హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను ఓ జిల్లాను దత్తత తీసుకుంటా, నిర్లక్ష్యం వద్దు: అధికారులకు సీఎం కేసీఆర్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాలు నూటికి నూరుశాతం అభివృద్ధిని సాధించేందుకు అందరి భాగస్వామ్యం అవసరమనీ, ఆ క్రమంలో తాను కూడా స్వయంగా ఒక జిల్లాను దత్తత తీసుకుని పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ఆదివారం ప్రగతి భవన్ లో జిల్లాల అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయితీ రాజ్ అధికారుల (డిపీవో) తో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల పురోగతిని, అంశాల వారిగా వారు చేరుకున్న లక్ష్యాలను సీఎం సుధీర్ఘంగా సమీక్షించారు.

ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి. వినోద్ కుమార్, మాజీ మంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు హన్మంతు షిండే, విద్యాసాగర్ రావు, చిరుమర్తి లింగయ్య, పట్నం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, పీసీసీఎఫ్ శోభ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, సీఎం ఓస్డీలు ప్రియాంక వర్ఘీస్, గంగాధర్, వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ, హెల్త్ డైరక్టర్ శ్రీనివాస రావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, పంచాయతీ రాజ్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్ రావు, మున్సిపల్ డైరక్టర్ సత్యనారాయణ, లతో పాటు పంచాయతీ రాజ్ శాఖ, మున్సిపల్ శాఖ, అటవీ శాఖ, వైద్య అధికారులు, అన్ని జిల్లాల అదనపు కలెక్టర్లు, డిపివోలు పాల్గొన్నారు.

ఆకస్మిక తనిఖీలుంటాయంటూ కేసీఆర్..

ఆకస్మిక తనిఖీలుంటాయంటూ కేసీఆర్..

పల్లెలు, పట్టణాలను ప్రగతి పథంలో నడిపించేందుకు జిల్లా అదనపు కలెక్టర్లు, జిల్లా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ శాఖ అధికారులు కంకణబద్ధులు కావాలని, గ్రామాలు పట్ణణాల అభివృద్ధిని ఒక యజ్ఞంలా భావించి కృషి చేయాలని సీఎం పిలుపునిచ్చారు. వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మొక్కలు నాటే హరితహారం కార్యక్రమాన్ని త్వరలో చేపట్టాలని అధికారులకు సూచించారు. తాను చేపట్టబోయే ఆకస్మిక తనిఖీలు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లో మెక్కలు నాటడం తదితర కార్యక్రమాల పురోగతి తనిఖీలో భాగంగానే సాగుతాయని సీఎం స్పష్టం చేశారు. ఇంతగా తాను సమావేశం నిర్వహించి వివరించినా తమ పనితీరు చక్కదిద్దుకోకపోతే క్షమించే ప్రసక్తేలేదన్నారు. తన ఆకస్మిక తనిఖీ నేపథ్యంలో పనితీరు బేరీజు వేసి కఠిన చర్యలుంటాయని, ఆ తర్వాత ఎవ్వరు చెప్పినా వినేదిలేదని అదనపు కలెక్టర్లకు డిపివోలకు సీఎం మరోసారి తేల్చి చెప్పారు.

జూన్ 20 న సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అకస్మిక తనిఖీలుంటాయని సీఎం తెలిపారు. జూన్ 21 న వరంగల్ జిల్లాలో సీఎం ఆకస్మిక తనిఖీలుంటాయన్నారు. వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా కలెక్టరు కార్యాలయాన్ని ప్రారంభించి, నూతనంగా నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవఖానకు శంఖుస్థాపన చేయనున్నట్లు సీఎం తెలిపారు.
స్థానిక సంస్థల సమస్యలను పరిష్కరించే క్రమంలో అప్పటికప్పుడు కొన్ని అవసరమైన నిధులను మంజూరు చేయడానికి ప్రతీ జిల్లా అడిషనల్ కలెక్టర్ కు 25 లక్షల రూపాయలను తక్షణమే కేటాయించాలని ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారు. ఈ సమావేశం ముగిసేలోపే ఈ మేరకు దీనికి సంబంధించిన జీవోను అడిషనల్ కలెక్టర్లకు అందించారు.

