పాండవుల మాదిరిగా మోడీని గద్దెదించుతాం, ఫ్రంట్ కోసం కెసిఆర్ ఫోన్ : ఏచూరి
హైదరాబాద్: దేశంలో వామపక్షాల ఐక్యత, ప్రజా ఉద్యమాలతో మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించుతామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. మతోన్మాదాన్ని పెంచి, హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు రేపి, వాటి వల్ల హిందుత్వ ఓటు బ్యాంకుతో బీజేపీ లాభపడుతోందన్నారు.
సీపీఎం 22వ, మహాసభల ముగింపు సందర్భంగా హైద్రాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు. తొలుత మలక్పేట నుండి రెడ్షర్ట్ వాలంటీర్లు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సభలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై సీపీఎం అగ్రనేతలు నిప్పులు చెరిగారు. తెలంగాణలో కూడ సీపీఎంకు పూర్వ వైభవం వస్తోందని నేతలు ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మోడీని గద్దెదిస్తాం
నాలుగేళ్ళలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు రాలేదని సీతారాం ఏచూరి చెప్పారు. నిరుద్యోగం, వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. మతోన్మాదాన్ని పెంచి, హిందూ, ముస్లింల మధ్య ఘర్షణలు రేపి, వాటి వల్ల హిందుత్వ ఓటు బ్యాంకుతో బీజేపీ లాభపడుతోందని ఏచూరి ఆరోపించారు.దేశ ఐక్యతకి ముప్పు పొంచి ఉందన్నారు. దేశంలో ఏనాడూ కూడ ఈ తరహ పరిస్థితులు లేవన్నారు.గోరక్ష పేరుతో దాడులు జరుపుతున్నారని, ఏ రకమైన బట్టలు వేసుకోవాలి? ఎలాంటి తిండి తినాలి? ఎటువంటి వారితో స్నేహం చేయాలి? అన్న విషయాలన్నీ వారే చెబుతున్నారని విమర్శించారు."రామాయణం కథ చెప్పి రాముడి పేరుని ఉపయోగించుకుంటూ ఓట్లు పొందారు. కానీ, మహాభారతం కథని మర్చిపోయారు.. మహా భారతంలో కౌరవ సైన్యాన్ని ఐదుగురు పాండవులు ఓడించారని చెప్పారు. అదే తరహాలో వామపక్ష ఐక్యతని బలపర్చాలి ప్రజా ఉద్యమాలు బలపర్చాల్సిందిగా కోరారు.. కౌరవ సేనల్లా వ్యవహరిస్తోన్న అధికారంలో ఉన్న . వామపక్షాల ఐక్యత, ప్రజా ఉద్యమాలతో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని చెప్పారు.

అధికారం కోసం ఫ్రంట్ వద్దు
మూడో కూటమి ఏర్పాటు విషయమై తెలంగాణ సీఎం కెసిఆర్ తనతో మాట్లాడారని సీపీఎం జాతీయ ప్రధాన కార్శదర్శి సీతారాం ఏచూరి చెప్పారు. అధికారం కోసమే మూడో కూటమి వస్తే ఉపయోగం ఉండదు. మూడో కూటమి విధానాలను చూసి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు.. దేశ భవిష్యత్తు ఎర్రజెండా, నీలి జెండాపై ఆధారపడి ఉంటుందన్నారు. తెలంగాణలో సీపీఎంకు పూర్వవైభవం తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. తమ్మినేని పాదయాత్ర తర్వాత సామాజిక న్యాయం వైపు చర్చ జరిగిందన్నారు. లాల్, నీల్ జెండాల ఐక్యత దిశగా సాగుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దేశంలో అసమానతలు పెరిగాయి
దేశంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సరళీకరణ విధానాల అమలులో వేగాన్ని పెంచిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ చెప్పారు.హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చిందన్నారు.హిందూత్వ ఎజెండాను ముందుకు తెచ్చారని చెప్పారు. కానీ, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సీపీఎం ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన చెప్పారు. మతత్వ ఉద్రిక్తతలు లేని రాష్ట్రంగా కేరళ రాష్ట్రాన్ని నిలబెట్టినట్టు చెప్పారు.
సామాజిక భద్రతను కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటం నిర్వహించిన గడ్డపై నిలబడి మాట్లాడడం తనకు సంతోషంగా ఉందన్నారు.

ఆర్ఎస్ఎస్ నియంత్రణలో బిజెపి సర్కార్
దేశంలో బిజెపి ప్రభుత్వం కొనసాగుతోందని, కానీ, ఆ ప్రభుత్వాన్ని ఆర్ఎస్ఎస్ నియంత్రిస్తోందని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ ఆరోపించారు. దేశంలో సంక్షిష్ట పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజా పోరాటాలను పెద్ద ఎత్తున నిర్వహించడం వల్లనే ఈ పరిస్థితుల నుండి బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు.రైతలు ఆత్మహత్యలు విపరీతంగా పెరిగాయన్నారు. అవినీతి తారాస్థాయికి చేరుకొందన్నారు.