మూడోసారి ప్రోటోకాల్ ఉల్లంఘన: ప్రధాని మోదీని ఆహ్వానించేందుకు వెళ్లని కేసీఆర్, యశ్వంత్ సిన్హాకు ఆహ్వానం
తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ బీజేపీల మధ్య పొలిటికల్ వార్ పీక్స్ కు చేరుకుంది. తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేస్తూ బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రులతో పాటు, బిజెపి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ కు వస్తున్నారు.

ముచ్చటగా మూడో సారి ప్రోటోకాల్ ఉల్లంఘించిన సీఎం కేసీఆర్
నేడు, రేపు జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేడు హైదరాబాదులోని బేగంపేట ఎయిర్ పోర్ట్ కు రానున్నారు. ఈ క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం కేసీఆర్ స్వాగతం పడాల్సి ఉంటుంది. అయితే ప్రోటోకాల్ ను సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడోసారి ఉల్లంఘించారు. మోడీకి స్వాగతం పలకటానికి ఆసక్తి చూపించని తెలంగాణా సీఎం కెసీఆర్ మోడీకి ఊహించని షాక్ ఇచ్చారు. యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలకటానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళారు.

కెసీఆర్ కు బదులు మంత్రి తలసాని స్వాగతం.. గతంలోనూ రెండు సార్లు మోడీకి కేసీఆర్ షాక్
కెసిఆర్ కు బదులుగా, పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ డెవలప్మెంట్ మరియు సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి స్వాగతం పలుకుతారు. రాష్ట్రానికి ప్రధాని మోదీ గత రెండు పర్యటనల సందర్భంగా కూడా టీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రోటోకాల్ వివాదం చోటు చేసుకుంది. టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న క్రమంలో గతంలో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పటికీ కెసిఆర్ ఆయనను స్వాగతించలేదు. అప్పుడు కూడా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నే పంపించారు.

ఆరునెలల్లో మోడీ రెండు సార్లు వచ్చినా ఆహ్వానించని కెసీఆర్ ,.. నేడు కూడా అదేతీరు
గతంలో ఫిబ్రవరిలో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. అప్పుడు కూడా కెసిఆర్ మోడీ ని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళలేదు. ఆ తర్వాత మే నెలలో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆ సమయంలో కూడా కెసిఆర్ మోడీ రాకను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఇప్పుడు ముచ్చటగా మూడోసారి దేశ ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ప్రోటోకాల్ ప్రకారం స్వాగతం పలకకుండా కెసిఆర్ బీజేపీ ప్రభుత్వం పై తన వ్యతిరేకతను తెలియజేశారు.

రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కేసీఆర్ స్వాగతం .. షాకింగ్ ట్విస్ట్ ఇదే
ఇక ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాను రిసీవ్ చేసుకోవడానికి విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలకడానికి సీఎం కేసీఆర్ స్వయంగా వెళ్లారు. ఆయనకు స్వాగతం పలికి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌నుంచి జలవిహార్‌కు 5వేల మందితో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో 4 లోక్‌సభ స్థానాలు, 48 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డులు, దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ కీలకంగా ఎదగాలని ప్రయత్నిస్తుంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కెసిఆర్ బిజెపిని టార్గెట్ చేస్తున్నారు. ఏదిఏమైనా ప్రధాని మోడీ విషయంలో ప్రోటోకాల్ పాటించని కేసీఆర్ పై బీజేపీ శ్రేణులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.