సెలవంటూ చిన్నమ్మకు రాములమ్మ భావోద్వేగ లేఖ..
హైదరాబాద్ : చిన్నమ్మ సుష్మ స్వరాజ్ మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు రాములమ్మ. చిన్నమ్మతో బీజేపీలో ఉన్నప్పుడు సాన్నిహిత్యం ఉంది విజయశాంతికి. ఆమెను తేజస్విని అని సుష్మ పిలిచేవారని సన్నిహితులు చెప్తుంటారు. సుష్మ మృతిని జీర్ణించుకోలేని రాములమ్మ భావోద్వేగంతో లేఖ రాశారు. అందులో ఆమెతో పరిచయం నుంచి రాజకీయాల్లో కలిసి పనిచేసే విధానాన్ని వివరించారు.
1998 జనవరి నెలలో ఢిల్లీలో సుష్మతో పరిచయం ఏర్పడిందని లేఖలో పేర్కొన్నారు విజయశాంతి. తాను బీజేపీలో చేరుతున్న సందర్భంగా సుష్మ తనతో మాట్లాడారనిగుర్తుచేశారు. హిందీ కర్తవ్యం సినిమాలో పాత్ర పేరు తేజస్విని అని విజయశాంతి తెలిపారు. ఆ పేరుతోనే సుష్మ పిలిచేవారని చెప్పారు. బళ్లారి నుంచి సుష్మ పోటీచేసిన సమయలో ఇప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఇంచార్జీగా ఉండేవారని మననం చేసుకున్నారు. దాదాపు 8 రోజులు 40 సభలు, ర్యాలీలు చేపట్టామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంట్లో పోరాడుతుంటే అరచి అరచి నా బిడ్డ గొంతుపోయింది. గులాబ్ జామున్ తింటే సర్దుకుంటుంది అని తినిపించేవారని గుర్తుచేశారు. కేసీఆర్ నిరాహార దీక్ష సందర్భంగా చాలామంది ఢిల్లీ నేతలు మొహం చాటేసిన సమయంలోనే .. కోరిన ప్రతీసారి సభలు, సమావేశాలకు వచ్చేవారని పేర్కొన్నారు.

కూతురితో సుష్మ అంత్యక్రియలు
హిందు సాంప్రదాయం ప్రకారం భర్త, లేదంటే కుమారుడు అంత్యక్రియలు నిర్వహించాలి. కానీ వారికి కుమారుడు లేనందున కూతురితో సుష్మ అంత్యక్రియలు జరిపించారు. భర్త స్వరాజ్ కౌశల్ నిర్వహించొచ్చు కానీ .. బన్సూరి అంటే సుష్మకు ఎనలేని ప్రేమ అని బంధువులు చెప్తున్నారు. అందుకోసమే ఆమెతో అంత్యక్రియల ఘట్టం ముగించారు. సుష్మ స్వరాజ్‌ను కడసారి చూసి భావోద్వేగానికి గురయ్యారు స్వరాజ్ కౌశల్, బన్సూరి. బంధుమితరుల ఆశ్రునయనాల మధ్య సుష్మ అంత్యక్రియలు ముగిసాయి. అంతకుముందు బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఎండీహెచ్ వ్యవస్థాపకుడు గులాటీ తదితరులు అంజలి ఘటించారు.