వైద్యం, ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు

వైద్యం, ప్రజారోగ్య వ్యవస్థ బలోపేతానికి చర్యలు

కరోనా లాంటి వ్యాధుల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వైద్యరంగంలో మౌలిక వసతులను పూర్తి స్థాయిలో మెరుగుపరుస్తామని సీఎం తెలిపారు. ఇటీవలె 7 మెడికల్ కాలేజీలను మంజూరు చేయడం జరిగిందని, వరంగల్ సెంట్రల్ జైలు స్థానంలో అద్భుతమైన మల్టీ సూపర్ స్పెషాలిటి హాస్పటల్ ను దేశంలోనే మెరుగైన సౌకర్యాలతో నిర్మిస్తామని సీఎం ప్రకటించారు.

వరంగల్లులో విశాల ప్రదేశంలో నిర్మించ తలపెట్టిన మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానను, 24 అంతస్తులతో అత్యంత ఆధునిక సాకేంతిక హంగులతో గ్రీన్ బిల్డింగ్ గా తీర్చిదిద్దాలని సీఎం తెలిపారు. అత్యవసర చికిత్సకోసం వచ్చే పేషెంట్లకోసం దవాఖానా బిల్డింగ్ మీదనే హెలీకాప్టర్ దిగే విధంగా హెలీపాడ్ ను నిర్మించాలన్నారు. కెనడా మోడల్ లో, ధారాళంగా గాలి వెలుతురు ప్రసరించే విధంగా క్రాస్ వెంటిలేషన్ పద్దతుల్లో హాస్పటల్ నిర్మాణముండాలని, వైద్యాధికారులను సీఎం ఆదేశించారు. అందుకు కెనడా పర్యటించి రావాలన్నారు.

నిర్లక్ష్యం వహిస్తే క్షమించే ప్రసక్తేలేదు: కేసీఆర్

నిర్లక్ష్యం వహిస్తే క్షమించే ప్రసక్తేలేదు: కేసీఆర్

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ 'పల్లెలు, పట్టణాలను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచే క్రమంలో అదనపు కలెక్టర్లు, డీపీవోలు కష్టపడి పనిచేస్తున్నరు. ఇందులో కాదనేదేమీ లేదు. అయితే ఆశించినంత పని జరుగుతలేదని క్షేత్రస్థాయినుంచి నాకు నివేదికలు అందుతున్నయి. అందుకే నేను మీకు పదే పదే చెప్పవలసి వస్తున్నది. మీకు కావలసినంత సమయం ఇచ్చిన తర్వాతనే నేను ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని నిర్ణయించాను. దానికి ముందు మరోసారి మీతో మాట్లాడి మీ అభిప్రాయాలను కూడా తీసుకుందామని నేటి సమావేశాన్ని ఏర్పాటు చేశాను. చెప్పకపోతే నాది తప్పు. ఇంత చెప్పినంక కూడా ఇంకా ఎవరైన అదనపు కలెక్టర్లు డిపీవోలు వారి వారి పనితీరును మెరుగుపరుచుకోకుండా, తప్పులను సరిదిద్దుకోకుండా, అలసత్వం వహించి, నిర్దేశిత బాధ్యతల పట్ల నిర్లక్ష్యం వహించినట్లు గనుక నా తనిఖీల సందర్భంగా నిరూపణ అయితే ఇక ఎవరు చెప్పినా వినను. క్షమించే ప్రసక్తే లేదు. తక్షణమే కఠిన చర్యలుంటాయి.' అని సీఎం పునరుద్ఘాటించారు. తన పర్యటనకు ఇంకా పదిరోజుల సమయం ఉన్నందున ఈ లోపు ఏవైనా తప్పొప్పులుంటే సరిదిద్దుకోవాలని సూచించారు. గ్రామసభలు జరపకపోతే గ్రామ కార్యదర్శులను, సర్పంచ్ లను సస్పెండ్ చేయాలని, ఈ విషయంలో అధికార పార్టీ అని కూడా చూడొద్దని, టిఆర్ఎస్ సర్పంచులు తప్పు చేస్తే ముందు వాళ్ల మీదే చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు.

