
నువ్వా నేనా.. వరంగల్ తూర్పులో ఎమ్మెల్యే నరేందర్ వర్సెస్ సీనియర్ నాయకులు; సైలెంట్ వార్!!
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో వర్గ పోరు తారాస్థాయికి చేరుకుంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల మధ్య గ్రూప్ వార్ స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఒకే పార్టీలో ఉన్న నేతలు కొట్లాడుతున్న తీరు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. పార్టీ శ్రేణులకు ఇబ్బందికరంగా మారింది. స్థానికంగా పట్టుకోసం ప్రయత్నాలు చేస్తున్న నేతలు ఒకరినొకరు నిలువరించే ఎత్తుగడలు వేస్తుండటం పార్టీ శ్రేణులకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

వరంగల్ తూర్పు నేతల మధ్య వర్గ పోరు
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య గొడవలు నిత్యకృత్యంగా మారాయి. నేతల్లో ఎవరికీ సరైన సయోధ్య లేదు. ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి నెలకొంది. నియోజకవర్గంలో గతంలో మంత్రిగా పనిచేసిన బస్వరాజు సారయ్య, మాజీ రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసి ప్రస్తుతం మేయర్ గా కొనసాగుతున్న గుండు సుధారాణి, మాజీ మేయర్, వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే, నన్నపునేని నరేందర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ కు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కూడా మంచి సంబంధాలు లేవని తెలుస్తుంది .

ఎమ్మెల్యే వర్సెస్ సీనియర్లు ...వరంగల్ తూర్పులో సైలెంట్ వార్
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో, గతంలో టిఆర్ఎస్ పార్టీలో కొండా సురేఖ ఎమ్మెల్యేగా ఉన్న నాటి నుంచి కూడా ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉంది. ఇక కొండా సురేఖ పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయినా పార్టీలో మాత్రం పరిస్థితి ఏమీ మారలేదు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఇటీవల చోటు చేసుకున్న అనేక సంఘటనలు పార్టీ నేతల్లో ఉన్న అంతర్గత పోరును బయటపెడుతున్నాయి.
స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ మిగతా నేతలను ఖాతరు చేయడం లేదని, దీంతో వారంతా ఒకటిగా కూటమి కట్టారని స్థానికంగా వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఒక్కటే ఒక వర్గంగా, మిగతా సీనియర్లంతా ఆయనకు వ్యతిరేక వర్గంగా నియోజకవర్గంలో ఉండటంతో పార్టీ శ్రేణులు ఇబ్బంది పడుతున్నాయి.

సీనియర్ నాయకులను పిలవకుండానే ఎమ్మెల్యే కార్యక్రమాలు .. దీంతో సీనియర్ల కూటమి
నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు నన్నపనేని నరేందర్, నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ నాయకులను ఎవరిని పిలవడం లేదన్న ప్రచారం ఉంది. స్థానిక ఎంపీ ని, ఎమ్మెల్సీ ని, మేయర్ ను, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ ల ను ఎవరిని పిలవకుండా నన్నపనేని నరేందర్ ఒక్కడే కార్యక్రమాలకు హాజరవుతున్న తీరు నేతలకు ఏమాత్రం రుచించడం లేదు.
నియోజకవర్గంలో తమ ప్రాతినిధ్యాన్ని తగ్గించడం కోసమే ఎమ్మెల్యే పని చేస్తున్నారన్న భావన అందరిలోనూ వ్యక్తమవుతోంది. దీంతో ప్రస్తుతం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తమ్ముడు ప్రదీప్ రావు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణి ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది.

స్థానికంగా పట్టు కోసం సీనియర్లకు చెక్ పెడుతున్న ఎమ్మెల్యే నరేందర్
గతంలో మేయర్ గా పనిచేసిన నన్నపనేని నరేందర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పై పట్టు కోసం తన వర్గానికి చెందిన రిజ్వాన షమీమ్ కు డిప్యూటీ మేయర్ పదవిని ఇప్పించుకున్నారు. ఇక దీనిపై మేయర్ గుండు సుధారాణి ఇప్పటికీ గుర్రుగానే ఉన్నట్టు సమాచారం. ఇక బస్వరాజ్ సారయ్య మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన మల్టీ కల్చరల్ కాంప్లెక్స్ ను క్యాన్సిల్ చేసి అక్కడ హోటల్ హరిత కట్టాలని నిర్ణయం తీసుకోవడంతో బస్వరాజు సారయ్య కూడా ఎమ్మెల్యే తీరు పై తీవ్ర అసహనంతో ఉన్నారు.
స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస ప్రమాణ స్వీకారం సందర్భంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు వర్గం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు చించివేయడం తో ఎర్రబెల్లి ప్రదీప్ రావు సైతం ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.

మంత్రి ఎర్రబెల్లితోనూ ఎమ్మెల్యే నరేందర్ కు విబేధాలు
ఇక ఎంజీఎంలో ఇటీవల చోటు చేసుకున్న ఎలుకలు రోగిని కొరికిన ఘటనతో ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న శ్రీనివాసరావును బదిలీ చేయడంతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పై ఎమ్మెల్యే నరేందర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ ఇటీవల నిర్వహించిన రైతు సభకు మంత్రి ఉన్న సమయంలో ఎమ్మెల్యే హాజరుకాకుండా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెళ్లిపోయిన తర్వాత రైతు సభలో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు చెక్ పెట్టాలని సీనియర్లు, సీనియర్లకు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే
ఏది ఏమైనా నియోజకవర్గం మీద పట్టు కోసం ఎమ్మెల్యే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంటే, తమ ప్రాధాన్యతను దెబ్బతీస్తున్నారని సీనియర్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే కు చెక్ పెట్టాలని సీనియర్ నాయకులు, నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులకు చెక్ పెట్టాలని ఎమ్మెల్యే చేస్తున్న ప్రయత్నాలతో పార్టీలో గందరగోళ వాతావరణం చోటు చేసుకుంది. ఇక గులాబీ నేతల మధ్య వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సైలెంట్ వార్ కొనసాగుతుంది.