దొంగనోట్లను చెలామణి చేస్తున్న ముఠా: వరంగల్ పోలీసులకు అడ్డంగా దొరికారు ఇలా!!
దొంగ నోట్లను చెలామణి చేస్తున్న నిందితులను వరంగల్ సిసిఎస్ మరియు మాట్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గనిశెట్టి నగేష్, గొర్రెల మురళీమోహన్ అనే ఇద్దరు నిందితులు జల్సాలకు అలవాటుపడి జల్సాల కోసం సులువుగా డబ్బులు సంపాదించటానికి అమాయక ప్రజలను నమ్మించి, వారినుండి అసలు డబ్బులు తీసుకొని వాటికి బదులు మూడింతలు 500 రూపాయల సైజు గల నల్ల కాగితాలు యిచ్చి మోసం చేయడం మొదలుపెట్టారు.
దొంగనోట్ల చెలామణితో ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అని చూస్తున్న చాలా మందిని మోసం చేస్తున్నారు ఈ కేటుగాళ్ళు . ఇదే క్రమంలో సుమారు రెండు నెలల క్రిందట హైదరాబాడ లోని ఫిలిం నగర్ డీజే బార్ లో మేడిచెర్ల మోహన్ అనే వ్యక్తితో నిందితులకు పరిచయం ఏర్పడింది. అతనికి తమ వద్ద నకిలీ నోట్లు ఉన్నాయని, వాటిని మార్కెట్ లో అసలు వాటిగా చెలామణి చేసుకోవచ్చని నమ్మించారు. దీనికోసం ఒక లక్ష కు గాను మూడింతలు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పారు. మోహన్ ను అసలు నోట్లు తీసుకుని వరంగల్ ఎంజీఎం సెంటర్ వద్దకు రమ్మనగా బాధితుడు వారిని పోలీసులకు పట్టించాలని నిర్ణయించుకున్నాడు.

దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీసీఎస్ మరియు మట్వాడ పోలీసులు నేరస్తులను ఎంజీఎం వద్ద వల పన్ని పట్టుకున్నారు. దొంగ నోట్లను చెలామణి చెయ్యటానికి బ్యాగ్ తో సహా వచ్చిన వారిని గుర్తించి పట్టుకున్నారు. సదరు నేరస్తుల నుండి 30 నకిలీ నల్ల కాగితాల కట్టలను, అయోడిన్ టోనర్ బాటిల్ మరియు నిమ్మ రసం బాటిల్ ను పోలీస్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గతంలో ఎక్కడ ఎక్కడ వీరు దొంగనోట్లను చలామణి చేశారు అన్నదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇక దొంగనోట్లను చలామణి చేయడానికి ప్రయత్నించిన ముఠాను పట్టుకున్న పోలీసులను వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి అభినందించారు. దొంగనోట్ల చెలామణి చేసే ఇలాంటి వాళ్ల మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని ఆయన సూచించారు. దురాశ దుఃఖానికి చేటు అవుతుందని పేర్కొన్నారు.