నాగం బలమైన నాయకుడు: చిన్నారెడ్డి , కానీ, అప్పుడిలా, రావుల చంద్రశేఖర్‌రెడ్డికి బంపర్ ఆఫర్
హైదరాబాద్: మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి లాంటి బలమైన నాయకుడు కాంగ్రెస్ పార్టీలోకి రావాలని తీసుకొన్న నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి చిన్నారెడ్డి చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు చిన్నారెడ్డి.
శుక్రవారం నాడు మాజీ మంత్రి చిన్నారెడ్డి హైద్రాబాద్‌లో మీడియాతో చిట్ చాట్ చేశారు. 2019 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాల్సిన అవసరం ఉందన్నారు.
నాగంకు షాక్: జైపాల్‌కు, ఆయనకు అండర్స్టాండింగ్, ఓటమి ఖాయం: దామోదర్ రెడ్డి
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయని చిన్నారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో ఇతర పార్టీలకు చెందిన నేతల చేరికలతో ఆ పార్టీలో కొంత ఉత్సాహం కన్పిస్తోంది.

నాగం జనార్ధన్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నా
మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నట్టు మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి చెప్పారు. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో నాగం బలమైన నాయకుడు.. రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన ప్రభావం ఉంటుందన్నారు. బలమైన నాయకులు ఎవరు పార్టీలోకి వస్తానన్నా ఆహ్వానించాల్సిందేనని చిన్నారెడ్డి చెప్పారు.ఎమ్మెల్సీగా దామోదర్ రెడ్డి విజయం కోసం నాగం జనార్ధన్ రెడ్డి సహకరించిన విషయాన్ని మర్చిపోకూడదని చిన్నారెడ్డి గుర్తు చేశారు.

నాగంపై నాడు పరువు నష్టం దావా వేసిన చిన్నారెడ్డి
2004-2009 లో మహబూబ్‌నగర్ జిల్లా నుండి చిన్నారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో నాగం జనార్ధన్ రెడ్డి టిడిపిలో ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రిపై ఆనాడు నాగం జనార్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. మంత్రి చిన్నారెడ్డి కూడ నాగంపై ప్రతి విమర్శలు చేశారు. అయితే ఆ సమయంలో చిన్నారెడ్డి విద్యార్హతపై నాగం ఆరోపణలు చేశారు.దీంతో నాగం జనార్ధన్ రెడ్డిపై చిన్నారెడ్డి పరువు నష్టం దావా వేశాడు.

2009 ఎన్నికలకు ముందు ఇరువురి రాజీ
అయితే 2009 ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మహబూబ్ నగర్ కోర్టులో అప్పటి మంత్రి చిన్నారెడ్డి, మాజీ మంత్రి అప్పటి టిడిపి నేత నాగం జనార్ధన్ రెడ్డిలు ఈ కేసు విషయమై రాజీ కుదిరింది. ఈ రాజీ కుదరడంతో నాగం కు ఊరట లభించింది.

ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి తీరును తప్పుబట్టిన చిన్నారెడ్డి
నాగం జనార్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరకుండా ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి నిలువరించే ప్రయత్నం చేయడాన్ని మాజీ మంత్రి చిన్నారెడ్డి తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలంటే బలమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో అవసరం ఉందన్నారు. నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం లేదన్నారు.

రావుల చంద్రశేఖర్ రెడ్డికి కాంగ్రెస్ లోకి ఆహ్వనం
టిడిపి నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని కూడ కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మాజీ మంత్రి చిన్నారెడ్డి ఆహ్వనించారు. రావుల చంద్రశేఖర్ రెడ్డి నా కంటే బలమైన అభ్యర్థిగా భావిస్తే వనపర్తిలో తన సీటును త్యాగం చేస్తానని చిన్నారెడ్డి చెప్పారు.