సేవ్ ద పీపుల్ సేవ్ ద విలేజెస్ సేవ్ యువర్ సెల్ఫ్

సేవ్ ద పీపుల్ సేవ్ ద విలేజెస్ సేవ్ యువర్ సెల్ఫ్

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బయేండ్లు దాటినా పల్లెలు, పట్టణాల్లో ఆశించనమేరకు అభివృద్ధి చోటుచేసుకోకపోవడం పట్ల సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీరు దాకా దేశవ్యాప్తంగా గ్రామీణాభివృద్ధి మొదటినుంచి నిర్లక్ష్యానికి గురవుతుండడం శోచనీయమన్నారు. ఇందుకు అధికార యంత్రాంగం మానసిక ధోరణికూడా ప్రబలకారణమని సీఎం అభిప్రాయపడ్డారు. పాతపద్దతులను వదిలి, నిత్యనూతనంగా ప్రజాక్షేత్రంలో మమేకమై, గ్రామాభివృద్ధికోసం తమకు అందివచ్చిన గొప్ప అవకాశాన్ని యువ కలెక్టర్లు అందిపుచ్చుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. మూస ధోరణులు వైఖరులను మార్చుకొని సామర్ధ్యాన్ని పెంచుకొని పట్టుదలతో కృషిచేసి గొప్పపేరుతెచ్చుకోవాలని కోరారు. తమకోసం పనిచేసే ఆదర్శవంతమైన కలెక్టర్లను ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని సోదాహరణలతో వారికి పలువురు ఆదర్శవంతంగా పనిచేసిన గత కలెక్టర్ల పేర్లను సీఎం ఉదహరించారు. గ్రామ సభలు నిర్వహించి, గ్రామ ఆర్ధిక నివేదికల మీద చర్చలు చేపట్టేలా చర్యలుతీసుకోవాల్సిన బాద్యత డిపీవోలదేనని సీఎం స్పష్టం చేశారు. గ్రామ ఉద్యోగుల జీతాల చెల్లింపులు, కరెంటు బిల్లుల చెల్లింపు, ట్రాక్టర్ కిస్తీల చెల్లింపు, గ్రీన్ కవరేజీ కోసం ఖర్చు అనే అంశాలు 'చార్జుడు అకౌంట్' కిందికి వస్తాయని, వీటికి ముందు నిధులు కేటాయించిన తర్వాతే మిగతా వాటికి చెల్లించాలని సీఎం స్పష్టం చేశారు. పల్లె ప్రకృతి వనాలకోసం ప్రభుత్వ భూమి దొరకని పక్షంలో గ్రామ నిధులనుంచి ప్రయివేట్ భూమిని కొనుగోలు చేయాలని సూచించారు.

నిరంతరం డిపీవోలు, డిఎల్పీవోలు, ఎంపీడీవో లతో సమావేశాలు నిర్వహించాలని, అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధి మీదనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. 'సేవ్ ద పీపుల్ సేవ్ ద విలేజెస్ సేవ్ యువర్ సెల్ఫ్'' (ప్రజలను, గ్రామాలను కాపాడండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి ), అని అదనపు కలెక్టర్లు డీపీవోలకు సీఎం స్పష్టం చేశారు. పనితీరు సరిగా లేనప్పుడు షోకాజ్ నోటీసులు పంపడమే కాదు, తర్వాత వాటి మీద తాత్సారం చేయకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

నేనూ ఓ జిల్లాను దత్తత తీసుకుంటా: కేసీఆర్

నేనూ ఓ జిల్లాను దత్తత తీసుకుంటా: కేసీఆర్

అన్ని అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించినా కూడా, నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించకోపోవడం నేరమని సీఎం అధికారులను ఉద్దేశించి స్పష్టం చేశారు. ''నేల విడిచి సాము చేయడం అనేది మనకు అలవాటయ్యింది. మన పక్కన్నే చేయవలసినంత పని వున్నది. అది ఒదలి ఎక్కన్నో ఏదో చేయాలనుకోవడం సరికాదు. ఆరునెల్ల పాటు కష్టపడండి. గ్రామాలు, పట్టణాలు ఎందుకు అభివృద్ధి కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలం'' అని సీఎం అన్నారు. ''నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంట. అదనపు కలెక్టరు నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం.'' అని సీఎం స్పష్టం చేశారు.

English summary
warnging to officials: Telangana cm kcr review on pattana pragathi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X