలు చేయాలి.. మీ సినిమాల కోస పల్లెలు, పట్టణ ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. విజయశాంతి నుంచి రాములమ్మ లాంటి సినిమాలు రావాలంటూ మరో అభిమాని పేర్కొన్నాడు.